MI Vs Gt IPL 2023 Qualifier 2: అన్నకు చెక్ చెప్పారు.. తమ్ముడిని కట్టడి చేస్తారా.? నేడు ముంబై – గుజరాత్ టైటాన్స్ కీలక పోరు..!

ప్లే ఆఫ్ దశలో ఇరు జట్లకు భిన్నమైన ఫలితాలు ఎదురయ్యాయి. లీగ్ దశలో పది విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ చెన్నై చేతిలో ఓడిపోగా, 8 విజయాలతో కష్టపడి ముందంజ వేసిన ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోపై అద్భుత విజయాన్ని అందుకుంది.

  • Written By: BS Naidu
  • Published On:
MI Vs Gt IPL 2023 Qualifier 2: అన్నకు చెక్ చెప్పారు.. తమ్ముడిని కట్టడి చేస్తారా.? నేడు ముంబై – గుజరాత్ టైటాన్స్ కీలక పోరు..!

MI Vs Gt IPL 2023 Qualifier 2: ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. టేబుల్ టాపర్ గా గుజరాత్ ప్లే ఆఫ్ చేరగా, చేరుతుందో లేదో అనే సందేహాల మధ్య ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ లోకి దూసుకొచ్చింది. ఈ రెండు జట్ల మధ్య జరగనున్న పోరు ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ తుది దశకు వచ్చేసింది. సుమారు రెండు నెలల నుంచి ఈ లీగ్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మరో మూడు రోజుల్లో ఈ టోర్నీ ముగియనుంది. అందులో భాగంగానే శుక్రవారం అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలకమైన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించే జట్టు ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో లక్నో జట్టును ఓడించిన ముంబై జట్టు.. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను ఢీకొనబోతోంది.

భిన్నమైన ఫలితాలను చవిచూసిన ఇరుజట్లు..

ప్లే ఆఫ్ దశలో ఇరు జట్లకు భిన్నమైన ఫలితాలు ఎదురయ్యాయి. లీగ్ దశలో పది విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ చెన్నై చేతిలో ఓడిపోగా, 8 విజయాలతో కష్టపడి ముందంజ వేసిన ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోపై అద్భుత విజయాన్ని అందుకుంది. హార్దిక్ పాండ్యా బ్రదర్ కృణాల్ పాండ్యాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రోహిత్ శర్మ.. శుక్రవారం జరగనున్న మ్యాచ్ లో అదే జోరులో తమ్ముడు హార్దిక్ పాండ్యా కు షాక్ ఇస్తాడా..? లేకపోతే ఓటమికి తలవంచుతాడా..? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బలబలాల పరంగా చూస్తే రెండు జట్లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే ముంబై ఏడోసారి ఫైనల్ కు చేరినట్టు అవుతుంది. గుజరాత్ టైటాన్స్ గెలిస్తే మాత్రం వరుసగా రెండోసారి టైటిల్ ఫైట్ కు సిద్ధమవుతుంది. మరి ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

బలంగా కనిపిస్తున్న ముంబై జట్టు..

రెండు జట్లు బలంగానే ఉన్నప్పటికీ కొంత మొగ్గు ముంబై జట్టు వైపు కనిపిస్తోంది. వరుస
పరాజయాలతో ఈ సీజన్ ను ప్రారంభించిన ముంబై అనంతరం సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్ కు దూసుకొచ్చింది. సీనియర్లు విఫలమైనా యువ ఆటగాళ్లు సత్తా చాటడం, సూర్య కుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగడం ముంబై జట్టుకు కలిసి వచ్చింది. చెత్త బౌలింగ్ తో ఇబ్బంది పడిన ముంబైకి యువ పేసర్ ఆకాశ్ మద్వాల్ ఊపిరి అందించాడు. సంచలన బౌలింగ్ తో ప్రత్యర్ధుల పతనాన్ని శాసిస్తున్నాడు ఈ యంగ్ స్పీడ్ గన్. కామరాన్ గ్రీన్ సూపర్ బ్యాటింగ్ తో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తిలక్ వర్మతోపాటు ఆఖరిలో నేహాల్ వధేరా కూడా రాణిస్తున్నాడు. ముంబై బ్యాటింగ్ ఆర్డర్ ను కట్టడి చేయడం గుజరాత్ బౌలింగ్ దళానికి సవాలే. ఏ ముగ్గురు చెలరేగినా గుజరాత్ కు ఇబ్బందులు తప్పేలా లేవు.

లోపాలు సరిదిద్దుకొని చెలరేగాల్సిన గుజరాత్..

సమిష్టి ప్రదర్శనతో లీగ్ దశలో అద్భుతంగా ముగించింది గుజరాత్ జట్టు. అయితే, తొలి క్వాలిఫైయర్ లో ఊహించని పరాభవాన్ని ఎదుర్కొంది. అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది గుజరాత్ జట్టు. ఆ లోపాలను సరిదిద్దుకొని బరిలోకి దిగితే విజయం సాధించే అవకాశం ఉంది. బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది. ఈ లోపాలను సరిదిద్దుకొని ఫైనల్ చేరడానికి రెండు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పట్టుదలతో టైటాన్స్ బరిలోకి దిగుతోంది. సుబ్ మన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉండగా విజయ శంకర్ పర్వాలేదనిపిస్తున్నాడు. వీరికి వృధ్ధి మాన్ సాహా, హార్థిక పాండ్యా తోడైతే చివర్లో మిల్లర్, తెవాటియా మెరుపులు మెరూపించగల సమర్థులు. బౌలింగ్ విభాగంలో పేసర్ మహమ్మద్ షమీతోపాటు ఆఫ్గాన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ నిలకడగా రాణిస్తున్నారు. ఎస్ దయాల్ స్థానంలో గత మ్యాచ్ లో ఆడిన దర్శన్ దారుణంగా విఫలమయ్యాడు. మోహిత్ శర్మ పర్వాలేదనిపిస్తున్నాడు. సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం గుజరాత్ కు కలిసి వచ్చే అవకాశం గా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పిచ్ రిపోర్ట్..

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. అలాగే, మంచి పేస్, బౌన్స్ లభించే పిచ్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగే ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ లో నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచే జట్టు చేజింగ్ కు మొగ్గు చూపే అవకాశం ఉంది. చేజింగ్ లో మంచు ప్రభావం పెద్దగా ఉండకుండా కెమికల్స్ ఉపయోగిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు