Pawankalyan: నాదేండ్ల మనోహర్ విషయంలో పవన్ సీరియస్.. గట్టి హెచ్చరిక
ఇంటా బయటా మనోహర్ పై జరుగుతున్న వ్యవతిరేక ప్రచారానికి పవన్ తెరదించారు. నాదేండ్ల మనోహర్ ను వెనుకేసుకొచ్చారు.

Pawankalyan: జనసేనాని పవన్ పొత్తులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణమాలపై స్పందించారు. ముఖ్యంగా నాదేండ్ల మనోహర్ విషయంలో పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. గత కొన్నిరోజులుగా నాదేండ్ల వ్యవహారం సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. పార్టీలో మరో పవర్ సెంటర్ గా తయారయ్యారని.. ఏదీ అధినేత వద్దకు తీసుకుపోరని.. సొంత అజెండాతో పనిచేస్తున్నారని కొందరు జనసేన నాయకులు బాహటంగానే విమర్శలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. దీంతో పార్టీలో ఓ రకమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
పార్టీలో అన్నీతానై…
నాదేండ్ల మనోహర్ జనసేన నంబర్ 2 గా ఉన్నారు. పవన్ సినిమాలతో బిజీగా ఉండగా పార్టీలో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు యాక్టివ్ కావడంతో నాదేండ్ల మనోహర్ ప్రాధాన్యత తగ్గిందని ప్రచారం మొదలైంది. వివిధ పార్టీల నుంచి వస్తున్న నేతలను మనోహర్ అడ్డుకుంటున్నారని.. పార్టీ శ్రేణులకు, అధినేత మధ్య అడ్డంకిగా నిలుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పార్టీలో ఆశించిన పదవులు దక్కని చాలామంది బాహటంగానే ఆరోపణలకు దిగుతున్నారు. ఏకంగా సోషల్ మీడియాలోనే పోస్టింగులు పెడుతున్నారు. దీంతో జనసేనలో వర్గ విభేదాలు అంటూ ప్రత్యర్థులు ప్రచారం ప్రారంభించారు.
ఫుల్ క్లారిటీ..
ఈ విషయాలన్నీ పవన్ దృష్టికి రావడంతో మనోహర్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల పార్టీ క్రియాశీల సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జనసేనలో ఉండేవాళ్లకే నేను బాధ్యతలు ఇస్తాను. ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయే వాళ్లకి నేను బాధ్యతలు ఇవ్వను. పార్టీలో నాదెండ్లను చాలా మంది విమర్శిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పార్టీలో అనుకూల శత్రువులుగా మారొద్దు. అనుకూల శత్రువులు ఎవరైనా ఉంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తా. మనోహర్ ఏ రోజూ నన్ను సంప్రదించకుండా ఏం మాట్లాడరు. నాదెండ్ల లాంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకోవాలి.. కానీ తూలనాడొద్దు. నేను అంటే పడి చచ్చిపోతామనే వాళ్లు.. నాదెండ్లను విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్లను నేను వైసీపీ కోవర్టులుగానే భావిస్తాను. నా మీద కోపాన్ని నాదెండ్ల మీద చూపుతున్నారు. ఏదైనా ఉంటే నా మీదే కోప్పడండి.. నన్నే విమర్శించండి’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఆయనే టార్గెట్
అయితే ఆది నుంచి నాదేండ్ల మనోహర్ విషయంలో జనసేన ప్రత్యర్థులు ఒక రకమైన ప్రచారం చేశారు. ముఖ్యంగా వైసీపీ కాపు మంత్రులు, నేతలు కాపుల ఓట్లను చంద్రబాబు హోల్ సేల్ గా అమ్మేస్తారని పవన్ పై ఆరోపణలు చేస్తుంటారు. అది కాపు జనసేన కాదు.. కమ్మజనసేన అని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానిస్తుంటారు. పవన్ పక్కన ఉన్నది నాదేండ్ల మనోహర్ అని.. అటువంటప్పుడు జనసేన కాపులకు ఎలా అండగా నిలుస్తుందని విపరీత మనస్తత్వంతో మాట్లాడుతుంటారు. టీడీపీతో జనసేన కలవడం ఇష్టం లేని పార్టీలు, నాయకులకు నాదేండ్ల మనోహర్ టార్గెట్ అవుతున్నారు. ఆయన వల్లే జనసేన టీడీపీకి దగ్గరైందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటా బయటా మనోహర్ పై జరుగుతున్న వ్యవతిరేక ప్రచారానికి పవన్ తెరదించారు. నాదేండ్ల మనోహర్ ను వెనుకేసుకొచ్చారు.
