YCP MLAs : వైసీపీ నేతలు వస్తున్నారని తెలిసి.. ఊర్లకు ఊర్లు ఖాళీ
వచ్చే ఎన్నికల్లోనూ తమనే గెలిపించాలని విన్నవిస్తున్నారు.అయితే ప్రజల నుంచి కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గెలిచిన నాలుగేళ్లకు తాము గుర్తు వచ్చామా అని ప్రజలు వారిని నిలదీస్తున్నారు. తమకు ఫలానా పథకాలు అందలేదని, ఫించన్ తీసేశారని, ఇల్లు మంజూరు కాలేదని, రోడ్లు, డ్రైనేజీ బాలేదని సమస్యలపై ఉతికి ఆరేస్తున్నారు.

YCP MLAs : కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి. నేను బటన్ నొక్కి సంక్షేమ పథకాలు విడుదల చేస్తాను. మీరు ప్రజల్లోకి వెళ్లి వివరించండి అంటూ జగన్ వారిని హితోపదేశం చేస్తున్నారు. అలా చేస్తేనే టిక్కెట్లు అంటూ గట్టిగానే చెబుతున్నారు. పరోక్ష సంకేతాలిస్తున్నారు. వారి వెంట ఉండి పరిశీలించండి అంటూ ఐ ప్యాక్ టీమ్ తో పాటు నిఘా వర్గాలకు ఆదేశాలిస్తున్నారు. అయితే ఇలా వెళుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు అర్ధం చేసుకోవడం లేదు. ఎడాపెడా వాయిస్తున్నారు. ముఖం మీదే ఇంటి తలుపులు వేస్తున్నారు. మరికొందరైతే వస్తున్నారని తెలిసి ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు.
చిత్తూరు జిల్లాలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అందులో భాగంగా గ్రామాలకు వెళ్లిన గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఘోర అవమానం జరిగింది. ఒక మంత్రి, డిప్యూటీ సీఎం అని చూడకుండా గంగాధర నెల్లూరులోని ఓ కాలనీ ప్రజలు ఘోరంగా అవమానించారు. సమస్యలు పరిష్కరించని కార్యక్రమాలెందుకు అని బహిష్కరించారు. ఇంట్లో ఉంటే మొహమాటానికైనా పలుకరించాల్సి ఉందని చెప్పి ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎం వెళ్లేసరికి కాలనీ అంతా బోసిపోయింది. ఇంత పనిచేస్తారా అంటూ నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళాలు వేసుకున్న వారంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న వారేనని ఎద్దేవా చేశారు.
డిప్యూటీ సీఎంకు ఎదురైన పరిస్థితే.. అదే జిల్లాలోని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఎదురైంది. పూతలపట్టు మండలం పేట అగ్రహారం దళితవాడలో పర్యటించేందుకు ఎంఎస్ బాబు వెళ్లగా అక్కడ కూడా ప్రజలు ఆయన పర్యటనను బహిష్కరించారు. ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు.దీంతో ఎంఎస్ బాబు కూడా తన పర్యటనను బహిష్కరించిన ప్రజలపై తిట్ల దండకం ఎత్తుకున్నారని సమాచారం. ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, డబ్బులు తీసుకుంటూ తానొస్తే ఇళ్లకు తాళాలు వేసుకు వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.ఇక ఎమ్మెల్యే బాబు వెళ్లిపోయిన వెంటనే స్థానికులు ఊరిలోకి వచ్చిన పసుపు నీటితో వీధులను శుభ్రం చేశారు. ఇప్పుడు ఈ రెండు ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గడప గడపకు తిరిగితే అవమానాలు ఎదురవుతున్నాయి. తిరగకుంటే టిక్కెట్ కు గండం తప్పదన్న భయం ఎమ్మెల్యేలు, మంత్రులను వెంటాడుతోంది. కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ నాలుగేళ్లలో జరిగిన లబ్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. పనిలో పనిగా సీఎం జగన్ వారికి రాసిన లేఖను ప్రజల చేతిలో పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమనే గెలిపించాలని విన్నవిస్తున్నారు.అయితే ప్రజల నుంచి కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గెలిచిన నాలుగేళ్లకు తాము గుర్తు వచ్చామా అని ప్రజలు వారిని నిలదీస్తున్నారు. తమకు ఫలానా పథకాలు అందలేదని, ఫించన్ తీసేశారని, ఇల్లు మంజూరు కాలేదని, రోడ్లు, డ్రైనేజీ బాలేదని సమస్యలపై ఉతికి ఆరేస్తున్నారు. దీంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు.