Attacked on Media Representatives : మరోసారి ఏపీ లో మీడియా పై ఎంపీ అవినాష్ అనుచరుల దాడి
ర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద మీడియాపై దాడి జరిగినప్పుడు సమీపంలో పోలీసులు విధుల్లో ఉన్నారు. అవినాశ్ అనుచరులు మీడియా ప్రతినిధులపై దాడులకు దిగినా పట్టించుకోలేదు.

Attacked on Media Representatives : కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద హల్ చల్ చేస్తున్నారు. సోమవారం నాటి సీబీఐ విచారణకు హాజరుకాలేనంటూ అవినాష్ రెడ్డి లేఖతో కలకలం చోటుచేసుకుంది. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ తప్పదని ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే సీబీఐ అధికారులు పావులు కదపడంతో స్థానిక మీడియా ప్రతినిధులు అలెర్టయ్యారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత విశ్వభారతి ఆస్పత్రి వద్ద కెమెరాలతో మొహరించారు. అటు కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్నంతగా పరిస్థితి నెలకొంది.
ఆస్పత్రిలోకి ఎవరూ వెళ్లకుండా వైసీపీ శ్రేణులు వలయంగా ఉన్నారు. దీంతో ఆరుబయటే మీడియా ప్రతినిధులు వేచి ఉన్నారు. సరిగ్గా అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో పది నుంచి 15 మంది రౌడీలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఏయ్ ఎవరు నువ్వు? నీది ఏ పేపర్? ఏ చానల్? అని ప్రశ్నిస్తూ. బూతులు తిడుతూ విలేకరుల వెంటపడ్డారు. ఈటీవీ రిపోర్టర్ రెడ్డి…ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వెంకటేష్, కెమెరామెన్స్ నగేష్,చంద్రశేఖర్ లపై దాడిచేశారు. కెమెరాలను ధ్వంసం చేశారు. కొందర్నైతే పక్కకు లాక్కెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. సెల్‌ఫోన్ లాక్కున్నారు. అందులోని ఫొటోలను డిలిట్ చేశారు.అక్కడున్న మీడియా ప్రతినిధులందరినీ తరిమేశారు. కొందరిని సమీపంలో ఉన్న టీ బంకులోకి తీసుకెళ్లి.. షట్టర్ మూసి తాళం వేశారు. కొద్దిసేపటి తర్వాత బయటికి వదిలి… ఆసుపత్రి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తామంటూ బెదిరించారు.
ఈ నెల 19న హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఇదే రకంగా రెచ్చిపోయారు. అవినాష్ రెడ్డి అనుచరులు, వైసీపీ నేతలు మీడియా వాహనాలపై దాడిచేశారు. కార్ల అద్దాలను పగులగొట్టారు. విచారణకు హాజరైనట్టే అయ్యి.. హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి కాన్వాయ్ తో యూటర్న్ తీసుకున్నారు. దీంతో మీడియా వాచ్ చేసింది. ఈ క్రమంలో అవినాష్ అనుచరులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. ఏబీఎన్ తో పాటు హెచ్ఎంటీవీ ప్రతినిధులపై దాడిచేశారు. వారి వద్ద నుంచి కెమరాలను సైతం లాక్కున్నారు. ఇంత జరిగినా తెలంగాణ సర్కారు మాత్రం స్పందించలేదు.
అయితే కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద మీడియాపై దాడి జరిగినప్పుడు సమీపంలో పోలీసులు విధుల్లో ఉన్నారు. అవినాశ్ అనుచరులు మీడియా ప్రతినిధులపై దాడులకు దిగినా పట్టించుకోలేదు. పైగా… పాత్రికేయులపైనే అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి బయట ఉన్న పాత్రికేయులపై దాడి ఘటనను వివిధ పాత్రికేయుల సంఘాల నాయకులు ఖండించారు. మీడియా ప్రతినిధులు కలెక్టరేట్ వద్ద గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అక్కడికి చేరుకుని రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే వరుసగా అవినాష్ అనుచరులు మీడియాపై దాడులు చేస్తున్నా వారిపై కేసులు లేవు. వారిని నియంత్రించిన దాఖలాలు కూడా లేవు. దీంతో దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.