Modi Contest Rameswaram: మోడీ ఆపరేషన్ దక్షిణాది: వారణాసి తో పాటు.. ఈసారి అక్కడి నుంచీ బరిలోకి..
దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని యోచిస్తున్న భారతీయ జనతా పార్టీ.. ఆ మేరకు తన వ్యూహాలకు పదును పెడుతోంది. తమిళనాట కొరకరాని కొయ్యలా మారిన డీఎంకేను గట్టిగా ఢీకొట్టడంతో పాటు గణనీయమైన స్థానాలు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది.

Modi Contest Rameswaram: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి కాకుండా మరొక నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారా? గత పర్యాయం అక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన..ఈసారి నియోజకవర్గం పైం కూడా కన్ను వేశారా? తాజాగా ఆయన మదిలో దక్షిణాది రాష్ట్రాల్లోని ఒక నియోజకవర్గం చోటు సంపాదించుకుందా? శివుడు కొలువైన ఆ ప్రాంతం ఆయనకు బాగా నచ్చిందా? కర్ణాటకలో ఓటమి వల్ల దక్షిణాదిలో స్థానం కోల్పోయిన బిజెపికి.. అక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా తిరిగి గత వైభవాన్ని తెచ్చిపెట్టాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానాలు చెబుతున్నాయి భారతీయ జనతా పార్టీ వర్గాలు.
దక్షిణాదిలో పాగా వేయాలని..
దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని యోచిస్తున్న భారతీయ జనతా పార్టీ.. ఆ మేరకు తన వ్యూహాలకు పదును పెడుతోంది. తమిళనాట కొరకరాని కొయ్యలా మారిన డీఎంకేను గట్టిగా ఢీకొట్టడంతో పాటు గణనీయమైన స్థానాలు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం రామేశ్వరం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు బిజెపి వర్గాలు కూడా ఇందుకు తమకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెబుతున్నాయి. దీంతో కొద్దిరోజులుగా ఈ అంశం అక్కడ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయింది. గత ఎన్నికల్లో ప్రసిద్ధ శైవ క్షేత్రం వారణాసి నుంచి పోటీ చేసిన మోడీ.. ఈసారి కాశి తో పాటు రామేశ్వరంలోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఆ ప్రభావం వేరే విధంగా ఉంటుందా?
స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఓటర్ల మీద తీవ్రంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. తమ పార్టీ అభ్యర్థుల్లోనూ ఉత్సాహం తొణికిసలాడుతుందని అభిప్రాయపడుతోంది. అంతేకాదు పోటీ చేసిన రెండు చోట్ల కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం వారణాసి నియోజకవర్గానికి ప్రధానమంత్రి రాజీనామా చేస్తారని భారతీయ జనతా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రామేశ్వరం నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే 2019 ఎన్నికల్లో డిఎంకె తమకూటమి భాగస్వామి అయిన ఐఎంయూఎల్ కు ఈ స్థానాన్ని అప్పగించింది. ఆ పార్టీ తన అభ్యర్థిగా నవాజ్ ను రంగంలోకి దింపింది. అతడు భారీ మెజారిటీతో అన్నా డీఎంకేకు అభ్యర్థిపై విజయం సాధించాడు. అయితే ప్రస్తుతం ఈ స్థానం మీద మోడీ కన్ను వేసిన నేపథ్యంలో డీఎంకే పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థిని మోడీ మీద రంగంలోకి దింపాలని యోచిస్తోంది.
