Modi BRICS Summit 2023: బ్రిక్స్‌లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టిన మోదీ!
బ్రెజిల్, భారత్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ కూటమి దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా బుధవారం నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు.

Modi BRICS Summit 2023: బ్రిక్స్ కూటమిని విస్తరించాలని చైనా ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో దానిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక ప్రకటన చేశారు. తన అనుకూల దేశాలకు బ్రిక్స్‌లో సభ్యత్వం కల్పించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు మోదీ గండి కొట్టారు. సభ్యదేశాల ఏకాభిప్రాయంతో ‘బ్రిక్స్’ కూటమిని విస్తరిస్తే భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఒక్క దేశం వ్యతిరేకించినా విస్తరణ చేయకూడదని తెలిపారు.
ఆర్థిక సాయం పేరుతో ఆధిపత్యం..
చైనా కొన్నేళ్లుగా పేద దేశాలకు ఆర్థికసాయం, రుణ సాయం, పెట్టుబడుల పేరుతో ఆయా దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. శ్రీలంక, పాకిస్తాన్, తైవాన్, ఆఫ్రికా దేశాల్లో ఇలాగే పట్టు పెంచుకుంది. తాజాగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో రోడ్ల నిర్మాణం పేరుతో భారత ఆంతరంగిక వ్యవహారాలు తెలుసుకోవాలని కుయుక్తులు పన్నుతోంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా తన ఆధిపత్యం పెంచుకోవడమే లక్ష్యంగా బ్రిక్స్ విస్తరణకు కూడా సభ్య దేశాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాలోని జోహెనస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో మరోమారు విస్తరణ అంశం తెరపైకి తెచ్చారు.
నేతల మాటలు ఇలా..
బ్రెజిల్, భారత్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ కూటమి దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా బుధవారం నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అన్ని రంగాల్లో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా బ్రిక్స్ దేశాలు ముందుకు సాగాలన్నారు. అంతరిక్ష, విద్య, సాంకేతికత రంగాల్లో బ్రిక్స్ దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మాట్లాడుతూ.. బ్రిక్స్ కూటమిలో చేరేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెరుగుతున్న ఉత్సాహాన్ని చూసి తాను సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ బ్రిక్స్ సదస్సుకు ఒక వీడియో సందేశాన్ని పంపారు. ఉక్రెయిన్ పై రష్యా చేసిన దాడిని ఆయన సమర్ధించుకున్నారు. రష్యాకు అండగా ఉండాలని బ్రిక్స్ దేశాలను కోరారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని ఆరోపించారు. ప్రపంచంపై ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకునే కొన్ని పశ్చిమ దేశాల వల్లే ఉక్రెయిన్‌లో తీవ్రమైన సంక్షోభం ఏర్పడిందని పుతిన్ అన్నారు.
ఆప్రికన్ యూనియన్‌కు సభ్యత్వం..
జీ20 కూటమి ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న భారత్ ప్రతిపాదనకు బ్రిక్స్ దేశాలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో బ్రిక్స్‌లో కొత్త దేశాలను చేర్చుకోవాలంటే.. సభ్యదేశాల ఏకాభిప్రాయం తప్పనిసరి అని స్పష్టం చేశారు. దీంతో తన అనుకూల దేశాలను చేర్చుకోవాలనుకున్న చైనాకు మోదీ పరోక్షంగా చెక్ పెట్టారు.
