G20 Summit- PM Modi: మోడీ అంతు పట్టడు. అంతు చిక్కడు. కాశ్మీర్ కు సంబంధించి స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేసినప్పుడు చాలామంది విమర్శించారు. కానీ తర్వాత తన మదిలో ఉన్న ఆలోచనలు మొత్తం అమల్లో పెట్టాడు. ఇప్పుడు అక్కడ సీన్ మొత్తం పూర్తిగా మారిపోయింది. తర్వాత కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కలుగజేసుకోకుండా ఉండాలి అంటే బలమైన దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బ కూడా చాలా సాలిడ్ గా ఉండాలి. అది మోడీ కోరుకున్నట్టుగానే జి20 అధ్యక్ష రూపంలో వచ్చింది. బయట గెలిచారు సరే.. ఇంటి మాట ఏమిటి? ఏముంది అనుకున్నదే తడవుగా నిన్న ఢిల్లీలో రాష్ట్ర పతి భవన్ లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు. అందరితో దగ్గరికి వెళ్లి మాట్లాడాడు. సీతారాం ఏచూరి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరితో పిచ్చా పాటిగా మాట్లాడాడు. తర్వాత అందరు కూడా మీ నాయకత్వం కావాలి అన్నారు.. మోడీకి కూడా కావాల్సింది అదే. ఇప్పుడు అదే జరిగిపోయింది. నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ కు సాలిడ్ దెబ్బ. తర్వాత జరగబోయేది కూడా అదే.

G20 Summit- PM Modi
నయా కాశ్మీర్ ఫైల్స్
కాశ్మీర్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆ ఉగ్రవాద దాడులు.. నిత్యం బాంబు మోతలతో హోరెత్తిపోయే ప్రాంతాలు.. ఎప్పుడు ఏ బాంబు మీద పడుతుందో తెలియదు.. ఎప్పుడు ఏ ఉగ్రవాది ఇంటి తలుపు తడతాడో తెలియదు. నా అనే వాళ్ళు రారు. పేరుకు అది భూతల స్వర్గమే కానీ… అక్కడి ప్రజలు అనుభవించేది మాత్రం నిత్య నరకం. అక్కడ దేశ రాజ్యాంగం అమలు అయ్యేది కాదు. దేశ జెండా కూడా ఎగిరేది కాదు. భారతదేశంలో భాగమే కానీ… అదొక స్వతంత్ర ప్రాంతంగా ఉండేది. కానీ 2019 లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదాను ఎత్తేసి.. జమ్ము, లడక్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంతో కొత్త చరిత్ర మొదలైంది. అంతేకాదు ఈ ప్రాంతానికి సమర్ధుడైన లెఫ్టినెంట్ గవర్నర్ ను నియమించడంతో నయా కాశ్మీర్ రూపు దిద్దుకుంటున్నది.
మనోజ్ సిన్హా ద్వారా..
మనోజ్ సిన్హా ను లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించిన తర్వాత కేంద్రం తన వ్యూహాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తున్నది. పాలనా వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. అవినీతి అంతానికి కంకణం కట్టుకుంది. అంతేకాదు మనోజ్ నాగరిక్ పేరుతో ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నిర్దిష్ట గడువు లోగా పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి 105 మంది ఉద్యోగులను విడుదల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఉద్యోగులు ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించడాన్ని మనోజ్ తప్పనిసరి చేశారు.. ఖాళీల భర్తీకి నిర్దిష్ట నియామక వ్యవస్థ అందుబాటులోకి రావడంతో అర్హులకే ఉద్యోగాలు దక్కుతున్నాయి. ప్రభుత్వ పనుల నిర్వహణ కోసం టెండర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం కూడా పాలనలో పారదర్శకతను పెంచింది.. 2019 నుంచి జమ్మూ కాశ్మీర్లో 29,813 పోస్టులు భర్తీ చేశారు. ప్రస్తుతం 1,087 గెజిటెడ్, 4,436 నాన్ గెజిటెడ్ పోస్టులు, 3,175 క్లాస్_ 4 ఉద్యోగుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టారు.

G20 Summit- PM Modi
పెట్టుబడుల ప్రక్రియ మొదలు
జమ్ము కాశ్మీర్లో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త విధానం మొదలుపెట్టారు. ఇందుకోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 55,000 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి..వాటిలో 34,454 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 3,379 దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని.. 19,961 కనాల్ ల భూమిని కేటాయించారు. ఒక కనాల్ ఎకరం భూమితో సమానం.. దీనివల్ల కొత్తగా 1,60,000 ఉద్యోగాలు వస్తాయనేది అంచనా. నూతన పారిశ్రామిక విధాన కింద దరఖాస్తు చేసుకున్న వారికి 75 రోజుల్లో ఆన్లైన్లో ద్వారానే భూమి కేటాయింపులు పూర్తి చేస్తున్నారు. ప్లాంట్ అండ్ మిషనరీ పై 400 % ప్రోత్సాహకం అందిస్తున్నారు. దీనివల్ల యాపిల్ అధికంగా పండే పుల్వామా జిల్లాలో వాటి శుద్ధి, నిల్వకు సంబంధించిన ఆధునిక పరిశ్రమలు భారీగా వచ్చాయి.. ఇదే జిల్లాలో పెన్సిళ్ళ తయారీ, క్రికెట్ బ్యాట్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు.
జి20 సదస్సు కూడా ఇక్కడే
జి20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడే శిఖరాగ్ర సదస్సు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక హోదా తొలగించక ముందు కాశ్మీర్ ఎలా ఉంది? తొలగించిన తర్వాత ఎలా మారింది అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రపంచ దేశాలకు చూపించేందుకు ఆయన సమాయత్తమవుతున్నారు. పనిలో పనిగా కాశ్మీర్ విషయాన్ని పదేపదే గెలుకుతున్న చైనా, పాకిస్తాన్ దేశాలకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని మోడీ భావిస్తున్నారు.. అందులో భాగంగానే కాశ్మీర్ అభివృద్ది కి సంబంధించి భారత్ ఎలా కట్టుబడి ఉందో చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. అయితే శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు కేంద్ర భద్రత సలహాదారు అజిత్ దోవల్ కాశ్మీర్ వెళ్లి వచ్చారు. అయితే ఈ పరిణామంపై అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ నోరు మెదపకపోవడం గమనార్హం..