Indian Railways New Rules 2022: రైల్వే శాఖ ప్రయాణికులకు పలు సదుపాయాలు కల్పిస్తోంది. దేశంలోనే అత్యంత పెద్దదైన సంస్థగా పేరుగాంచిన రైల్వే శాఖ ప్రయాణికుల కోసం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రయాణికులు రైలులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రైలులో ప్రయాణించేటప్పుడు ఇకపై నిశ్శబ్ధంగా ఉండాలి. లేదంటే శిక్షార్హులవడం ఖాయమే. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉండాలనేదానిపై పలు సూచనలు చేసింది.

ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు పెద్ద శబ్ధంతో పాటలు వినకూడదు. గట్టిగా ఫోన్ లో మాట్లాడకూడదు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదు. పెద్ద శబ్ధాలను నిషేధించారు. ఈ మేరకు రైల్వే శాఖ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని ఎవరు ఉల్లంఘించినా శిక్షార్హులవుతారు. రాత్రి పది గంటలు దాటిన తరువాత లైట్లు ఉంచకూడదు. తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా శిక్షకు అర్హులు కావడం జరుగుతుందని రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ఇక మీదట రైలులో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
రాత్రి పూట ప్రయాణికులు గుంపులు గుంపులుగా మాట్లాడకూడదు. నిబంధనలు పాటించని వారిపై కేసులు పెట్టేందుకు కూడా రైల్వే శాఖ వెనుకాడదు. ఈ నేపథ్యంలో కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ కచ్చితంగా పాటించి ఎదుటి వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని చెబుతోంది. రైల్వే శాఖ సూచనల ప్రకారం ప్రయాణికులు నడుచుకోవాలి. లేదంటే రైల్వే శాఖ విధించే జరిమానాలకు బాధ్యులు కావాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండకపోతే వారికే సమస్యలు వస్తాయని తెలుసుకోవాలి.

ప్రయాణికుల సౌకర్యార్థం ఏవైనా సమస్యలు కలిగితే రైలు సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలపై రైల్వే మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వస్తున్న సందర్భంలోనే కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్పీఎఫ్, టికెట్ చెకర్స్, కోచ్ అటెండెంట్లు, క్యాటరింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటూ పర్యవేక్షిస్తారని సూచిస్తోంది. ప్రయాణికులు సరిగా ఉండకుండా ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే శిక్షార్హులే. ఈ కొత్త నిబంధనలు ప్రకారం ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయని ప్రశంసలు వస్తున్నాయి.