BRS: బీఆర్‌ఎస్‌కు గుది‘బంధు’లు.. నిలదీతలు, కత్తిపోట్లు అందుకేనా?

కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన బంధు పథకాలు ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు సమస్యగా మారాయి. రైతుబంధు ఇస్తారో లేదో స్పష్టత లేదు. అదే సమయంలో దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పేరుతో ప్రవేశ పెట్టిన పథకాల్లో లబ్ధిదారులు వందల్లో ఉంటే.. ఆశావహులు లక్షల్లో ఉన్నారు.

  • Written By: Raj Shekar
  • Published On:
BRS: బీఆర్‌ఎస్‌కు గుది‘బంధు’లు.. నిలదీతలు, కత్తిపోట్లు అందుకేనా?

BRS:‘రైతుబంధును పుట్టించిదే నేను.. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌కు ఎన్నడూ ఇలాంటి ఆలోచన రాలేదు.. రైతులను ఆదుకోవాలని చూడలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చి ఒక్క అవకాశం అంటున్నరు.. 11 అవకాశాలు ఇచ్చిప్పుడే ఏమీ చేయలేదు.. ఇప్పుడు ఒక్క ఛాన్స్‌ ఇస్తే చేస్తరా’ ఇదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు. ప్రసంగం వరకు బాగానే ఉన్నా.. బీఆర్‌ఎస్‌కు ‘బంధు’ పథకాలే గుదిబండగా మారుతున్నట్లు కనిపిస్తోంది. పదేళ్ల పాలనతో ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఓటర్లకు కేసీఆర్‌ ప్రవేశపెట్టిన బంధు పథకాలు అందకపోవడంతో ఓట్ల కోసం వెళ్తున్న అభ్యర్థులకు అడ్డగింతలు, నిలదీతలు, చివరకు హత్యాయత్నం కూడా తప్పలేదు.

అర్హులకు అందకపోవడంతో..
కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన బంధు పథకాలు ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు సమస్యగా మారాయి. రైతుబంధు ఇస్తారో లేదో స్పష్టత లేదు. అదే సమయంలో దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పేరుతో ప్రవేశ పెట్టిన పథకాల్లో లబ్ధిదారులు వందల్లో ఉంటే.. ఆశావహులు లక్షల్లో ఉన్నారు. వీరంతా ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలను నిలదీస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న పథకాలే ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బందులోకి నెట్టేస్తున్నాయి. ఓట్లు గుమ్మరిస్తాయనుకున్న ఆయా పథకాలు తమకు ఫలితాలను తెచ్చిపెట్టకపోగా.. ప్రతిబంధకాలుగా మారుతున్నాయని అభ్యర్థులు ఆందోళన చెందుతన్నారు.

కార్యకర్తలకే లబ్ధి..
దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, రైతుబంధు పథకాల్లో ఒక్క రైతుబంధు మినహా మిగతా మూడు బంధులు కార్యకర్తలకే అందాయి. సొంత పార్టీ నేతలకే లబ్ధి చేకూర్చిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు ప్రజల్లోకి వెళ్తే నిలదీతలు ఎదుర్కొంటున్నారు. పార్టీ కాకుండా నిజమైన లబ్ధిదారులు ఊరికి పది పదిహేను మందికి మించి కానరావడం లేదు. అర్హులు మాత్రం వందల్లో ఉంటున్నారు. ఇదే అభ్యర్థుల ప్రచారానికి ఆటంకంగా మారుతోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో ప్రారంభించిన దళితబంధుతోపాటు ఎన్నిలకు కొద్ది రోజుల ముందు ప్రారంభించిన బీసీబంధు, మైనారిటీబంధు పథకాలు అర్హులకు అందడం లేదు.

నేతల ఇళ్లచుట్టూ ప్రదక్షిణ..
పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరూ ప్రభుత్వ కార్యాలయాలు, నేతల ఇళ్ల చుట్టూ ఇన్ని రోజులు తిరిగారు. అయినా ఫలితం శూన్యం. ఇప్పుడు నేతలే ఓట్ల కోసం ఊళ్లకు వస్తున్నారు. నేతల చుట్టూ తిరిగి విసిగిపోయి ఉన్న ప్రజలు తమ ఊళ్లకు వస్తున్న నేతలను నిలదీస్తున్నా. మీకు అనుకూలంగా ఉన్న వాళ్లకు మాత్రమే స్కీములను ఇచ్చారని మాకెందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినా బాగుండేదని అంటున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేసిన రాజు దళితుడు కావడం, దళితబంధు రాకపోవడంతోనే ఈ ఘాతుకానికి యత్నించాడని తెలుస్తోంది. ఈ అసంతృప్తి పెరిగితే.. మొదటికే మోసం వస్తుందని .. బీఆర్‌ఎస్‌ నేతలుకంగారు పడుతున్నారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు