NIA vs Maoist : 23 ఏళ్ల వయసు.. నూనూగు మీసాలు.. సోదరులు ఇద్దరు సాయుధ బాట పట్టారు.. అతను కూడా వారినే అనుసరించాడు.. సోదరులు ఇద్దరిలో ఒకరు ఎన్ కౌంటర్లో చనిపోగా, మరొకరు అనారోగ్యం కారణంగా పోలీసులకు లొంగిపోయారు.. అతను మాత్రం అడవిలోనే ఉంటున్నాడు.. మావోయిస్టు పార్టీలో కీలక సభ్యుడిగా పనిచేస్తున్నాడు.. కానీ ఇప్పుడు అతని కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తీవ్రంగా గాలిస్తోంది.. అంతే కాదు అతనిని పట్టిస్తే పది లక్షల నజరానా కూడా ఇస్తానని ప్రకటించేసింది.. ఇంతకీ ఎవరు ఆ మావోయిస్టు? ఏమిటి అతని కథ? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎందుకు రంగంలోకి దిగింది?

మావోయిస్టు గాజర్ల రవి
అది భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామం.. గాజర్ల మల్లయ్య, కనకమ్మ దంపతులకు రామయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్ సంతానం.. వీరిలో రవి, సారయ్య, అశోక్ ఉద్యమంలోకి వెళ్లారు. అయితే వీరు ఉద్యమంలోకి వెళ్లేందుకు దారి తీసిన పరిస్థితులు కూడా సినిమాటిక్ గా ఉంటాయి.. 1987లో జరిగిన సింగిల్ విండో ఎన్నికల్లో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ డైరెక్టర్ గా పోటీ చేశాడు.. సారయ్య ప్రత్యర్థి నల్ల కృష్ణారెడ్డి విజయం సాధించారు.. కృష్ణారెడ్డి అ ప్రజాస్వామ్యంగా గెలిచారని అప్పట్లో సారయ్య ఆరోపించారు.. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థ పై ఆగ్రహంగా ఉన్న సారయ్య 1989లో అప్పటి పీపుల్స్ వార్ లో చేరారు. ఆ తర్వాత అన్న బాటలోనే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న గాజర్ల రవి ఆలియాస్ గణేష్ అలియాస్ ఆనంద్ అలియాస్ ఉదయ్ 1992లోనే పీపుల్స్ వార్ లో చేరారు.. 1994లో గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కూడా ఉద్యమ బాట పట్టారు.. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లారు.
వీరిలో 2008 ఏప్రిల్ 2న ఏటూరునాగారం మండలం కాంతనపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ తో పాటు ఆయన భార్య రమ మృతి చెందారు.. 2015 డిసెంబర్ లో దండకారణ్య ప్రత్యేక జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అనారోగ్య కారణాలతో వరంగల్ పోలీసులకు లొంగిపోయారు. 1992లో 23 ఏళ్ల వయసులోనే సాయుధ ఉద్యమంలోకి వెళ్లిన గాజర్ల రవి మాత్రం 31 ఏళ్లుగా ఉద్యమంలో కీలక నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.. గాజర్ల సోదరులు ముగ్గురు కూడా నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లడంతో ఈ ప్రాంతంలో అనేకమంది యువత సాయుధ పోరుకు ఆకర్షితులయ్యారు.
గాజర్ల రవి 2004లో చర్చల ప్రతినిధిగా కొన్నాళ్లు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. పీపుల్స్ వార్ పరకాల ఏరియా కమిటీ నుంచి ఏటూరునాగారం ఏరియా కమిటీ, కేకే డబ్ల్యు డివిజన్ కమిటీ సభ్యుడిగా, ఉత్తర తెలంగాణ కమిటీ ప్రతినిధిగా వ్యవహరించి కీలక నేతగా ఎదిగారు. అంతేకాదు ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోన్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కేంద్ర కమిటీ లో ఉన్న ఐదుగురిలో గణేష్ సీనియర్ నేత.. ఒడిశా బార్డర్లో ఎన్కౌంటర్ జరిగినా దాని వెనక గణేష్ ఉన్నాడని ఊహగానాలు వ్యక్తమౌతూ ఉంటాయి.. 2016 అక్టోబర్ 25, డిసెంబర్ 2 తేదీల్లో ఏఓబి లో భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిలో గణేష్ మృతి చెందాడంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత పెద్దగా గాజర్ల రవి పేరు వినిపించలేదు.
తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఒడిశాలోని పలుచోట్ల గణేష్ పోస్టర్లు విడుదల చేసింది.. అంతేకాదు అతనిని పట్టించిన వారికి పది లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలో 2012 ఫిబ్రవరి 10న భారత సెక్యూరిటీ ఫోర్స్ బలగాలపై జరిగిన దాడిలో బిఎస్ఎఫ్ కమాండెంట్ కాశ్వాన్, సెకండ్ ఇన్ కమాండ్ రాకేష్ శరన్, ఇన్స్పెక్టర్ అశోక్ యాదవ్, ఏఎస్ఐ జితేంద్ర కుమార్ మృతి చెందారు.. ఈ కేసును మల్కనగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. తాజాగా ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది.. దీంతో గణేష్ తో పాటు మరికొంతమంది మావోయిస్టు నేతలపై ఐదు లక్షలు, మూడు లక్షల చొప్పున రివార్డులు ప్రకటించింది.. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో గట్టిపట్టు ఉన్న గాజుల రవి పై భారీ నజరానా ప్రకటించడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.