Pawan Kalyan- Ippatam Village: ఇప్పటం గ్రామస్థుల తెగువను చూసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముగ్ధుడయ్యారు. వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. జనసేన భావజాలానికి ఇప్పటం గ్రామస్తులుగా దగ్గరగా ఉన్నారని కొనియాడారు. పోరాటమే జనసేన పంథాయని..సమస్యలపై అలుపెరగని పోరాటమే లక్ష్యమని పవన్ గుర్తుచేశారు. పార్టీ ఆవిర్భవించిన ఈ సుదీర్ఘ కాలంలో జనసేనను నిలబెట్టింది ప్రశ్నించే తత్వమేనన్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇప్పటం గ్రామస్థులను పవన్ కలుసుకున్నారు. అటు ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకూ ఎన్ని ఆంక్షలు విధించినా,.. ఇప్పటం గ్రామస్థులు వెల్లువలా వచ్చి పవన్ ను కలుసుకున్నారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డు విస్తరణ పేరిట ఇప్పటంలో ప్రభుత్వం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు 53 మంది ఇళ్లను ధ్వంసం చేయడంతో పవన్ రియాక్టయ్యారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అటు బాధితులు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున రూ.53 లక్షలను సాయంగా ప్రకటించారు. అయితే ఈ సాయం అందుకోవద్దని వైసీపీ నేతలు బెదిరింపులకు దిగినా. భయపడకుండా ఇప్పటం గ్రామస్థులు స్వచ్ఛందంగా వచ్చి పవన్ చేతులు మీదుగా సాయాన్ని అందుకున్నారు.

Pawan Kalyan
అయితే ఇప్పటం గ్రామస్థుల ధైర్యాన్ని చూసి పవన్ కీలక ప్రసంగం చేశారు. ఇప్పటం అంటేనే జనసేన… జనసేన అంటే ఇప్పటం అన్న రేంజ్ లో అభిమానం పెనవేసుకుందన్నారు. చిన్నారుల నుంచి యువత వరకూ… పెద్దల నుంచి వృద్ధుల వరకూ, చివరకు మహిళలు సైతం జనసేనకు అండగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. అసలు ఇప్పటం గ్రామస్థులు చేసిన తప్పు ఏమిటని ప్రశ్నించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవానికి స్థలాలు ఇవ్వడమే వారు చేసిన తప్పా అని నిలదీశారు. ఆ ఒకే ఒక కారణంతో విధ్వంసానికి దిగడం దారుణమన్నారు. పేదల ఇళ్లను కూల్చేసిన అధికారులు పక్కన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. కక్షపూరితంగానే ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యవాదులు హర్షించరని కూడా చెప్పారు. దీనికి అధికార వైసీపీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇప్పటం ఒక సాధరణ గ్రామమన్నారు. అన్నివర్గాల ప్రజల సమాహారమైన గ్రామస్థులకు ఉన్న తెగువ అమరావతి రైతులకు ఉంటే పరిస్తితి మరోలా ఉండేదన్నారు. అసలు రాజధానిని తరలించే ధైర్యం చేసి ఉండేవారే కాదన్నారు. భయపడితే చంపేస్తారని.. భయపడకుండా ధైర్యంగా నిలబడితే మాత్రం ఫలితం వేరేలా ఉంటుందన్నారు. దానిని ఇప్పటం గ్రామస్థులు చేసి చూపించారని కొనియాడారు. గ్రామస్థులకు తన భరోసా ఎప్పుడూ ఉంటుందని.. తప్పుచేసే వారిని ప్రశ్నించేందుకు తాను అండగా ఉంటానని.., ఇప్పుడే కాదు.. రేపు జనసేన అధికారంలోకి వచ్చినా తప్పుచేస్తే ఇదే పంథాను కొనసాగించాలని ఇప్పటం గ్రామస్థులకు సూచించారు.

Pawan Kalyan
పవన్ ను కలవకుండా ఇప్పటం గ్రామస్థులపై ప్రభుత్వం చేసిన ఒత్తడి ఏదీ ఫలించలేదు. ఇళ్ల తొలగింపు తరువాత ఇంటి యజమానుల ప్రమేయం లేకుండా మమ్మల్ని పరామర్శించడానికి ఎవరు రావొద్దు.. మా ఇళ్లను ప్రభుత్వం కూల్చలేదు. మీ సానుభూతి మాకు అక్కర్లేదు అంటూ ఫ్లెక్సీలు వెలిసినసంగతి తెలిసిందే. అటు తరువాత గ్రామస్తులకు పౌరసేవలు నిలిపివేసి ఇబ్బందులు పెట్టారు. పవన్ ప్రకటించిన సాయం అందుకోవడానికి వెళ్తే ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించారు. కానీ ఇప్పటం గ్రామస్థులు అవేవీ పట్టించుకోలేదు. స్వచ్ఛందంగా జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ ఇచ్చిన సాయాన్ని తీసుకున్నారు. పవన్ కూడా వారితో మమేకమయ్యారు. తాజా ఇష్యూతో ఇప్పటం గ్రామస్థులు ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చినట్టయ్యింది.