Pawan Kalyan- KCR: చీమా చీమా ఎందుకు కుట్టావ్.. అంటే నా పుట్టలో వేలెడితే కుట్టనా అందట. అచ్చం ఇలాగే ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిస్థితి. ఎవరినో దెబ్బ కొట్టడానికి.. తాను ప్రధాని కావాలన్న కల నెరవేర్చు కోవడానికి ఇతరులను ముంచాలని.. కాదు కాదు తొక్కాలని చూస్తున్నారు. తానే రాజకీయ చతురుడిని అని, తనకంటే మేధావి ఎవరూ లేరని విర్రవీగే కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలని చూస్తున్నారు. తనది ఒక ప్రాంతీయ పార్టీనే అని, తాను కిందిస్థాయి నుంచే వచ్చానని, పేరు మార్చినంత మాత్రా జాతీయ పార్టీ అయిపోలేదన్న విషయాన్ని గులాబీ నేత విస్మరిస్తున్నారు. తన ఎదుగుదల కోసం ఇతరులను తొక్కేయాలన్న కుటిల రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మేలు చేయాలన్న లక్ష్యంతో అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న.. ప్రాజాదరణ చూరగొండున్న, వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పోరాడుతున్న జనసేనను బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారు.

Pawan Kalyan- KCR
కాపులను టార్గెట్ చేసిన కేసీఆర్..
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణపై దృష్టిపెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. అక్కడి కాపు నేతలను టార్గెట్ చేశారు. కాపులు ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుంది. 2014 ఎన్నికల్లో కాపులు టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచారు. తాజాగా కాపులు అధికార పార్టీకి దూరమవుతున్నారు. క్రమంగా జనసేనకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖామన్న అభిప్రాయం ఏపీలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వైసీపీని మరోమారు అధికారంలోకి తీసుకొచ్చేందుకు.. జనసేనను దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ కాపులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాపునేత తోట చంద్రశేఖర్‌తోపాటు పలువురు కాపు సామాజిక వర్గ నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. తద్వారా తమ పార్టీ ఏపీలో కాపులకు ప్రాధాన్యం ఇస్తుందన్న సంకేతం ఇచ్చారు.

Pawan Kalyan- KCR
రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తున్న జన సేనాని..
చీమలు కష్టపడి పెట్టిన పుట్టలోకి చొరబడాలని చూస్తున్న కేసీఆర్ వ్యూహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతివ్యూహం రచిస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా ఏపీలో ఎలాగైతే సామాజిక వర్గాల వారీగా జనసేనను దెబ్బతీయాలని చూస్తున్నారు. అదే కుల రాజకీయం ద్వారా తెలంగాణలో కేసీఆర్‌కు ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. తెలంగాణలో కూడా మున్నూరు కాపులు మద్దతు ఇచ్చిన పార్టీలే అధికారంలోకి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంతో కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేనాని తెలంగాణలో కాపులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి తెలంగాణ కాపుల్లో మంచి పట్టు ఉంది. వేములవాడలో కాపు సంఘ భవనం ప్రారంభోత్సవానికి మెగా కుటుంబం ఆర్థికసాయం కూడా చేసింది. అన్ని జిల్లాలో, అన్ని నియోజకవర్గాల్లో కాపులు ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసేస్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వేసిన ఎత్తుగడతోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను చిత్తు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.