Pawan Kalyan : రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయడమే వారాహి ముఖ్య లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాలకు మేలు జరగాలని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులను బుధవారం తీసుకొని అనంతరం వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి నుంచి పవన్ కళ్యాణ్ తొలి పలుకులుగా ‘జై భవానీ’ అంటూ అమ్మవారి పేరు భక్తిపూర్వకంగా స్మరించారు. ఆనంతరం ప్రసంగిస్తూ రాజకీయాల్లోకి యువతరం రావాలని, తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా అభివృద్ధి సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. కచ్చితంగా వారాహితో త్వరలోనే ప్రజలను కలుసుకుంటాను అన్నారు.
వారాహి వాహనం పూజల్లో మాకు సహకరించిన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ఈవో, అధికారులు, వేద పండితులు, అర్చకులు, పోలీసులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సిబ్బందికి, శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు
* దుర్గమ్మ సేవలో పవన్ కళ్యాణ్ , మనోహర్
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం వేళ నేరుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని, అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయం మర్యాదలతో ఆలయ ఈవో శ్రీమతి భ్రమరాంబ, ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ మనోహర్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం అందించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు జరిగేలా శ్రీ దుర్గమ్మ ఆశీర్వదించాలని వేడుకున్నట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.
* పూల వర్షమై కురిసిన అభిమానం
వారాహి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపైకి ఎక్కి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నుంచి అభిమానులు జనసేనానిపై పూల వర్షం కురిపించారు. డప్పు చప్పుళ్లు, బాణ సంచా పేలుళ్లతో విజయవాడ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. దుర్గమ్మ ఆలయం బయట ప్రత్యేకంగా తయారు చేయించిన గజమాలతో సత్కరించారు. తన కోసం తరలి వచ్చిన ఆశేష జనవాహినికి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియచేశారు.
వాహన పూజ, ప్రసంగం అనంతరం వారాహిలో మంగళగిరి కార్యాలయానికి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ బయలుదేరారు. వారాహికి వీర మహిళలు వంద బిందెలతో నీళ్లు పోసి స్వాగతం పలికారు. దారి పొడవునా ఘన స్వాగతం చెప్పారు. పలు ప్రాంతాల్లో వారాహిపై నుంచి అభిమానులుకు పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు. వారధి దగ్గర పవన్ కళ్యాణ్ కి హారతులు పట్టి పూలాభిషేకం చేశారు. సీతమ్మ పాదాల దగ్గర 108 అంబులెన్స్ సైరన్ వినగానే తన వాహన శ్రేణిని పవన్ కళ్యాణ్ నిలిపి వేయించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పోతిన వెంకట మహేష్, అమ్మిశెట్టి వాసు, అక్కల గాంధీ, తంగెళ్ల ఉదయ్, మండలి రాజేష్, బూరగడ్డ శ్రీకాంత్, కిషోర్, బొలియాశెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.