Modi Check On KCR: కేసీఆర్ నిప్పు పెట్టాడు. మోదీ మాత్రం ఉప్పు వేయలేదు. కేసీఆర్ రచ్చ రచ్చ చేశాడు. మోదీ మాత్రం మౌనంగా ఉన్నాడు. “ఆన్సర్ మీ మోదీ” అంటూ కేసీఆర్ అడిగాడు. నాకెందుకులే అంటూ మోదీ మిన్న కున్నాడు. జూమ్లా, హమ్లా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా, కమాన్ నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటూ నిలదీసినా కేసీఆర్ ను మోదీ చాలా అంటే చాలా లైట్ తీసుకున్నాడు. మోడీ ఎదురుదాడి చేస్తాడేమోనని ఆశపడిన గులాబీ దళానికి నిరాశ కలిగించాడు. మొత్తానికి నిన్న జరిగిన పరేడ్ గ్రౌండ్ సభలో కేసీఆర్ పేరు ఏ మాత్రం ఎత్తకుండా మోడీ చెప్పాల్సింది చెప్పాడు. ఏం చేస్తామో చెప్పాడు. ఏ లక్ష్యంతో జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టింది చెప్పాడు.

Modi
…
నువ్వా నేనా?
…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని ఏ ముహూర్తాన ఆ పార్టీ అధిష్టానం చెప్పిందో.. అప్పటినుంచి కమలనాథులు, టీఆర్ఎస్ నాయకులు పరస్పరం కత్తులు దూసుకున్నారు. విమర్శలు హద్దులు దాటాయి. పోటాపోటీగా సభలు సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. బీజేపీకి దీటుగా నిలబడేందుకు టీఆర్ఎస్ చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఇందుకోసం ఈ సువిశాల భారత దేశ చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ సభను పూర్తి రాజకీయ సమావేశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వాడుకున్నాడు. కానీ ఆ పార్టీ కోరుకున్నంత స్థాయిలో మైలేజ్ దక్కలేదు. పైగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన నేషనల్ మీడియా హైదరాబాదులోని మౌలిక వసతుల కొరతపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. దీంతో డిఫెన్స్ లో పడిన కేసీఆర్ అండ్ కో టీం ప్రధాన మోడీ హయాంలో జరిగిన వివిధ రకాల తప్పిదాలను ఎత్తిచూపుతూ ట్విట్టర్లో “#గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్” ను ట్రెండ్ చేసింది. కానీ ప్రతిగా బీజేపీ నుంచి ఇందుకు సరైన స్పందన రాలేదు.
Also Read: Yadamma Special Dishes For PM Modi: యాదమ్మ వంటలకు ఫిదా.. టేస్ట్ చేసి మోడీ ఏమన్నాడో తెలుసా?
…
షా నుంచి బండి వరకు తిట్టి పోశారు
…
యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమంలో మోడీని తిట్టిపోసిన కేసీఆర్ పై అదే రోజు సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరలా పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ను బీజేపీ నాయకులు ఓ ఆట ఆడుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి మొదలుకొని బండి సంజయ్ దాకా కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధించారు. మరి ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కేసీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకే కేసీఆర్ ఆరాట పడుతున్నారని, ఇప్పటిదాకా సచివాలయానికి వెళ్ళని ముఖ్యమంత్రికి ఇకపై కూడా ఆ అవకాశం ఇవ్వమని అమిత్ షా తేల్చి చెప్పారు. కేసీఆర్ కుటుంబం కాలేశ్వరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నదని, ఇకపై వారి ఆటలు సాగబోవని హెచ్చరించారు. బండి సంజయ్ నుంచి అమిత్ షా వరకు అందరు కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని మాటలు మాట్లాడితే.. మోదీ మాత్రం తెలంగాణకు ఏం ఇచ్చారో, ఏం ఇవ్వబోతారో, భవిష్యత్తు లక్ష్యం ఏంటో చాలా స్పష్టంగా చెప్పారు. ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి వస్తున్నారని ఊహాగానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పేరుతో ఒక రాజకీయ పార్టీ కూడా స్థాపిస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల పంజాబ్ నుంచి కర్ణాటక వరకు పర్యటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ పత్రికలకు జాకెట్ యాడ్స్ ఇచ్చారు. అయితే యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమంలో మోడీపై కేసీఆర్ విమర్శలు చేయడం.. మరుసటి రోజు ప్రధానమంత్రి మోడీ వీటికి బదులిస్తారని చాలామంది అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి మోడీ చాలా సెటిల్ గా మాట్లాడారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు వెళ్తే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు చేస్తుంటారు. కానీ నిన్న జరిగిన పరేడ్ గ్రౌండ్ సమావేశంలో ఒక్క మాట కూడా కేసీఆర్ ను అనలేదు. తను కేసీఆర్ ను విమర్శించి అనసరంగా మైలేజ్ ఇవ్వడం ఎందుకని మోదీ భావించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మోడీతో పోల్చుకునే స్థాయి కేసీఆర్ కి ఎక్కడిదని ప్రశ్నిస్తున్నాయి. కాగా బీజేపీ లోని ఒక వర్గం నాయకులు కూడా మోదీ ప్రసంగంపై పెదవిరుస్తున్నారు. స్కై ఎలివేటర్లు, రీజినల్ కారిడార్ తప్ప కొత్తగా ఏం ప్రకటించలేదని వాపోతున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో మేము ఏ ముఖం పెట్టుకొని జనాలను ఓట్లు అడగాలని చెబుతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి రాష్ట్రానికి ఏం ప్రకటించలేదని, అన్ని జుమ్లా మాటలే మాట్లాడారని టీఆర్ఎస్ నాయకులు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీ ప్రసంగం ఎంత గొప్పగా ఉంటుందనుకుంటే చప్పగా సాగిందని పెదవిరుస్తున్నారు.
Also Read: Save AP: అదొక్కటే ఏపీని కాపాడగలదు: పవన్ కల్యాణ్