Barack Obama : సర్ ప్రైజ్.. భారత్ లోని మాండ్యాకు వస్తున్న ఒబామా..
ఈ కేంద్రంలో గ్రానైట్‌తో చెక్కబడిన ‘మదర్ ఎర్త్’ విగ్రహం , 11,000 చదరపు అడుగుల ప్రధాన భవనం ఉంటుంది. ఒబామా రాకతో దీనికి చాలా గుర్తింపు వస్తుంది.

Barack Obama : అమెరికాలో ఫేమస్ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ హల్లెగెరె మూర్తి మాండ్యలోని తన స్వస్థలమైన హల్లెగెరెలో 13 ఎకరాల స్థలంలో రూ. 80 కోట్లతో సైన్స్ అండ్ స్పిరిచ్యువల్ సహకార కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. అమెరికా వెళ్లి ఎంతో ఎత్తుకు ఎదిగిన వివేక్.. తన స్వగ్రామానికి ఏదైనా చేయాలనే తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామాతోపాటు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఈ ఏడాది చివర్లో శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం.
హార్వర్డ్, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ అయిన డాక్టర్ వివేక్ (46), అమెరికా సెనేట్ చేత ధృవీకరించబడ్డ పెద్ద ప్రొఫెషనల్ గా అమెరికాలో గుర్తింపు దక్కించుకున్నారు. మార్చి 2021లో యునైటెడ్ స్టేట్స్ యొక్క 21వ సర్జన్ జనరల్‌గా పనిచేశారు. అతను గతంలో అధ్యక్షుడు ఒబామా హయాంలో 19వ సర్జన్ జనరల్‌గా పనిచేశాడు.
డాక్టర్ వివేక్ తండ్రి డాక్టర్ లక్ష్మీనరసింహమూర్తి గురువారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. హల్లెగెరెలో వేడుక కోసం ప్రభుత్వం నుండి బందోబస్తును కోరారు. దీనికి సంబంధించి మాండ్య జిల్లాకు చెందిన మంత్రి ఎన్ చెలువరాయస్వామి నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం సరైన రోడ్లు వేయాలని.. తగినంత విద్యుత్ సరఫరా చేయాలని అభ్యర్థించడం కోసం సిఎంకు వినతి పత్రం సమర్పించింది. వివిఐపిల సందర్శన దృష్ట్యా హెలీప్యాడ్ నిర్మాణం చేయాలని కోరింది.
ఒబామా వస్తుండడంతో ఈ ఏర్పాట్లు చేస్తే కేంద్రం మాండ్యాను ప్రపంచ పటంలో నిలబెట్టవచ్చని మండ్య ఎమ్మెల్యే రవికుమార్‌గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సిద్ధరామయ్య హామీ ఇచ్చారని తెలిపారు.
‘మదర్ ఎర్త్ సెంటర్ ఫర్ సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ’ని ‘భూదేవి ఆధ్యాత్మిక కేంద్రం’ అని కూడా పిలుస్తారు. ఇది మొదటి సర్వమత సమన్వయ కేంద్రం అని చెబుతున్నారు. దీనిని స్కోప్ ఫౌండేషన్ హల్లెగెరె గ్రామంలో నిర్మిస్తోంది. ఈ కేంద్రంలో గ్రానైట్‌తో చెక్కబడిన ‘మదర్ ఎర్త్’ విగ్రహం , 11,000 చదరపు అడుగుల ప్రధాన భవనం ఉంటుంది. ఒబామా రాకతో దీనికి చాలా గుర్తింపు వస్తుంది. మాండ్య పేరు మారుమ్రోగనుంది.
