Operation BJP : కర్నాటకలో ఆపరేషన్ కమలం.. ఎవరికి ఎవరు టచ్ లో ఉన్నారు?
ఈ క్రమంలోనే ఆపరేషన్ కమలానికి కాషాయదళం సిద్ధమవుతుండడం కర్నాటకలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. మరికొద్ది గంటల్లో వెలువడే ఫలితాలు, స్థానాల సంఖ్య బట్టి వ్యూహం మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Operation BJP : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొద్ది గంటల్లోవెలువడనున్నాయి. అన్ని పార్టీలు గెలుపుపై నమ్మకంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ తప్పదని సంకేతాలిచ్చాయి. దీంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హంగ్ అన్న మాట రావడంతో అన్ని పార్టీలు జాగ్రత్తపడుతున్నాయి. పట్టు చేజారకుండా చూసుకుంటున్నాయి. ఈ క్రమంలో తమతో పలానా పార్టీ వారు టచ్ లో ఉన్నారంటూ మీడియాకు లీకులిస్తున్నారు. అయితే ఆది నుంచి బీజేపీకి ప్రతికూలత ఉందన్న ప్రచారం ఉంది. దీంతో ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. సౌత్ కి గేట్ వేగా భావిస్తున్న కర్నాటకలో ప్రతికూల ఫలితం వస్తే మాత్రం దేశ వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజారకూడదని కాషాయదళం గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
హంగ్ వస్తే మాత్రం..
హంగ్ ఏర్పడితే మాత్రం ఆపరేషన్ కమలం షూరు చేసే చాన్స్ ఉంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ సీఎం యడ్యూరప్ప నివాసంలో రహస్య భేటీ కర్నాటకంలో రాజకీయాల్లో కలకలం రేపింది. కాంగ్రెస్ కి పూర్తి మెజారిటీ వస్తే ఓకే కానీ… ఎవరికీ మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మాత్రం ఆపరేషన్ కమలానికి సిద్ధపడినట్టు సమాచారం. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని హై కమాండ్ పెద్దలు రాష్ట్ర నాయకులకు అలెర్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది జేడీఎస్ నేతలను టచ్ లోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జేడీఎస్ అధినేత తమతో కాంగ్రెస్, బీజేపీ రెండూ టచ్ లో ఉన్నాయని చెబుతుండడం విశేషం.
జేడీఎస్ అలెర్ట్..
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జేడీఎస్ కింగ్, కింగ్ మేకర్ అయ్యే చాన్స్ ఉంది. అదే సమయంలో బాధిత పార్టీగా కూడా నిలిచే చాన్స్ ఉంది. కాషాయదళం ఆపరేషన్ కమళాన్ని స్ట్రాంగ్ గా చేస్తే మాత్రం మూల్యం చెల్లించుకునేది జేడీఎస్సే. ఆ విషయం తెలిసే కాబోలు జేడీఎస్ అధినేత అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు అన్న స్ట్రాంగ్ గా భావిస్తోంది. అవసరమైతే కుమారస్వామికి సీఎం పీఠంపై కూర్చోబెట్టి తతంగం నడిపించాలని చూస్తోంది. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తొలుత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయాలి. అవసరమైతే ఆపరేషన్ కమలం. అదీ కుదరకపోతే మాత్రం కుమారస్వామిని ముందుపెట్టి రాజకీయం నడిపించడం.. బీజేపీ నేతల వ్యూహరచన ఇదే. యడ్యూరప్ప నివాసంలో సమావేశమైన బీజేపీ నేతలు ఈ మూడు స్ట్రాటజీలకు డిసైడయినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో కుమ్ములాటలు
కాంగ్రెస్ గెలుపు అంచుల దాకా వచ్చే చాన్స్ ఉంది. అయితే ఆ పార్టీలో ఇప్పటికే కుమ్ములాటలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సీఎం పదవి కోసం డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధ రామయ్య అన్నట్టు సీన్ క్రియేట్ అయి ఉండగా సడెన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఎంటర్ అయ్యారని తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతల తీరుతో కాంగ్రెస్ పార్టీ లో చీలిక వచ్చే చాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ కమలానికి కాషాయదళం సిద్ధమవుతుండడం కర్నాటకలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. మరికొద్ది గంటల్లో వెలువడే ఫలితాలు, స్థానాల సంఖ్య బట్టి వ్యూహం మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
