Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గిరిజనులపై ఫోకస్ పెట్టారా? వారి సమస్యలను అధ్యయనం చేయడంతో పాటు పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నారా? ఇందుకుగానే ‘గిరిసేన’ అనే విభాగాన్ని ఏర్పాటుచేయనున్నారా? త్వరలో ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో ఫర్యటన ఇందుకేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో పవన్ పాడేరులో పర్యటన ఉంటుందని జనసేన వర్గాలు చెబుతుండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వాస్తవానికి ఈ మూడున్నరేళ్లలో గిరిజనుల కోసం ప్రత్యేక పథకం అంటూ ఏదీ లేదు. వారికి భరోసా కల్పించే ఏ ప్రయత్నమూ ప్రభుత్వం చేయలేదు. అన్నింటికీ నవరత్నాల్లో ముడివేసి గిరిజనులకు మేలు చేశామని చెబుతున్నారే తప్ప వారికి స్వాంతన చేకూర్చే ఏ ప్రయత్నమూ చేసిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా గిరిజనుల సమస్యలను అజెండాగా తీసుకున్నారు. వాటిపై పోరాటానికి సన్నద్ధమవుతున్నారు.

Pawan Kalyan
గత కొంతకాలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పరిశీలిస్తే ఏదో ఒక సమస్యను అజెండాగా తీసుకొని పోరాటం చేస్తున్నారు. నెలలో ఆరేడు కార్యక్రమాలు ఇలానే సాగుతున్నాయి. అవి రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రభుత్వం కూడా దృష్టిపెట్టాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పవన్ ప్రభుత్వం మెడలు వంచి పని చేయిస్తున్నారన్న టాక్ ఏపీ సమాజంలో వినిపిస్తోంది. తద్వారా జనసేన లక్ష్యం నెరవేరుతుండగా.. పార్టీ కూడా ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళుతోంది. అందుకే ఈసారి గిరిజనుల సమస్యను అజెండాగా తీసుకోవాలని పవన్ భావిస్తున్నారుట. అందుకే త్వరలో ఉమ్మడి విశాఖలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో పవన్ పర్యటించేందుకు డిసైడయ్యారుట.ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసే పనిలో జనసేన హైకమాండ్ ఉంది.
అయితే పవన్ గిరిజనుల సమస్యలను అజెండాగా తీసుకోవడానికి చాలారకాలుగా వర్కవుట్ చేశారు. రాష్ట్ర విభజనతో గిరిజనుల సంఖ్య, నిడివి తగ్గింది. దీంతో గిరిజనులను ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. గత ఎన్నికల్లో దాదాపు గిరిజనుల ప్రాబల్యం, ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే తమకు అంతులేని విజయాన్ని కట్టబెట్టిన గిరిజనులపై వైసీపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఏజెన్సీలో ఉన్న సహజ వనరులపై ఉన్న శ్రద్ధ గిరిజనులపై చూపలేదు. అటు గిరిజనుల్లో కూడా అదే ఆవేదన ఉంది. ఈ నేపథ్యంలో వారి సమస్యలపై దృష్టిపెట్టడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొనవచ్చన్నది పవన్ అభిప్రాయం. అందుకే ఏజెన్సీలో పర్యటించి గిరిజనులతో మమేకమయ్యేందుకు పవన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

Pawan Kalyan
పైగా పాడేరు ఉమ్మడి విశాఖలో అంతర్భాగం. అపారమైన వనరులు కలిగిన అటవీ ప్రాంతం. వైసీపీ మూడు రాజధానుల ప్రకటన, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్ణయం వెనుక ఏజెన్సీలోని సహజన వనరులపై అధికార పార్టీ నేతలు కన్నేశారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అందుకే విశాఖ రాజధానికి తహతహలాడుతున్నారన్న కామెంట్స్ ఉన్నాయి. అందుకే గిరిజనులను అప్రమత్తం చేసేందుకు పవన్ ఆ ప్రాంతంలో పర్యటనకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, వారి జీవన విధానం గురించి సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు. వాటిని నివేదిక రూపంలో తయారుచేసి.. సమస్యలతో పాటు వాటి పరిష్కార మార్గాలను ప్రభుత్వం ముందు ఉంచడానికే ఈ కీలక పర్యటనగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ భద్రాద్రి జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వరకూ ఏజెన్సీ విస్తరించి ఉంది. ఏజెన్సీ పొడవునా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలే ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీకి ఏకపక్షంగా గిరిజనులు మద్దతు పలికేవారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ సంచలన విజయాలు నమోదుచేసుకున్నా ఏజెన్సీలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి గిరిజనులు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో సంపూర్ణ విజయం అందించారు. కానీ జగన్ సర్కారు గిరిజనుల కోసం ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. అటు పేరుకే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ.. అటు పార్టీలో, ప్రభుత్వంలో ఏమంతా క్రియాశీలకంగా లేరు. ప్రస్తుతం గిరిజనులు వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నారు.. అలాగని విపక్షం టీడీపీకి సానుకూలంగా లేరు. అందుకే ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు జనసేన పావులు కదుపుతోంది. ఏకంగా గిరిజనసేన విభాగాన్ని ఏర్పాటుచేయడానికి పవన్ సిద్ధపడుతున్నారు.