Nara Lokesh Padayatra : జగన్ అడ్డాలో ఢీకొంటున్న లోకేష్.. ఏం జరుగు తుందో.. ఉత్కంఠ
కడప జిల్లాలో పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగులో పాదయాత్ర ప్రారంభమవుతుంది. ప్రస్తుతం జమ్మలమడుగు నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Nara Lokesh Padayatra : నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో యాత్ర పూర్తయ్యింది. కడప జిల్లాలో లోకేష్ అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పటివరకూ చిత్తూరు, అనంతపురం, కర్నూలులో పాదయాత్ర పూర్తయ్యింది. బుధవారం నుంచి కడప జిల్లాలో యాత్ర కొనసాగనుంది. ఈ రోజు సాయంత్రం కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గంలోని సుద్దపల్లిలో లోకేశ్ ఎంటర్ కానున్నారు. ఏప్రిల్ 12న ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో సుమారు 40 రోజుల పాటు యువగళం పాదయాత్ర కొనసాగింది.
కడప జిల్లాలో పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగులో పాదయాత్ర ప్రారంభమవుతుంది. ప్రస్తుతం జమ్మలమడుగు నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఒకప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గుండ్లకుంట శివారెడ్డి హయాంలో జమ్మలమడుగులో టీడీపీ బలంగా వుండేది. ఆయన హత్యానంతరం వారసుడిగా రామసుబ్బారెడ్డి వచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత కాలంలో టీడీపీలో చేరారు.
ఆదినారాయణరెడ్డి రాకతో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి మారిపోయింది. ఆది రాకను రామసుబ్బారెడ్డి వ్యతిరేకించారు. కానీ జగన్ సొంత జిల్లా కావడంతో ఇక్కడి పరిణామాలను బట్టి చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య సయోధ్యను కుదిర్చే ప్రయత్నం చేశారు. ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా, రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయించారు. ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల అనంతరం ఇద్దరూ పార్టీ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆదినారాయణరెడ్డి బీజేపీలో ఉండగా.. వైసీపీలో చేరి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీకి బలం ఉండడంతో లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గారన్ అవుతుందని టీడీపీ ఆశాభావంతో ఉంది.