Pawan Kalyan: గోదావరి జిల్లాల్లో అడుగుపెట్టిన పవన్.. వైసీపీలో వణుకు
రైతు సమస్యల మీదే పవన్ కల్యాణ్ మరోసారి పర్యటించబోతోన్నారు. దీంతో ఎటువంటి సంచనాలు నమోదుకానున్నాయోనన్న బెంగ అధికార పార్టీని వెంటాడుతోంది.

Pawan Kalyan: జనసేనాని ఏపీలో అడుగుపెట్టారు. బుధవారం ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయనకు జనసేన శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శించనున్నారు. ఈ మేరకు పవన్ షెడ్యూల్ ను జనసేన హైకమాండ్ రెండురోజుల కిందటే ఖరారు చేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో రైతులను పరామర్శిస్తూ పవన్ పర్యటన కొనసాగనుంది. సమయం తక్కువగా ఉన్నా జనసేనవర్గాలు మాత్రం భారీ ఏర్పాట్లు చేశాయి. బుధవారం ఉదయానికే రాజమండ్రి ఎయిర్ పోర్టుకు జన సైనికుల తాకిడి పెరిగింది. జనసేన కీలక నాయకులు పుష్పగుచ్చాలు అందించి పవన్ కు స్వాగతం పలికారు.
ముందుగా అవభూముల పరిశీలన..
ఎయిర్ పోర్టు నుంచి పవన్ నేరుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వెళ్లారు. ఆవ భూముల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతుల దుస్థితిని చూసి బావోద్వేగానికి గురయ్యారు. అనంతరం వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా పవన్ అవిడి చేరుకోనున్నారు. అక్కడ రైతులతో ముఖాముఖీగా సమావేశమవుతారు. వారి బాధలను తెలుసుకుంటారు. విపత్తుల సమయంలో ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేరుగా రైతుల నుంచే అభిప్రాయాలను సేకరించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో దారిపొడవునా జనాలు పవన్ రాకను ఆసక్తిగా తిలకించారు.
అధికార పార్టీలో ఆందోళన..
అయితే పవన్ రాకతో అధికారులు, వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎటువంటి రాజకీయ విమర్శనాస్త్రాలు వస్తాయోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పి.గన్నవరం మండలం రాజుపాలెంలో వెలుగుచూసిన ఘటనపై పవన్ స్పందించే చాన్స్ ఉంది. గ్రామంలో ధాన్యం, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. ధాన్యం రంగు మారిపోయింది. మొక్కజొన్న కంకెలకు మొలకలు వచ్చాయి. రంగుమారిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం లేదు. దీనిపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన ఉండడంతో భయపడిన అధికారులు, ఉద్యోగులు మంగళవారం రాత్రి కూలీలుగా మారి ధాన్యాన్ని, మొక్కజొన్న ఉత్పత్తులను తరలించాల్సి వచ్చింది. అయితే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ దీనిపై స్పందించే అవకాశం ఉంది.
గతంలో కౌలురైతులకు భరోసా..
జనసేన ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా ఉభయ గోదావరి జిల్లాల్లో సక్సెస్ అవుతుంది. గతంలో పవన్ కౌలురైతు భరోసా యాత్ర చేపట్టినప్పుడు కూడా జన ప్రవాహంగా మారింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున పవన్ అందించారు. ఇప్పుడు మరోసారి రైతుల పక్షాన పోరాడేందుకు సిద్ధపడుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో 40 మందికి పైగా రైతు కుటుంబాలకు ఆయన చెక్కులు అందించారు. రైతు సమస్యల మీదే పవన్ కల్యాణ్ మరోసారి పర్యటించబోతోన్నారు. దీంతో ఎటువంటి సంచనాలు నమోదుకానున్నాయోనన్న బెంగ అధికార పార్టీని వెంటాడుతోంది.
