Jagan Hit List: వైసీపీ సీనియర్లు వెనుబడ్డారు. మీరు చదివింది నిజమే. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ చేపట్టిన సర్వేలో సీనియర్ ఎమ్మెల్యేలు వెనుకబడినట్టు తెలియడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. 175 నియోజకవర్గాలను టార్గెట్ చేసినట్టు ఇటీవల జగన్ ప్రకటిస్తూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు సీనియర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలియడం మింగుడుపడడం లేదు. 175 స్థానాలను పక్కనపెట్టి.. ఇప్పుడున్న స్థానాలను నిలబెట్టుకోవడం ఎలా అన్నదానిపై జగన్ ఫోకస్ పెట్టారు. అందుకే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తున్నారు. పనితీరు బాగాలేని వారిని పిలిచి మరీ మెరుగుపరచుకోవాలని ఆదేశాలిస్తున్నారు. లేకుంటే మార్పు అనివార్యమని సంకేతాలిస్తున్నారు. అభ్యర్థుల కంటే పార్టీయే ముఖ్యమని అవసరమైతే ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకుంటానని ఇప్పటికే పలుమార్లు జగన్ హెచ్చరికలు పంపారు.

Jagan Hit List
ఇప్పటికే మూడు, నాలుగుసార్లు అవకాశమిచ్చిన జగన్ ఇప్పుడు ఫైనల్ లీస్టు రూపొందించారు. అయితే అందులో అనూహ్యంగా కొందరు సీనియర్లు, పేరుమోసిన నాయకులే ఉండడం జగన్ ను కలవరపరుస్తోంది. ఆ జాబితా ఎక్కడ బయటపెడతారోనని అటు నాయకులు సైతం భయపడుతున్నారు. అసలు సీఎం ఏం చెప్పబోతున్నారు? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోనని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇప్పుడున్న సిట్టింగులలో ఎంతమంది టిక్కెట్లు దక్కించుకుంటారు? ఎంతమంది సీట్లు కోల్పోతారు? అన్నది పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వంతో పాటు పార్టీలో కీలక మార్పులు చేసిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు మదింపుపై పడ్డారు. వచ్చే ఎన్నికల్లో టిక్కట్ల విషయంలో ఒక అంచనాకు వచ్చారు. సిట్టింగుల మార్పుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
ఈ ఏడాది ఉగాది నుంచి ఇప్పటివరకూ వర్క్ షాపుల పేరిట ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు, కీలక నాయకులతో జగన్ మూడుసార్లు సమావేశమయ్యారు. రెండు నెలల కిందట జరిగిన సమావేశంలో ఏకంగా 27 మంది సిట్టింగులు వెనుకబడి ఉన్నారని పేర్లతో సహా ప్రస్తావించారు. పార్టీ కార్యక్రమాల్లో వెనుకబడ్డారని.. గడపగడపకు కార్యక్రమంతో బలం పెంచుకోవాలని సూచించారు. అయితే ఆ 27 మందిలో ఎంతమంది బలం పెంచుకున్నారు? జగన్ చేతికి అందిన నివేదికలు ఏమిటి? అందులో ఎంతమందికి మొండి చేయి చూపుతారని పార్టీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. వారిలో కొందరు పనితీరు మెరుగుపరచుకున్నారని తెలుస్తోంది. కానీ ప్రధానంగా నాలుగు జిల్లాలో 11 మంది పనీతిరు మరీ తీసికట్టుగా ఉందని.. అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారన్న టాక్ అయితే ప్రచారంలో ఉంది.

Jagan
వైసీపీకి ఐ ప్యాక్ బృందంతో పాటు పలు ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అయితే వీరు ఎప్పటికప్పుడు నియోజకవర్గాల పరిస్థితిని జగన్ కు నివేదిస్తున్నారు. అటు ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి కూడా జగన్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, సామాజిక సమీకరణలు, ప్రజా మద్దతు, ప్రత్యర్థి పార్టీల బలాబలాలు, ప్రభుత్వంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల సానుకూలత తదితర అంశాలపై సర్వే చేయిస్తున్నారు. ఇలా తీసుకున్న సమాచారం మేరకు 11 మంది పనితీరు అత్యంత పేలవంగా ఉందని తెలుస్తోంది. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల వారే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు తాజా మంత్రులు సైతం ఉన్నట్టు సమాచారం. నిత్యం వార్తల్లో నిలిచే మంత్రి అన్న టాక్ నడుస్తోంది. వీరి విషయంలో జగన్ మరోచాన్స్ ఇస్తారా? లేకుంటే ఈ వర్కుషాపులో తేల్చేస్తారా? అన్న ప్రచారమైతే పార్టీ వర్గాల్లో నడుస్తోంది.
సిట్టింగ్ స్థానాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. గత ఎన్నికల్లో 23 మంది టీడీపీ తరుపున గెలిచినా.. ఆరుగురు పార్టీకి దూరంగా ఉన్నారు. మిగతా 17 మందికి టిక్కెట్లు కన్ఫర్మ్ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే కొంతమంది సిట్టింగులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. అయితే ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనివార్యంగా మారింది. అందుకే వర్కుషాపులో నేరుగా కొందరికి అల్టిమేట్ ఇస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో నడుస్తోంది.