
Vizianagaram
Vizianagaram: గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసిన జిల్లాలో విజయనగరం ఒకటి. ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాల్లో టీడీపీ బోణీ కొట్టినా విజయనగరం జిల్లాకు వచ్చేసరికి చతికిలపడింది. చివరకు విజయనగరం ఎంపీగా పోటీచేసిన అశోక్ గజపతిరాజుకు సైతం ఓటమి తప్పలేదు. ఉమ్మడి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక ఎంపీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. వైసీపీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. టీడీపీ పుంజుకున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికితోడు జనసేన పొత్తు ఆ పార్టీకి లాభిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో సామాజికవర్గం ప్రభావంతో ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ గెలుపొందారు.ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో తూర్పుకాపు ఫ్యాక్టర్ బాగా పనిచేయడంతో బెల్లాన గెలుపొందగలిగారు. అటు వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అందుకే ఈ ఎన్నికల్లో ఎంపీగా బలమైన అభ్యర్థిని బరిలో దించాలని వైసీపీ, టీడీపీలు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నాయి.
అయితే ఈసారి ఎంపీగా పోటీ చేయడానికి బెల్లాన విముఖత చూపుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీచేసేందుకే మొగ్గు చూపిస్తున్నారు. కానీ బెల్లాన సొంత నియోజకవర్గం చీపురుపల్లి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 నుంచి అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. బెల్లాన కోసం ఆ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. దీంతో బెల్లానకు ప్రత్యామ్నాయంగా విజయనగరం పార్లమెంటరీ స్థానం పరిధిలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని కేటాయించే చాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో విజయనగరం ఎంపీ స్థానాన్ని బొత్స సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి ఆశిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. హైకమాండ్ మాత్రం బెల్లాననే మరోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీచేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బొత్స కుటుంబానికి పదవులు కేటాయించడం, ఇప్పుడు కొత్తగా ఎంపీ తోడైతే బొత్స పార్టీకి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారని పార్టీ పెద్దలు అనుమానిస్తున్నారు. అందుకే బెల్లానను ఎంపీగా పోటీచేయడమే మంచిదని భావిస్తున్నారు.

Vizianagaram
తెలుగుదేశం పార్టీలో కూడా ఎంపీ అభ్యర్థి విషయంలో ఒక క్లారిటీ రావడం లేదు. 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి అయ్యారు. అప్పటివరకూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని మీసాల గీతకు అప్పగించి గెలిపించుకున్నారు. 2019 ఎన్నికల్లో మాత్రం అదే అసెంబ్లీ స్థానాన్ని తన కూతురు అదితికి ఇప్పించుకున్నారు. తాను మరోసారి ఎంపీగా పోటీచేశారు. కానీ ఇద్దరికీ నిరాశే ఎదురైంది. అయితే ఈసారి అశోక్ అసెంబ్లీ బరిలో నిలిచే చాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఎంపీ ఎవరన్నది సస్పెన్ష్ వీడడం లేదు. అర్థిక, అంగ బలంతో పాటు సామాజిక బలం ఉన్న నాయకుల్లో మాజీ మంత్రి కళా వెంకటరావు కనిపిస్తున్నారు. అయితే ఆయన ఎచ్చెర్ల నుంచి మరోసారి పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. తూర్పుకాపు సామాజికవర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు తెరపైకి వచ్చింది. కానీ అశోక్ గజపతిరాజు ఆసక్తికనబరచడం లేదు. మరోవైపు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే బొబ్బిలి నుంచి ఆయన సోదరుడు బేబీనాయన పోటీచేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సుజయ్ కి టిక్కెట్ ఇస్తే తూర్పుకాపు ఫ్యాక్టర్ మరోసారి పనిచేసే అవకాశముంది. అందుకే హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. విజయనగరం ఎంపీ సీటు అటు వైసీపీకి, ఇటు టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది.