అనాథలకు అండగా నిలిచి.. అమెరికా పంపి.. వీరి సేవకు సెల్యూట్

పదో తరగతిలో ఉత్తీర్ణులైన అనాథ బాలికలు, 80 శాతం మార్కులు సాధించిన తల్లి/తండ్రి లేని ఆడపిల్లలకు అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

  • Written By: Dharma Raj
  • Published On:
అనాథలకు అండగా నిలిచి.. అమెరికా పంపి.. వీరి సేవకు సెల్యూట్

Center for Social Service Voluntary Organisation: ఆసక్తి ఉన్నా కుటుంబ పరిస్థితులు, పేదరికం కారణంగా చాలా మంది చదువుకు దూరమవుతుంటారు. ప్రాథమిక స్థాయిలోనే కుటుంబానికి ఆసరాగా నిలవాలని పనులకు కుదురుతుంటారు. బాల కార్మికులుగా మారుతుంటారు. మరికొందరు చిన్ననాటే తల్లిదండ్రులను దూరం చేసుకొని కుటుంబసభ్యుల ఆదరణకు దూరమవుతుంటారు. బడిఈడులోనూ పాఠశాల బయట తిరుగుతుంటారు. ఇటువంటి వారిని అక్కున చేర్చుకొని విద్యాబుద్ధులు నేర్పుతోంది. వారి చదువుకయ్యే ఖర్చులన్నీ భరించి ప్రయోజికులుగా తీర్చిద్దుతోంది హైదరాబాద్ హయత్ నగర్ లోని సెంటర్ ఫర్ సోషల్ సర్వీసు స్వచ్ఛంద సంస్థ. రెండు దశాబ్దాల్లో ఈ సంస్థ ఆశ్రయమిచ్చింది. ఉన్నతరంగాల్లో స్థిరపడేటట్టు చేసింది.

విజయలక్ష్మి అనే మహిళ 2004లో సంస్థను ప్రారంభించింది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా 20 సంవత్సరాల్లో వేలాది మందిని అక్కున చేర్చుకుంది. ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్య అయినా ఆమె..భర్త అకాల మరణంతో ఒంటరి తల్లిగా ఎదురైన పరిణామాల నుంచి వచ్చిన ఆలోచనే ఈ సంస్థ. తాను పడిన బాధలు ఒంటరి తల్లిదండ్రులకు రాకూడదన్న భావనతో సంస్థను ప్రారంభించారు. తొలుత పది మంది విద్యార్థినులతో ప్రారంభమైన సంస్థ.. రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఏటా కొత్తగా 80 మంది విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు వారి ఉన్నత చదువులకయ్యే వ్యయాన్ని భరిస్తోంది.

ఈ సంస్థలో ఆశ్రయం పొందిన వందలాది మంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారు.  సంస్థ సహకారంతో చదువు పూర్తి చేసుకున్న ముగ్గురు యువతులు అమెరికాలో ఎంఎస్‌ పూర్తిచేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరో ముగ్గురు ప్రస్తుతం అక్కడే ఎంఎస్‌ చదువుతున్నారు. మరికొందరు టాటా, డెలాయిట్‌ తదితర ఎంఎన్‌సీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మానాన్నను కోల్పోయి వచ్చిన మరికొందరు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టారు.  ఏటా ఆశ్రమంలో చేరే పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపడం, రవాణా, భద్రత తదితర సమస్యలను అధిగమించడానికి 2009లో వీరే ఓ పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఓ దాత పాఠశాల భవనం నిర్మించడంతో ఆయన అభ్యర్థన మేరకు ‘నిమ్మగడ్డ ఆనందమ్మ మెమోరియల్‌ గర్ల్స్‌ స్కూల్‌(ఇంగ్లిష్‌ మీడియం)’ పేరుతో ప్రారంభించారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకూ  ప్రస్తుతం 550 మంది విద్యార్థినులు చదువుతున్నారు.

తాజాగా పదో తరగతిలో ఉత్తీర్ణులైన అనాథ ఆడపిల్లలను, 80 శాతం మార్కులు సాధించిన సింగిల్‌ పేరెంట్‌ విద్యార్థినులను తమ ఆశ్రమంలో చేర్చుకుని ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పిస్తోంది. పదో తరగతిలో ఉత్తీర్ణులైన అనాథ బాలికలు, 80 శాతం మార్కులు సాధించిన తల్లి/తండ్రి లేని ఆడపిల్లలకు అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వివరాలకు 79952 33348, 70938 00896 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Read Today's Latest Education jobs News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు