Munugodu By Election: కాంగ్రెస్ తొడలు కొడుతోంది.. బిజెపి జబ్బలు చరుస్తున్నది. అధికార టీఆర్ఎస్ సై అంటున్నది. ఇంతకీ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? ఆరు మండలాల స్వరూపంగా ఉన్న మునుగోడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఎంత? అధికార టీఆర్ఎస్ ఇప్పటి వరకు వెచ్చించిన నిధులు ఎన్ని? రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అనుకుంటున్నారు? ఏ నినాదంతో టిఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లాలి అనుకుంటున్నది? ఏ విధానంతో మళ్లీ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది? కొంతమేర మాత్రమే ఉనికి ఉన్న దక్షిణాదిలో కమలం పాగా వేయగలదా?

Munugodu By Election
ఆరు మండలాల స్వరూపం
చౌటుప్పల్, నారాయణపూర్, చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ.. ఈ ఆరు మండలాల స్వరూపం మునుగోడు నియోజకవర్గం. ఈ మండలాల్లో గౌడ, యాదవులు, ముదిరాజుల ఓట్లే అధికంగా ఉంటాయి. గత కొన్నేళ్ళ నుంచి వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మరోసారి మీరు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అధికార టీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రం గానే ఉంది. పైగా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి బాగా పట్టు ఉండటంతో మొదటినుంచి వారే గెలుస్తూ వస్తున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గంలో గెలిచిన రెడ్డి ఎమ్మెల్యేలు. నియోజవర్గం ఏర్పడిన వాటి నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత స్థానంలో ఉజ్జిని నారాయణరావు ఉన్నారు. అయితే మొదట్లో ఈ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్కు జై కొట్టారు. మధ్యలో కమ్యూనిస్టు పార్టీకి పట్టం కట్టారు. తర్వాత టిఆర్ఎస్ కు ఆకర్షితులయ్యారు. 2018 ఎన్నికల్లో మాత్రం మళ్లీ కాంగ్రెస్కే జై కొట్టారు. తొలిసారి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై విజయ దుందుభి మోగించారు.
Also Read: Hyderabad Bhagyanagar: హైదరాబాద్ ఒకప్పుడు భాగ్యనగరమా? చరిత్రను బట్టి అసలు నిజమిదీ!
అభివృద్ధి అంతంతే
2014 ఎన్నికల్లో ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ ఆశించిన మేర అభివృద్ధి జరగలేదు. వ్యవసాయ ప్రధాన వృత్తిగా సాగే ఈ నియోజకవర్గం నల్గొండ జిల్లా కేంద్రానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెరువులు చిన్నపాటి కుంటలు తప్ప స్థిరమైన నీటి ప్రాజెక్ట్ అంటూ ఒకటి లేదు. పైగా ఇక్కడి రైతులకు బోరు బావులే ఆధారం. ఇక గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా అందుతోంది. 2014 నుంచి 18 వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ప్రభాకర్ రెడ్డి చెప్పుకునే స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఇదే ఆయన ఓటమికి దారితీసింది. ఇక 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. అధికార టీఆర్ఎస్ నిధులు అంతంత మాత్రమే విడుదల చేయడంతో వాటితోనే పనులు చేశారు. అయితే తాజాగా ఆయన రాజీనామాతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద నిధులు విడుదల చేస్తున్నది. ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించి చెల్లింపులు జరుపుతోంది. గ్రామాల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గతంలో హుజురాబాద్, నాగార్జునసాగర్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆసరా పింఛన్లకు మోక్షం లభించినట్టే ఈసారి కూడా ఈ నియోజకవర్గ పరిధిలో పింఛన్ల మంజూరులో కదలిక వచ్చింది. పైగా కొత్త రేషన్ కార్డులు కూడా మంజు చేసే ప్రక్రియకు తెరలేచింది.

Munugodu By Election
ఓటర్ల మనోగతం ఏంటో
గత తపిదాన్ని మళ్లీ రిపీట్ చేయకుండా ఉండేందుకు టిఆర్ఎస్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. పోయిన పరువును మళ్లీ తిరిగి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతుంది. రాజగోపాల్ రెడ్డి చేరేది ఎలాగూ లాంచనం అయినప్పటికీ బిజెపి అంతగా తొందరపడటం లేదు. ఇక ఈ మూడు పార్టీలు కూడా సర్వేలు నిర్వహించడంలో తలమునకలు అయ్యాయి. అయితే మూడు పార్టీలు కూడా వేర్వేరు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించడంతో వారంతా గ్రామాలను జల్లెడ పడుతున్నారు. అయితే ఇందులో అధికార టిఆర్ఎస్కు ఆశించినంత మేర పాజిటివ్ రెస్పాన్స్ దక్కకపోవడంతో ఆ పార్టీ నేతలు డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన అంతంత మాత్రపు అభివృద్ధి పనుల్లో అధికార టీఆర్ఎస్ నాయకులకు సింహభాగం కేటాయించడంతో ఓటర్లు ఒకింత అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ప్రభాకర్ రెడ్డి ఓటమి తర్వాత అధికార టీఆర్ఎస్ నాయకులు ఓటర్లను అంత కలుసుకోకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా రాజగోపాల్ రెడ్డికి దీటైన స్థాయిలో అభ్యర్థిని నిలబెట్టాలని ఆ పార్టీ అనుకుంటున్నది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సారధ్యంలో పలుమార్లు నియోజకవర్గ పరిధిలోని నేతలతో సమావేశాలు జరిగాయి. అయితే ఖర్చుకు భయపడి కొంతమంది నేతలు వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం. పైగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతగా వెలుగులోకి రాకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. అంగ బలం, అర్థబలం పుష్కలంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన విజయంపై ఆశలు పెట్టుకున్నారు.
రాష్ట్రంలో దుబ్బాక, హుజురాబాద్, నాగార్జునసాగర్ లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రలోభాలకు తెరలేచింది. ఇప్పుడు మునుగోడు లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో సంవత్సరం మాత్రమే గడువు ఉండడంతో మునుగోడు ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పై ఒత్తిడి మాత్రం అధికంగా ఉందన్నది సుస్పష్టం. కాంగ్రెస్ గెలిస్తే 2023 ఎన్నికలకు బలంగా వెళ్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై అధిష్టానానికి ఒక అంచనా ఏర్పడుతుంది. ఒకవేళ ఓడిపోతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్లో ఉన్న శక్తులు మొత్తం ఏకమవుతాయి. ఇక బిజెపికి దక్షిణాదిలో అంతంత మాత్రమే బలం ఉంది కాబట్టి గెలిస్తే చరిత్ర అవుతుంది. 2023 ఎన్నికలకు కెసిఆర్ ను ఢీ కొట్టే స్థాయిలో వెళుతుంది. ఓడిపోతే రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడుతుంది.
Also Read:Telangana Congress: కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? తప్పు రేవంత్ రెడ్డి దా? సీనియర్లదా?