
ఏపీలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు రంగం సిద్ధమైంది. ఆదివారం 71 మునిసిపాలిటీలు, 12 మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును చేపడుతున్నారు. ఈ ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కావడంతో ఖచ్చితంగా ఈ మునిసిపల్ ఎన్నికలలో ఆ పార్టీకి కొంచెం ఆధిక్యత ఉండే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రెండేళ్ళు కూడా కాకపోవడంతో ప్రజలు పూర్తిగా వైసీపీని తిరస్కరించే వ్యతిరేకత కనిపించడం లేదు. అదే సమయంలో టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలలో కొంత సానుకూల ఓటును కలిగి ఉన్నారనే నమ్మకం పెట్టుకున్నారు. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తన పనితీరును కొంతవరకు మెరుగుపరుచుకుందని భావిస్తున్నారు. గత రెండు సంవత్సరాలలో అంతో ఇంతో టీడీపీకి అనుకూలత పెరిగిందంటున్నారు.
ఇక వివిధ పోల్ ఏజెన్సీలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలు టిడిపికి దయనీయమైన పరిస్థితి ఎదురుకాబోతున్నట్టు అంచనా వేశాయి. మునిసిపల్ ఎన్నికలలో ఏ ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఏ ఏజెన్సీ తీసుకురాలేదు. అయితే టిడిపి ఈ ఎన్నికల్లో అత్యంత చెత్త ప్రదర్శనను ఇవ్వబోతోందని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మునిసిపల్ ఎన్నికల ఫలితం ఏకపక్షంగా ఉంటాయని.. రాష్ట్ర చరిత్రలో టీడీపీ ఎప్పుడూ చూడని ఫలితం వస్తుందని ఎన్నికల సర్వే సంస్థ ఆరాకు చెందిన పిసెఫాలజిస్ట్ షేక్ మస్తాన్ అంచనా వేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఇంతవరకు ఏ ఎన్నికలలోనూ ఇంత ఘోరమైన ప్రదర్శన ఇవ్వబోదని ఆయన అన్నారు. అయితే మస్తాన్ తన ట్వీట్‌లో ఎలాంటి గణాంకాలు ప్రస్తావించకపోవడం గమనార్హం.
రాష్ట్రంలోని మొత్తం 12 మునిసిపల్ కార్పొరేషన్లను గెలుచుకోవడంతో పాటు, ఎన్నికలకు వెళ్ళిన 71 మునిసిపాలిటీలు మరియు నగర్ పంచాయతీలలో వైయస్ఆర్సి 65 కన్నా ఎక్కువనే గెలుచుకుంటుందని అంచనావేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సి దరిదాపుల్లోకి కూడా టిడిపి రాదని అంటున్నారు. ఒక్క విజయవాడ, విశాఖపట్నంలో కొంత టఫ్ ఫైట్ ఇస్తుందని చెబుతున్నారు. టీడీపీ ఏమేరకు రాణిస్తుందనేది రేపు తేలనుంది.