After YSR : వైఎస్సార్ తర్వాత ప్రజలు నమ్మింది ఆయన్నే
అందుకే ఇప్పుడు చంద్రబాబుకు ఉన్న కింకర్తవ్యం ప్రజలకు వాస్తవాలు చెప్పడం. రియలైజ్ కావడం. నమ్మకస్తుడైన పవన్ ఉండడంతో ఆయన ద్వారా ప్రజలకు నిజాలు చెబితే వారు విశ్వసించే అవకాశముంది. సంక్షేమం విషయంలో అంతకు మించి చంద్రబాబుకు చాన్స్ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

After YSR : ఎవరైనా తమకు అలవాటైన విద్యనే ఎంచుకోవాలి. తమకు ఇష్టమైన రంగంలోనే స్థిరపడాలి. లేకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది అదే. పాలన, అభివృద్ధిలో ఎవరు కాదనుకున్నా చంద్రబాబు ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. దీనిని ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు. అలాగని చంద్రబాబు సంక్షేమం అంటే మాత్రం పెద్దగా ఎవరూ నమ్మరు. సంక్షేమ పథకాలు అమలుచేశారని
చెప్పుకునేందుకు ఎవరూ ముందుకు రారు. చివరకు సొంత పార్టీ శ్రేణులు సైతం పెద్దగా ఆహ్వానించరు. ఆయన పూర్వాశ్రమంలో చేసిన పనులు అట్లాంటివి.
2014 ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చారు. అప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. రాజధాని లేని రాష్ట్రంగా అవశేష ఏపీ నిలబడింది. దీనిని గాడిలో పెట్టగల నాయకుడు అవసరం కావడంతో ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు. కానీ జగన్ తన తండ్రి సంక్షేమ పాలన తెస్తానని చెప్పడంతో బాబు కంగారు పడిపోయారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి వాటిపై హామీ ఇచ్చారు. మూడేళ్లు కిమ్మనకుండా అమరావతి, ప్రభుత్వ పాలనలో నిమగ్నమైపోయారు. చివరకు అప్పటి ప్రణాళిక సంఘం ప్రతినిధి కుటుంబరావును రంగంలోకి దించి లెక్కలు కట్టారు.
మీరెవరూ రుణాలు కట్టకండి అని 2014 ఎన్నికల్లో చెప్పుకొచ్చిన బాబు.. తాను అధికారంలోకి వస్తే రుణాలను మాఫీ చేస్తానని చెప్పుకొచ్చారు. బాబు చెప్పినట్టే అధికారంలోకి వచ్చారు కదా అని ఎవరూ రుణాలను తిరిగి కట్టలేదు. అటు బాబు రుణమాఫీ అమలుచేయలేదు. దీంతో మూడేళ్ల పాటు వడ్డీలు పెరిగిపోయాయి. చివరకు రంగంలోకి దిగిన కుటుంబరావు బ్యాంకులు ఎకరానికి ఇచ్చే రుణాలను పరిగణలోకి తీసుకొని అత్తెసరు రుణమాఫీకి నివేదించారు. అలా ఇచ్చిన సొమ్ము రైతుల మూడేళ్ల వడ్డీకి కూడా సరితూగలేదు. డ్వాక్రా రుణమాఫీది అదే సీన్.
నాటి హామీల అమలు వైఫల్యమే నేడు చంద్రబాబుకు శాపంగా మారింది. వాస్తవానికి 2014లో ఎటువంటి హామీలు ఇవ్వకున్నా ప్రజలు చంద్రబాబునే ఎన్నుకునేవారు. అప్పట్లో రాష్ట్ర అవసరం అటువంటిది. పోనీ అధికారంలోకి వచ్చిన తరువాత అయిన ప్రజలకు వాస్తవాలు చెప్పారా? అంటే అదీ లేదు. ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటించి ఇస్తామన్నా ప్రజలు పెద్దగా నమ్మలేదు. ఇప్పటికే ఇస్తామన్న హామీలను జగన్ అమలుచేసి చూపించారు. సంక్షేమం విషయంలో ప్రజామోదం పొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత చంద్రబాబును ప్రజలు నమ్మినా సంక్షేమం విషయం పేవల ప్రదర్శనతో చంద్రబాబు వెనుకబడ్డారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పథకాలు అమలుచేస్తామని చంద్రబాబు చెబుతున్నా ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు. అదే సమయంలో చంద్రబాబు విజనరీకి ఇష్టపడిన వారు సైతం దూరం జరిగిపోయే చాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు ఉన్న కింకర్తవ్యం ప్రజలకు వాస్తవాలు చెప్పడం. రియలైజ్ కావడం. నమ్మకస్తుడైన పవన్ ఉండడంతో ఆయన ద్వారా ప్రజలకు నిజాలు చెబితే వారు విశ్వసించే అవకాశముంది. సంక్షేమం విషయంలో అంతకు మించి చంద్రబాబుకు చాన్స్ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
