Jamili election : జమిలీ ఎన్నికలు ‘కారు’కు బ్రేక్ వేస్తాయా? కేసీఆర్ “నమస్తే తెలంగాణ” అందుకే వద్దంటున్నదా?

మరోవైపు విపక్ష పార్టీలతో ఇండియా కూటమి బలపడటం..కాంగ్రెస్ కు జమిలి ఎన్నికల్లో మరింత బలం చేకూర్చే అవకాశాలుంటాయని అంటున్నారు.

  • Written By: Bhaskar
  • Published On:
Jamili election : జమిలీ ఎన్నికలు ‘కారు’కు బ్రేక్ వేస్తాయా? కేసీఆర్ “నమస్తే తెలంగాణ” అందుకే వద్దంటున్నదా?

Jamili election : దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు! ఇది సాధ్యం కాకపోతే కనీసం పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి లోక్‌సభ ఎన్నికలు! కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం ఇదే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెండింట్లో ఏది జరిగినా.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలతో కలిసే వస్తాయి. మరి అప్పుడు పరిస్థితేంటి? రాష్ట్రంలో ఏ పార్టీకి నష్టం జరుగుతుంది? ఎవరికి లబ్ధి చేకూరుతుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ పరిణామంతో రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కారుకే బ్రేకులు పడతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారాంశాలు, స్థానిక, జాతీయ పార్టీల ప్రచారాస్త్రాలు వేర్వేరుగా ఉంటాయి. ఎన్నికలు కేవలం రాష్ట్రం వరకే పరిమితమైతే స్థానిక పార్టీలు కొంతమేర ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కానీ, సార్వత్రిక ఎన్నికలతో కలిసి జరిగితే మాత్రం జాతీయ అంశాలు కూడా చర్చకు వస్తాయి. అప్పుడు ప్రధాన జాతీయ పార్టీలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తెరిగి కేసీఆర్ నమస్తే తెలంగాణ “జమిలి ఎన్నిక మాయా పాచిక” అని రాసుకొచ్చింది.

namaste telangana

namaste telangana

గతంలో ఇలా..

గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలన్నీ లోక్‌సభతో కలిసే జరిగాయి. 2014లోనూ చివరిసారిగా అలాగే ఎన్నికలు నిర్వహించగా.. బీఆర్‌ఎ్‌సకు 63 ఎమ్మెల్యే స్థానాలు, కాంగ్రెస్‌ 21, టీడీపీ 15 స్థానాలు దక్కాయి. అనంతరం 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో మాత్రమే జరిగాయి. దీంతో బీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో విజయం సాధించింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ 19 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా గతంలో మాదిరిగానే రాష్ట్ర అసెంబ్లీకి వేరుగా ఎన్నికలు నవంబరులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇందుకు సిద్ధమవుతోంది. కానీ, ప్రస్తుతం జమిలి ఎన్నికలు తెరపైకి రావడం బీఆర్‌ఎ్‌సకు నష్టం కలిగించే పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2018లో ముందస్తుకు అందుకే..

లోక్‌సభ ఎన్నికలతో కలిపి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తన పార్టీకి ఎదురయ్యే నష్టాన్ని సీఎం కేసీఆర్‌ గతంలోనే గుర్తించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే రెండోసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటు రాకుండా 2018లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేస్తున్నారు. దానివల్ల తెలంగాణ అసెంబ్లీకి ప్రతిసారీ ముందుగానే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన కల్పించారని చెబుతున్నారు. అదే క్రమంలో ఈసారి కూడా అసెంబ్లీకి వేరుగానే ఎన్నికలు ఉంటాయనే ధీమాతో కేసీఆర్‌ ఉన్నారు. కానీ, జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెబుతున్నారు. ఇందుకు.. లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తే జాతీయాంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉండడం ఒక కారణమైతే.. అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న మరో కారణమని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికోసం మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ వేసిన కేంద్రం.. త్వరలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇదంతా న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికలతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే.. కనీసం పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరో ఆరు నెలల్లో..

మరో ఆరు నెలల్లో ఎలాగూ ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలున్నాయి. వీటిలో తెలంగాణతోపాటు ఛత్తీస్ గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి. వీటికితోడు బీజేపీ పాలిత రాష్ట్రాలు గానీ, తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల నుంచి గానీ మరో ఐదింటిని ఎంపిక చేయాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఇందులో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిసా, హరియాణ, గోవా రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సాధ్యం కాకపోతే కనీసం ఈ పది రాష్ట్రాలతో కలిసి సాధారణ ఎన్నికలు జరపాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలో నిర్వహించే అవకాశం ఉంటుంది. అంటే.. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఆలస్యమవుతాయి. కానీ, వచ్చే ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించినందున.. ఆరు నెలలపాటు వారు ప్రచారంలోనే ఉండాల్సి ఉంటుంది. దీంతో వారిపై ఆర్థికంగా భారం పడుతుంది. ఇది గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంటుంది. దీనికితోడు బీజేపీతో బీఆర్‌ఎస్ కు లోపాయికారీ ఒప్పందం ఉందన్న విమర్శల నేపథ్యంలో ‘కారు’ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే, రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్నందున ప్రజల్లో సహజంగా ఉండే వ్యతిరేకత కూడా బీఆర్‌ఎస్ కు నష్టం చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు విపక్ష పార్టీలతో ఇండియా కూటమి బలపడటం..కాంగ్రెస్ కు జమిలి ఎన్నికల్లో మరింత బలం చేకూర్చే అవకాశాలుంటాయని అంటున్నారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు