
AP MLC Elections Results
AP MLC Elections Results: పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీకి ఝలక్ ఇచ్చిన ఓటర్లు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న ప్రతిపక్షాలకు ఈ ఎన్నికల బూస్టప్. వై నాట్ 175 అంటూ విర్రవీగుతున్న వైసీపీ నాయకులకు తాజా ఫలితాలు చెంప దెబ్బగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు రూట్ మ్యాప్ గానే భావించాల్సి ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి రెండు చోట్ల ఘోర పరాభవం ఎదురైంది. ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించగా, తూర్పు రాయలసీమ నుంచి కంచర్ల శ్రీకాంత్ పట్టభద్రులు నియోజకవర్గం ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రధాన పార్టీలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు గతంలో లేవు. ఉపాధ్యాయ సంఘాలు, పిడిఎఫ్ వంట సంఘాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తి నెలకొంది. అంతే, ప్రతిష్టాత్మకంగా భావించిన ఆయా పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డాయి. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం, తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
వచ్చే ఎన్నికల ఫలితాలపై ప్రభావం..
తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రెండు చోట్ల విజయం దక్కించుకోవడంతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఒంటెద్దు పోకడలతో పాలన సాగిస్తున్న వైసీపీ సర్కార్కు తగిన గుణపాటాన్ని ఓటర్లు చెప్పారని ఆయా పార్టీల నాయకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను వచ్చే ఎన్నికలకు రెఫ్రెండంగా భావిస్తున్నట్లు అధికార పార్టీ నాయకులు పలు సందర్భాల్లో చెప్పారు. తాజా, ఫలితం ఆ నాయకులు పెద్ద గుణపాఠంగా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీకే పెద్ద ఎత్తున ఓటర్లు మద్దతు తెలియజేయడంతో తమకు తిరుగు లేదంటూ ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇదే అదునుగా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి వై నాట్ 175 అంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఫలితాలు అధికార పార్టీకి చెంప దెబ్బ లాంటివని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం..
ప్రస్తుతం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే ఇది ఒకటి రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితంగా చూడాల్సిన అవసరం లేదు. ఇంచుమించుగా ఇదో మినీ శాసనసభకు జరిగిన ఎన్నికలు గానే భావించాల్సి ఉంటుందన్న నిపుణులు విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ కు తగిలిన ఎదురుదెబ్బ వచ్చే ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజా ఫలితాలను విశ్లేషిస్తే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రులు, నిరుద్యోగులు అధికార పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారు. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల గెలుపును తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మధ్యస్థంగా ఉన్న ఓటర్లు ఇప్పుడు ప్రతిపక్షాల వైపు మొగ్గు చూపించేందుకు అవకాశం ఉంది. తాజా ఫలితాలు నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ సర్కార్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలించేందుకు ముందస్తుగా వచ్చిన ఎన్నికలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

AP MLC Elections Results
పలు సర్వేల్లోనూ ఇదే విషయం..
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెద్ద ఎత్తున వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా పెరిగిన ధరలు, అధ్వాన్నమైన రోడ్డులు, పెరిగిన నిరుద్యోగం, ఉపాధి కల్పన మార్గాలు లేకపోవడం వంటి అనేక అంశాలతో అనేక వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పైన ఆయా వర్గాల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పటికీ రాష్ట్రంలో నిర్వహించిన పలు సర్వేల్లోనూ ఇదే విషయం స్పష్టమైనది. దీంతో వచ్చే ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితిని తీసుకురాబోతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రూట్ మ్యాప్ గా నిపుణులు విశ్లేషిస్తున్నారు.