Delhi Liquor Scam- MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోవడంతో విచారణకు రానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు.. ఇప్పుడు ప్రస్తుతం ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కానీ న్యాయ నిపుణులు మాత్రం ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేనంత మాత్రాన విచారణకు హాజరు కానని చెప్పడం సరైనది కాదు అంటున్నారు. అసలు కవిత ఎవరి సలహా మేరకు లేఖ రాశారో అర్థం కావడంలేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు బృందం కవిత కు 160 సీఆర్సీపీ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చింది. దీని ప్రకారం ఎఫ్ఐఆర్ లో కవిత పేరు ఉండాల్సిన అవసరం లేదు. నేరానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారిని సెక్షన్ 160 సీఆర్సీపీ కింద ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం ఎమ్మెల్సీ కవితను సాక్షిగా విచారణకు పిలిచింది తప్ప ఎఫ్ ఐ ఆర్ లో పేరు ఉందని ఎక్కడా చెప్పలేదు. సి ఆర్ సి పి 160 కింద నోటీసు జారీ చేసినప్పుడు కచ్చితంగా హాజరు కావాల్సిందే. విచారణ అనంతరం ఆమె పేరు చేర్చాలా వద్దా అనేది సిబిఐ చూసుకుంటుంది.. ఒకవేళ ఎఫ్ఐఆర్ లో కవిత పేరు గనుక ఉంటే 160 కి బదులుగా 41ఏ సీఆర్సీపీ నోటీసులు ఇచ్చేవారు. నిందితులు, అనుమానితుల కు మాత్రమే 41ఏ నోటీసులు ఇస్తారు. నోటీసులు అందుకున్న వారు ఒకసారి విచారణకు గైర్హాజరైతే, మరోసారి అవకాశం ఇస్తారు. అప్పుడు కూడా రాకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.

Delhi Liquor Scam- MLC Kavitha
అధికారికంగానే పేరు
నిజానికి ఈడి అధికారికంగానే కవిత పేరు రిమాండ్ రిపోర్టులో చేర్చింది.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం ఫలానా కేసుకు సంబంధించి మీ దగ్గర చాలా సమాచారం ఉన్నట్టుంది. మిమ్మల్ని ప్రశ్నించాలి అని అడిగింది తప్ప ఆమె నిందితురాలు అని చెప్పలేదు. సో ఎఫ్ఐ ఆర్ లో ఆమె పేరు లేనట్టే కదా.. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ, సీబీఐ లతో ఈ కాలయాపన, దోబూచులాట తో ప్రయోజనం ఏముంటుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీరియస్ గా ఉన్నాయి. వీటి వెనుక ఉన్న కేంద్రం కూడా సీరియస్ గానే ఉంది. అన్నింటి కంటే కేంద్రానికి మొయినాబాద్ ఎపిసోడ్ వల్ల బాగా కాలుతోంది. అందుకే ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. తన పంటి కింద రాయిలా మారిన కేసీఆర్ ను మరింత ఇబ్బంది పెట్టేందుకే కేంద్రం ఈ కేసును ఎన్ని కోణాల్లో వత్తాలో అన్ని కోణాల్లో వత్తుతోంది..
లేఖ ఎందుకు రాసినట్టు
కవిత ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని లేఖ రాయడం అంటే… ఎఫ్ ఐ ఆర్ లో ముందుగా పేరు పెట్టి తర్వాత రండి అని చెప్పినట్టుంది. పైగా ఆరవ తేదీన కార్యక్రమాలు ముందే ఖరారై ఉంటే.. సిబిఐకి ఆ తేదీన రావాలని రెండో తారీఖు లేఖ ఎందుకు రాసినట్టు? ఎఫ్ ఐ ఆర్ లో పేరు ఉన్నా లేకపోయినా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు బృందం అడిగితే కేసు విచారణకు సహకరించాల్సిందే కదా. అందుకే కుంభకోణం కేసుల్లో వీలైనంత మౌనంగా, తగ్గి ఉండటం మంచిదని న్యాయ నిపుణులు చెబుతూ ఉంటారు.

Delhi Liquor Scam- MLC Kavitha
అతడి విషయంలోనూ..
మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులోనూ బిఎల్ సంతోష్ పేరును రాష్ట్రానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎఫ్ ఐ ఆర్ లో లేకపోయినప్పటికీ ఏకంగా 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చింది. మరి దానిని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుందో తేలాల్సి ఉంది. ఇదేదో అరెస్టు చేసే కుట్ర అనుకొని అతను కోర్టుకు వెళ్ళాడు. ఇక మద్యం కుంభకోణానికి సంబంధించి ఇది రాజకీయ ప్రేరేపితమైనదని, ఎదురుదాడి శరణ్యం అనుకునే పరిస్థితుల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు బృందానికి రాసే లేఖలో పదాలు, వేసే అడుగుల్ని ఆచితూచి వేయడం కరెక్ట్. ఆరో తారీఖు నేను ఉండను. వీలు కాదు అని చెప్తే సరిపోతుంది. కానీ ఆల్టర్నేట్ తేదీలు చెప్పడం దేనికి సంకేతం? మరో రోజున మీకు అందుబాటులో ఉంటాను అని చెబితే సరిపోయేదేమో?! గోటి తో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే ఇదే కాబోలు.