Palamuru Rangareddy Lift Irrigation: రెడీ అయింది ఒక్క మోటారే.. ఇది కేసీఆర్ మార్క్ ఎన్నికల ఎత్తిపోతలు
మొదటి దశలో చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లలో మొదటి నాలుగు రిజర్వాయర్ల పనులు మాత్రమే ఒక కొలిక్కివచ్చాయి. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.

Palamuru Rangareddy Lift Irrigation: మన రాష్ట్రంలో కృష్ణా నది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే మొదట అడుగుపెట్టేది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జూరాల ప్రాజెక్టు నిర్మించింది అందుకే. అక్కడి నుంచి కృష్ణానది నాగార్జునసాగర్ ను తాకుతుంది. కానీ అధికార భారత రాష్ట్ర సమితి మాత్రం అసలు చరిత్రలో ఉమ్మడి పాలమూరు వాసులు కృష్ణానది జలాలను ఇంతవరకు చూడలేదని ప్రచారం చేస్తోంది. పాలమూరు ఇప్పటివరకు సహారా ఎడారిగా ఉండేదని.. రేపటి నుంచి పచ్చని కోనసీమ అవుతుందని చెబుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఇప్పటిదాకా కృష్ణా జలాలను అసలు చూడనేలేదా? చరిత్రలో తొలిసారిగా జిల్లా భూములను కృష్ణమ్మ తాకనుందా? ఒక్క మోటార్‌తో ఏకంగా రెండు ఉమ్మడి జిల్లాలు (మహబూబ్‌నగర్, రంగారెడ్డి) సస్యశ్యామలం కానున్నాయా? అవుననే చెబుతోంది బీఆర్ఎస్. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నాలుగుచోట్ల పంప్‌హౌస్ లు ఉండగా, వీటిలో బిగించాల్సిన మోటార్లు అక్షరాలా 31. అయితే ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ ఆన్ చేసే ఎల్లూరు పంప్‌హౌస్ వద్ద 8 మోటార్లు పెడుతుండగా, వాటిలో ఒక్కటి మాత్రమే డ్రైరన్ పూర్తి చేసుకొని వెట్‌రన్‌కు సిద్ధంగా ఉంది. ఈ ఒక్క మోటార్‌కు స్విచ్ వేసి… దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం విశేషం. 8 ఏళ్లుగా పథకం పనులను గాలికొదిలేసిన ప్రభుత్వం… రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మొత్తం పూర్తయినట్లు ప్రచారం చేసుకుంటోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. శనివారం ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో సర్పంచ్‌లను సభకు రప్పించి… అదే రోజు కళశాలతో కృష్ణా జలాలను తీసుకెళ్లి… మరుసటి రోజు ఆలయాల్లో దేవతామూర్తుల పాదాలకు అభిషేకం చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు, నిర్వాసితుల సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. నీటిని తరలించే నిర్మాణాలే పూర్తిగా అందుబాటులోకి రాని పరిస్థితుల్లో ఏకంగా ప్రాజెక్టు పూర్తయిందనే భ్రమకల్పిస్తూ ప్రభుత్వం ప్రారంభోత్సవానికి సిద్ధమవడంఏమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
సగం పనులకే హడావుడి
మొదటి దశలో చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లలో మొదటి నాలుగు రిజర్వాయర్ల పనులు మాత్రమే ఒక కొలిక్కివచ్చాయి. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక కీలకమైన రెండో దశలో కాల్వల నిర్మాణాలు జరపాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు పనులే మొదలు కాలేదు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 13 ప్రధాన కాల్వలను ప్రతిపాదించారు. ఇందుకోసం 915 కి.మీ.ల కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. తాజాగా వట్టెం రిజర్వాయర్ నుంచి 20.60 కి.మీ.ల లోలెవల్ కెనాల్, మరో 152 కి.మీ.ల ప్రధాన కాల్వ నిర్మాణానికి ఇటీవలే ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలిచారు. వీటితో పాటు కరివెన రిజర్వాయర్ నుంచి 36 కి.మీ.ల లోలెవల్ కాల్వను, మరో 108 కి.మీ.ల హైలెవల్ కెనాల్‌ను ప్రతిపాదించారు. ఉదండాపూర్ నుంచి దక్షిణ కాల్వను 25 కి.మీ.ల మేర, మొదటి కుడికాల్వను 5 కి.మీ.ల మేర, రెండో కుడికాల్వను 72 కి.మీ.ల మేర, హన్వాడ కాల్వను 23 కి.మీ.ల మేర నిర్మించాలని ప్రతిపాదించారు. ఇవన్నీ పూర్తికావడానికి మరో మూడేళ్లు పడుతుందని అంచనా.
కృష్ణా జలాలను చూడలేదా?
పాలమూరు వాసులు ఇప్పటివరకూ కృష్ణా జలాలనే చూడలేదని, ఇప్పుడే ఆ అవకాశం వారికి దక్కుతుందన్నట్లుగా ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపైనా విస్మయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే, కృష్ణా బేసిన్ పరిధిలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద మహబూబ్‌నగర్ జిల్లాలో 3.69 లక్షల ఎకరాలకు ఇప్పటికే సాగు నీరు అందుతుండగా… రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) కింద 83 వేల ఎకరాలకు, రాజీవ్‌బీమా ఎత్తిపోతల పథకం కింద 1.66 లక్షల ఎకరాలకు, జవహర్ నెట్టెంపాడు కింద 1.42 లక్షల ఎకరాలకు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. అంతేకాకుండా, పదేళ్లుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి అవసరాలకు కూడా కృష్ణా జలాలు వినియోగంలో ఉన్నాయి.
పాలమూరు-రంగారెడ్డి పథకం పనులు ఈ ఆరు నెలల నుంచే ఊపందుకున్నాయి. అంతకు ముందు ప్రభుత్వం ఈ పథకం వైపు కన్నెత్తిచూడలేదు. జూలై 31వ తేదీ నాటికి రూ.5,768 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.52 వేల కోట్లకు చేరగా… ఏ ఆర్థిక సంస్థ నుంచి రుణాలు మంజూరు కాకపోవడంతో ప్రభుత్వమే బడ్జెట్ నుంచి విడుదల చేయాల్సి ఉంది. ఖజానాలోని నిధులు ఇతరత్రా అవసరాలకే ఖర్చవుతున్న దృష్ట్యా ప్రాజెక్టును పూర్తిచేయడం ఇప్పట్లో సాధ్యం కాదని, ఎన్నికల తర్వాత పనులన్నీ మందగిస్తాయని అనుమానాలున్నాయి.
