Bandi Sanjay Birthday: వారణాసికి బండి సంజయ్.. అక్కడ పెద్ద కథే నడుస్తోందే!
బండి సంజయ్ అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చాలా సంవత్సరాల పని చేశారు..ఆర్ ఎస్ ఎస్ లోనూ కీలక పదవులను అధిష్టించారు. చాలాసార్లు జైలుకు కూడా వెళ్లారు.

Bandi Sanjay Birthday: ఇవాళ బండి సంజయ్ జన్మదినం. రాజకీయ జీవితంలోకి వచ్చిన నాటి నుంచి గత ఏడాది వరకు బండి సంజయ్ తన నియోజకవర్గం దాటిపోలేదు. తన ఇంట్లోనే వేడుకలు చేసుకునేవారు. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులతో సరదాగా ముచ్చటించేవారు. వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. అక్కడ వారికి భారీ స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేసేవారు. కానీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత బండి సంజయ్ తన జన్మదినాన్ని ఈసారి కరీంనగర్లో జరుపుకోవడం మానేశారు. తాను కుటుంబ సభ్యులతో కలిసి వారణాసి వెళ్తున్న సందర్భంగా అందుబాటులో ఉండలేకపోతున్నానని ప్రకటించారు. తన కార్యాలయం నుంచి ప్రెస్ నోట్ కూడా విడుదల చేయకుండా కేవలం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. పైకి చూస్తే ఇది దైవ దర్శనం లాగా కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బండి సంజయ్ వారణాసి వెళ్లడం వెనక పెద్ద స్కెచ్ ఉందని తెలుస్తోంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పిలుపు
బండి సంజయ్ అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చాలా సంవత్సరాల పని చేశారు..ఆర్ ఎస్ ఎస్ లోనూ కీలక పదవులను అధిష్టించారు. చాలాసార్లు జైలుకు కూడా వెళ్లారు. ఇప్పటికీ ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి. బండి సంజయ్ లో పోరాడే తత్వం ఉంది కాబట్టే భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఆయన పేరు ప్రకటించేలా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేసింది. ఇప్పటికి కూడా ఆయనకు ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటికీ సంఘ్ నుంచి ఆయనకు బలమైన సంకేతాలు వెళ్లడంతోనే కేంద్ర సహాయ మంత్రి పదవిని కూడా తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతున్నది. పైగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పిలుపుమేరకే ఆయన వారణాసి వెళ్లినట్టు తెలుస్తోంది. వాస్తవానికి తన జన్మదిన వేడుకలను ఇంటి వద్ద జరుపుకోవాలని సంజయ్ అనుకున్నారు..కానీ సంఘ్ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఆయన వారణాసి వెళ్లారు.
అక్కడికే ఎందుకు వెళ్లినట్టు
వాస్తవానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉంటుంది. అయితే ఇక్కడ కార్యాలయంలో కొంతమంది వేగులు కిషన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ చర్చించే అంశాలు మొత్తం కిషన్ రెడ్డికి, ఇతర వ్యక్తులకు తెలిసే అవకాశం ఉన్నందున బండి సంజయ్ ని వారణాసి రమ్మన్నట్టు ప్రచారం జరుగుతున్నది. వారణాసిలోని గోరఖ్ పూర్ మఠం లో కొంతమంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రముఖ్ లతో బండి సంజయ్ భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే బండి సంజయ్ కి వచ్చే ఎన్నికల్లో తాము అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో కూడా అధ్యక్షుడు అయ్యే ముందు వారంతా కూడా బండి సంజయ్ కి ఇలానే అండగా నిలబడ్డారు. ప్రస్తుతం సంజయ్ రాజకీయ ప్రయాణం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఉన్న నేపథ్యంలో సంఘ్ పెద్దలు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో బాగానే ఎటువంటి పదవి లేకపోయినప్పటికీ బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే లాగా భారతీయ జనతా పార్టీకి సంఘ్ ప్రముఖ్ లు ఆదేశాలు జారీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీటి ప్రకారం త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రచార యాత్ర నిర్వహిస్తుందని, కిషన్ రెడ్డి తో పాటే బండి సంజయ్, ఈటెల రాజేందర్ కూడా ఇందులో పాల్గొంటారని సమాచారం.. అయితే ఈ వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే బండి సంజయ్ వారణాసి టూర్ పెట్టుకున్నారని తెలుస్తోంది. మరి.. సంఘ్ పెద్దలు ఇచ్చిన బలంతో బండి సంజయ్ మునుపటిలాగా పనిచేస్తారా? దానిని భారతీయ జనతా పార్టీలోని ఇతర వ్యక్తులు సమర్ధిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది
