Bandi Sanjay: ఎవరు ఔనన్నా కాదన్నా.. బండి సంజయ్ కే పగ్గాలు అంతే

తెలంగాణలో గత కొన్ని రోజులుగా బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు ఒక్కతాటిపై ఉన్న నేతలు ఇప్పుడు గ్రూపులుగా విడిపోయారన్న ప్రచారం జోరుగా సాగింది.

  • Written By: SS
  • Published On:
Bandi Sanjay: ఎవరు ఔనన్నా కాదన్నా.. బండి సంజయ్ కే పగ్గాలు అంతే

Bandi Sanjay: కర్ణాటకలో దెబ్బతిన్న బీజేపీ తెలంగాణ వైపు ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తెలంగాణను ప్రత్యేకంగా తీసుకున్న ఢిల్లీ పెద్దలు చాలా సార్లు రాష్ట్రంలో పర్యటించారు. అధికార బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఇంతలో పార్టీ రాష్ట్రానికి చెందిన కొందరి వ్యవహార శైలిని చూస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా? అనే అనుమానాలు మొదలయ్యాయ్యి. మొన్నటి వరకు బీజేపీలో అందరూ ఏకతాటిపై ఉన్న వారు ఇప్పుడు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారనన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడిని మార్చాలనే విధంగా కొందరు వ్యాఖ్యలు చేయడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపినట్లయింది.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు ఒక్కతాటిపై ఉన్న నేతలు ఇప్పుడు గ్రూపులుగా విడిపోయారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చేస్తారా? అన్న రీతిలో చర్చలు జరిగాయి. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ మొదట్లో దూకుడుగా ఉన్నా.. ఆ తరువాత మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సొంత పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలో కుస్తీ.. ఢిల్లీలో కుస్తీ.. అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు పార్టీని రెండు వర్గాలుగా చీల్చడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక తరువాత బీజేపీ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. అధ్యక్షుడి మాటను ఎవరూ వినడం లేదన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ నిర్వహించే సమావేశానికి ప్రముఖులు కనిపించడం లేదు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొంత జిల్లాకు చెందిన ఈటల రాజేందర్ ను ఆహ్వానించలేదు. ఈ కార్యక్రమం కరీంనగర్ లో నిర్వహించినా కేవలం బండి సంజయ్ మాత్రమే ఒంటిచేత్తో నడిపించడం గమనార్హం.

ఈ తరుణంలో బండి సంజయ్ అందరినీ కలుపుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర పార్టీ లనుంచి వచ్చిన వారంతా ఒక గ్రూపుగా మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈటల రాజేందర్ ను అధ్యక్షుడిగా చేస్తే తామంతా కలిసి వస్తామన్న ధోరణిలో కొందరు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. అయతే అటు ఈటల రాజేందర్ సైతం సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారే తప్ప పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించడం లేదు.

ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి ఓ సందేశం వచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల వరకు బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ నే కొనసాగుతారన్న విషయం స్పష్టమైందని తెలుస్తోంది. దీంతో ఇంతకాలం బండిని మారుస్తారన్న ప్రచారానికి తెరపడినట్లు తెలుస్తోంది. మరి బండికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లు ఆయనతో కలిసి వస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. పార్టీలు మారేవారు ఎప్పటికైనా మారుతారని, మొదటి నుంచి ఉన్నవాళ్లే కొనసాగుతారని బండి వర్గం పేర్కొంటోంది.

సంబంధిత వార్తలు