Site icon OkTelugu

Odisha CHSE 102 Marks Issue: 100కు 102 మార్కులా? ఎవడ్రా ఇది దిద్దింది.. పాస్ చేసింది..

Odisha CHSE 102 Marks Issue

Odisha CHSE 102 Marks Issue

Odisha CHSE 102 Marks Issue: సాధారణంగా ఒక పరీక్షలో వందకు వంద మార్కులు సాధించడమే గొప్ప విషయంగా భావిస్తాం. దాదాపు ఇది సాధ్యం కాదు. కనీసం ఒక్క మార్క్ అయినా తేడా ఉంటుంది. కానీ ఓ చోట ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఒక విద్యార్థికి వందకు ఏకంగా 102 మార్కులు వచ్చాయి. ఈ ఘటన విద్యాశాఖలో కలకలం రేపడమే కాకుండా, ఫలితాల తయారీలో ఉన్న లోపాలను ఎత్తిచూపింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? దీనిపై ఎలాంటి చర్చ సాగుతోంది.

ఒడిశా కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (CHSE)ఇటీవల 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో విశ్వజీత్ అనే విద్యార్థికి ఇంగ్లీష్ సబ్జెక్టులో ఏకంగా 102 మార్కులు వచ్చాయి. ఈ సంఖ్యను చూసిన ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వందకు వంద మార్కులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పరిమితిని మించి మార్కులు రావడంతో ఇది ఎలా సాధ్యమైందనేది పెద్ద చర్చకు దారితీసింది.

ఈ ఫలితాలు బయటకు రాగానే విద్యా వ్యవస్థలోని వాల్యుయేషన్ పద్ధతులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వేల సంఖ్యలో విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన బోర్డు పరీక్షల్లో ఇంతటి నిర్లక్ష్యం ఎలా జరుగుతుంది? అని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మూల్యాంకనం, మార్కుల నమోదు ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, దీనివల్ల విద్యార్థుల శ్రమ వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ అధికారులు, ఇది పూర్తిగా సాంకేతిక తప్పిదమేనని స్పష్టం చేశారు. మార్కులను కంప్యూటరైజ్ చేసే క్రమంలో జరిగిన ‘సాఫ్ట్‌వేర్ గ్లిచ్’ వల్లే ఈ పొరపాటు దొర్లిందని వారు పేర్కొన్నారు. మానవ తప్పిదం కంటే కూడా, డేటా ఎంట్రీ లేదా సిస్టమ్ లోపం వల్లనే ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు.

ఈ పొరపాటును గుర్తించిన వెంటనే సదరు విద్యార్థికి సరైన మార్కులను కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్ది, వారం రోజుల్లోనే సవరించిన మార్కుల జాబితాను జారీ చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version