KCR- Left Parties: మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీలు జతకడుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే సీపీఐ, సీపీఎం పార్టీలు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు గత్యంతరం లేదు. టీఆర్ఎస్ ఒక్కటే వారికి స్వచ్ఛంగా కనిపిస్తోంది. దీంతో బీజేపీని నిలువరించాలనే ఉద్దేశంతో వారి సపోర్టు టీఆర్ఎస్ కు ఇస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ త్వరలో రానుంది. దీంతో రాజకీయ వేడి రగులుకుంటోంది. బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్ కే ఉందని కమ్యూనిస్టులు ఆలోచిస్తున్నారు. కేంద్ర నాయకత్వం సూచనల మేరకే వారు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు.

KCR- chada venkat reddy
మతోన్మాద శక్తులతో దేశానికి ముప్పు పొంచి ఉందనే ఆలోచనతో బీజేపీని ఎదుర్కోవాలని భావించి టీఆర్ఎస్ ను తమ భాగస్వామిగా చేసుకోవడం గమనార్హం. లౌకిక భావజాల పార్టీలని చెబుతున్న కమ్యూనిస్టులకు మరి టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో జత కడితే అది మతతత్వ పార్టీ కాదా అనే వాదనలు వస్తున్నాయి. తోక పార్టీలని కమ్యూనిస్టులను ఉద్దేశించి గతంలో కేసీఆర్ పలుమార్లు విమర్శలు చేసిన విషయం ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడెవడు లేకపోతే అక్క మొగుడు దిక్కన్నట్లు ప్రస్తుతం ఎవరు కూడా లేకపోవడంతో టీఆర్ఎస్ పంచన చేరినట్లు చెబుతున్నారు.
బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించే క్రమంలో టీఆర్ఎస్ కమ్యూనిస్టులను చేరదీసినట్లు సమాచారం. తెలంగాణలో కమ్యూనిస్టులకు టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ కనిపించడం లేదు. ఈ క్రమంలో కమ్యూనిస్టులు తీసుకున్న నిర్ణయంతో మత ప్రాతిపదికన విభజించే బీజేపీని నిలువరించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ప్రచారంలోకి వస్తోంది. కాంగ్రెస్ ను దూరం చేయాలంటే బీజేపీపై వ్యతిరేకత ఉన్నట్లు భావిస్తే అది కాంగ్రెస్ ఓటు బ్యాంకును కూడా చీల్చే అవకాశం ఉంది. దీంతోనే పక్కా వ్యూహం ప్రకారమే కేసీఆర్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో దూరమైనా ఇక్కడ మాత్రం గెలిచి తీరుతామని కాంగ్రెస్ బింకాలు ప్రదర్శిస్తుంటే చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.

cpi
హుజురాబాద్ స్థాయిలోనే మునుగోడుపై కూడా అందరికి ఉత్కంఠ ఏర్పడుతోంది. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపుతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని బీజేపీ నేతలు చెబుతుంటే టీఆర్ఎస్ మాత్రం తమదే గెలుపు అని ప్రకటిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం మాదే కావడంతో మాకే విజయావకాశాలు ఉన్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడులో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చెప్పడం కష్టమే. కానీ మొత్తానికి సమరం మాత్రం మొదలు కాబోతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ప్రధానంగా జరగనుందని చెబుతున్నారు.