Pawankalyan : వలంటీర్ల వ్యవస్థపై ఆరోపణల వెనుక పవన్ పక్కా స్కెచ్
కానీ పవన్ తాజా వ్యాఖ్యలతో వలంటీర్లు జగన్ కు అనుకూలంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ వలంటీర్లపై ప్రజల్లో ఒక రకమైన ఆలోచన తేవాలన్న ప్రయత్నంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.

Pawankalyan : వలంటీర్లు..స్వచ్ఛందంగా సేవకు ముందుకొచ్చేవారిని అలా పిలుస్తారు. కానీ వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీర్ల పేరుతో ఒక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రతీ 50 కుటుంబాల బాధ్యతను వారికి అప్పగించింది. సంక్షేమ పథకాల అమలు నుంచి పౌరసేవల వరకూ వారికి బాధ్యతలు కట్టబెట్టింది. రూ.5 వేల గౌరవవేతనం అందిస్తోంది. రాజకీయాలకతీతంగా నియామకం జరిపిందంటే అదీ లేదు. పేరుకే ఇంటర్వ్యూలు నిర్వహించింది. తమకు నిచ్చిన వారిని నియమించుకుంది. ఇలా భర్తీ అయిన వారిలో స్వచ్ఛంద సేవ ఉందా? రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తున్నారా? అంటే అదీ లేదు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించి వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల వారిని వైసీపీ ఓటర్లుగా మార్చాలన్న జగన్ వ్యూహాన్ని వలంటీరు వ్యవస్థ అమలుచేస్తోంది.
పవన్ అదే వలంటీరు వ్యవస్థను టార్గెట్ చేసుకున్నారు. కానీ దాని వెనుక ఒక వ్యూహం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వలంటీర్ల ద్వారా వచ్చే ఎన్నికల్లో మరోసారి గట్టెక్కాలని జగన్ భావిస్తున్నారు. వలంటీర్లను తన సైన్యంగా కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం ఎన్నికల క్యాంపెయిన్ వారి ద్వారానే పూర్తిచేయాలని చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వలంటీర్ల ఏ స్థాయిలో పనిచేశారో.. అందరికీ తెలిసిందే. జగన్ గెలుపు ధీమా వెనుక కారణం కూడా అదే. అందుకే పవన్ వ్యూహం మార్చారు. నేరుగా వలంటీరు వ్యవస్థపై కామెంట్స్ చేశారు. అయితే దీనిని రాజకీయంగా చేయాలని జగన్ భావిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల 50 వేల మంది వలంటీర్లు ఉన్నారు. పవన్ నోటి దూలతో జనసేనకు వారు బద్ధ శత్రువులుగా మారిపోయారని నీలి మీడియా హడావుడి చేస్తోంది. ఇక్కడే ఒక విషయం గమనించుకోవాలి. వలంటీర్లు వైసీపీ సానుభూతిపరులు కాదా? ఆ పార్టీ వ్యక్తులనే వలంటీర్లుగా నియమించుకోలేదా? వైసీపీకి వారు అనుకూలం కాదా? టీడీపీ, జనసేనలను వారు ప్రత్యర్థి పార్టీలుగా చూడడం లేదా? అంటే మాత్రం వారి నుంచి సమాధానం దొరకడం లేదు. కానీ వారిని రెచ్చగొట్టడం ద్వారా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని… వారిలో కసిని పెంచే పనిలో వైసీపీ నేతలు ఉండడం విశేషం.
అయితే ఈ విషయంలో పవన్ ఒక సాహస చర్యకు దిగారు. ఏ వ్యవస్థ ద్వారా గట్టెక్కాలని జగన్ చూస్తున్నారో.. అదే వ్యవస్థ లోపాలను ప్రజల ముందుంచుతున్నారు. రాష్ట్రంలో 14 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న ఆరోపణ అషామాషీ కాదు. ప్రజల ఆధార్ నంబర్ల నుంచి ఫోన్ నంబర్ల వరకూ.. వ్యక్తిగత గోప్యత సమాచారం వలంటీర్ల వద్ద ఉందని.. ఎన్నికల ముంగిట వారు బ్లాక్ మెయిలింగ్ కు దిగే చాన్స్ ఉందన్న విషయాన్ని బయటపెట్టారు. కానీ పవన్ తాజా వ్యాఖ్యలతో వలంటీర్లు జగన్ కు అనుకూలంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ వలంటీర్లపై ప్రజల్లో ఒక రకమైన ఆలోచన తేవాలన్న ప్రయత్నంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.
