Oscar Nominations 2023: ప్రతి ఏడాది ఆస్కార్స్ ప్రకటిస్తారు. ప్రపంచ సినిమా మేధావులు హాజరవుతారు. ఎందరో ఆశించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందేది కొందరికే. అంతర్జాతీయ సినిమా వేదికపై ఆస్కార్ ని ముద్దాడటం ఓ కల. ఇండియన్ మేకర్స్ కి మాత్రం అక్కడ స్థానం లభించదు. అసలు మనకది సంబంధం లేని వ్యవహారంగా చాలా మంది చూస్తారు. అవార్డుల వేడుక జరిగిందా, విన్నర్స్ ని ప్రకటించారా, విన్నర్స్ ఎవరో తెలుసుకున్నామా… అంత వరకే. ఆస్కార్ ఈవెంట్ కి హాజరు కావాలి.మన సినిమా బరిలో నిలవాలనే ఆశలు ఉండవు. అకాడమీ అవార్డు ఆదుకుంటామని కల్లో కూడా తలుచుకోరు. ఎందుకంటే ఆస్కార్ అందుకోవడం అంత సులభం కాదు. గెలుచుకునేందుకు సాగించాల్సిన జర్నీ చిన్నది కాదు.

Oscar Nominations 2023
చాలా మంది కంటెంట్, క్వాలిటీ, ప్రేక్షకాదరణ మాత్రమే ప్రధాన క్రైటీరియాగా భావిస్తారు. అంతకు మించిన సవాళ్లు ఆస్కార్ అవార్డులో మిళితమై ఉన్నాయి. ఆస్కార్ ఎంపిక ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉంటుందో తెలిస్తే కానీ అవార్డు విలువ తెలిసిరాదు. ఫస్ట్ ఆస్కార్ బరిలో నిలవాలంటే కొన్ని ప్రధాన ప్రమాణాలు పాటించాలి. సినిమా జనవరి 1 నుండి డిసెంబర్ 31 లోపు విడుదలై ఉండాలి. అంటే 2023 ఆస్కార్స్ కి… 2022 జనవరి 1 నుండి డిసెంబర్ 31 లోపు విడుదలైన చిత్రాలు మాత్రమే పరిగణింపబడతాయి. 2021 లేదా 2023లో రిలీజ్ అయిన చిత్రాలు పరిగణలోకి తీసుకోరు.
మూవీ నిడివి 40 నిమిషాలకు పైగా ఉంది. 35 ఎంఎం లేదా 70 ఎంఎం ఫార్మాట్ లో తెరకెక్కించి ఉండాలి. అమెరికాలోని ప్రధాన నగరాల్లో కనీసం వారానికి పైగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించి ఉండాలి. ప్రతి దేశం అధికారికంగా ఒక చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కోసం ఎంపిక చేసి పంపవచ్చు. భారత్ తరపున ఆస్కార్ కి సినిమాలు ఎంపిక చేసేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ ఏడాది జ్యూరీ సభ్యులు చల్లో షో(ది లాస్ట్ ఫిల్మ్ షో) చిత్రాన్ని ఎంపిక చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ అధికారిక ఎంట్రీకి నోచుకోలేదు. ఈ కారణంగా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ చేసే అవకాశం కోల్పోయింది. బెస్ట్ మూవీ విభాగంలో గట్టి పోటీ ఉంటుంది. దీంతో ఆర్ ఆర్ ఆర్ కి ఆ విభాగంలో నామినేషన్ దక్కలేదు.

Oscar Nominations 2023
అకాడమీ అవార్డ్స్ సభ్యులు వరల్డ్ వైడ్ వేలల్లో ఉంటారు. వీరందరూ ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. కేటగిరీ వైజ్ ఎక్స్ పర్ట్స్ ఓటింగ్లో పాల్గొంటారు. రిమైండర్ లిస్ట్ లో ఉన్న ప్రతి సినిమాపై వారి ఫోకస్ ఉండదు. వరల్డ్ వైడ్ ఆ ఏడాది బాగా బజ్ క్రియేట్ చేసిన చిత్రాలను మాత్రమే చూసే అవకాశం ఉంది. అలాగే సినిమా బాగుందన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో పాజిటివ్ దృక్పధం తో మూవీ చూసి ఓటు వేసే ఆస్కారం ఉంటుంది.
అకాడమీ సభ్యుల దృష్టిని ఆకర్షించేందుకు హాలీవుడ్ లో భారీగా మూవీని ప్రమోట్ చేయాలి. దీని కోసం ప్రత్యేకంగా కొన్ని పి ఆర్ టీమ్స్ ఉన్నాయి. అవి కోట్లు ఛార్జ్ చేస్తాయి. ఆస్కార్ బరిలో నిలిచేందుకు మేకర్స్ చేసే ప్రయత్నాలు ఒక్కోసారి సినిమా బడ్జెట్ ని కూడా దాటిపోతాయి. అకాడమీ అవార్డు అందుకోవాలనే కల ఖర్చుకు వెనుకాడకుండా చేస్తుంది. గత ఆరు నెలలుగా రాజమౌళి అమెరికాలో ఉండి చేస్తుంది ఇదే. హాలీవుడ్ ప్రముఖులకు స్పెషల్ షోస్ వేసి వారు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి మాట్లాడేలా చేస్తున్నారు. ప్రపంచ సినిమా వేదికలపై ప్రదర్శిస్తూ, అవార్డ్స్ వేడుకల్లో పాల్గొంటూ ఆర్ ఆర్ ఆర్ పై విపరీతమైన బజ్ క్రియేట్ చేశారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం ద్వారా ఆర్ ఆర్ ఆర్ మూవీ మరింత పాపులారిటీ తెచ్చుకుంది. నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యేందుకు ప్రధాన కారణమైంది. ఆస్కార్ అవార్డు సంగతి దేవుడెరుగు నామినేట్ కావడమే గొప్ప విషయంగా ఇండియన్స్ భావిస్తారు. కారణం… వందేళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆస్కార్ కి నామినేటైన చిత్రాలు, ప్రముఖులు ముప్పైలోపే ఉంటారు.కాగా ప్రతి చిత్రం కోట్లలో ఖర్చు చేయడం ద్వారానే ఆస్కార్ అందుకుంది అనడం సరికాదు. గొప్ప చిత్రాలుగా పేరుగాంచి చిత్రాలు కొన్ని సహజంగానే కొన్ని ఆస్కార్ సభ్యుల దృష్టిని ఆకర్షించి అవార్డుల పంట పండిస్తాయి. ప్రతి కేటగిరీలో 5 సినిమాలు నామినేషన్స్ పొందుతాయి. వీటిలో జ్యూరీ సభ్యులు ఒకదాన్ని విన్నర్ గా నిర్ణయిస్తారు.