Odisha Train Accident : హృదయవిదారకంగా ఆర్తనాదాలు.. ఆ ప్రాంతమంతా భీతావహం
తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్‌ను ఢీకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. తొలుత పట్టాలు తప్పింది బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్సేనంటూ పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. కానీ.. మొదట పట్టాలు తప్పింది కోరమాండలేనని రైల్వే అధికారులు ప్రకటించారు.

Odisha Train Accident : చుట్టూ అలుముకున్న చీకటి. రైలు కోచ్‌ల కింద చిక్కుకుపోయి.. ఇరుక్కుపోయి.. కాళ్లు, చేతులు తెగి.. కాపాడాలంటూ హృదయవిదారకంగా చేస్తున్న ఆర్తనాదాలు.. చెల్లాచెదురుగా పడిన బోగీలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఒడిశాలోని బాలసూర్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనాప్రదేశంలో కనిపించిన దృశ్యాలివి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 233కు చేరింది. మరింత పెరిగే అవకాశముంది. మరో 900 మందికిపైగా తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఏపీకి చెందిన ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఏలూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారు రైలులో ప్రయాణిస్తున్నారు. దీంతో తమవారి ఆచూకీ కోసం బంధువులు ఆతృతగా ఆరాతీస్తున్నారు.
ఈ ఘటనలో కొంతమంది మృత్యువాత పడగా.. మరికొందరు క్షేమంగా బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు అక్కడ కనిపించిన దృశ్యాలు గగుర్పాటుకు గురిచేశాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలేశ్వర్ నుంచి రాజమండ్రి వస్తున్న సుశాంత్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ తొలుత పెద్ద శబ్ధం వచ్చింది. ఏసీ కోచ్ నుంచి బయటకు వస్తే.. అప్పటికే జనరల్, స్లీపర్ బోగీలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. మృతదేహాలు వేలాడుతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు.
షాలీమార్ నుంచి ఏలూరు వస్తున్న శ్రీకర్ బాబు మాట్లాడుతూ మే బీ8 కోచ్ లో ఉన్నాం. 30 సెకెండ్ల పాటు కోచ్ కుదుపునకు గురైంది. వెంటనే వచ్చి బయటకు చూడగా 15 బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు భయానకంగా కనిపించాయి. అతి కషమ్మీద బయటకు వచ్చాం. కిలోమీటరు కాలినడకన వస్తే ఒక బస్సు కనిపించింది. దాని ద్వారా భువనేశ్వర్ చేరుకున్నాం. ఘటనా ప్రదేశాలను ఊహించుకుంటే చాలా భయం వేస్తోంది.
షాలీమార్ నుంచి విజయవాడ వస్తున్న గోపీకృష్ణ మాట్లాడుతూ మేము బీ9 కోచ్ లో ఉన్నాం. ఒక్కసారిగా కుదుపు. దీంతో ఒకరినొకరిని పట్టుకొని భయంతో గడిపాం. బయటకు వచ్చేసరికి కోచ్ ఒరిగిపోయి ఉంది. విద్యుత్ తీగలు వేలాడుతూ కనిపించాయి. అయినా ఆందోళనతో బయటకు వచ్చాం. అదృష్టవశాత్తూ విద్యుత్ ప్రసారం నిలిచిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాం. కానీ కళ్లెదుటే వేలాడుతున్న మృతదేహాలు హృదయవిదారకంగా కనిపించాయి.
సహాయకచర్యలకు చీకటి అడ్డంకిగా మారినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. కాగా.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ లలో ఏది తొలుత పట్టాలు తప్పి ప్రమాదానికి గురైందనే విషయంపై రెండు రకాల కథనాలు వినిపించాయి. తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్‌ను ఢీకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. తొలుత పట్టాలు తప్పింది బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్సేనంటూ పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. కానీ.. మొదట పట్టాలు తప్పింది కోరమాండలేనని రైల్వే అధికారులు ప్రకటించారు.
