BJP Venkaiah Naidu: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అయిపోతారని తెలుగు నాట ఓ వర్గం మీడియా.. ఓ బలమైన సామాజికవర్గం కోడై కూసింది. బీజేపీ చేస్తుందో లేదో తెలియకముందే ఆయననే ఖరారు చేసేశారని రాసేశారు. తీరా కట్ చేస్తే అసలు వెంకయ్యను బీజేపీ పరిగణలోకి తీసుకోలేదు. పోయిన సారి దళిత సామాజికవర్గానికి రాష్ట్రపతి పీఠం ఇచ్చిన బీజేపీ ఈసారి దేశంలోనే అణగారిన ఆదివాసీ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎంపిక చేసింది.
తెలుగునాట ఒక వర్గం మీడియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా తెలుగువారు కాగానే మొత్తం బట్టలు చింపుకునేలా ఎలుగెత్తి చాటింది. కేంద్రం స్తాయిలో మనవాళ్లు ఉంటే ఎప్పటికైనా లబ్ధి చేకూరుతుందని ఇలా ఓన్ చేసుకుంది. జాతీయ స్థాయిలో ఆపద వచ్చినా.. సంపతి వచ్చినా ఇది ఉపయోగపడుతుందని ఇలా చేశారు.
అయితే ఇప్పుడు దేశ అత్యున్నత పీఠంపై కూడా ఒక తెలుగు వ్యక్తి.. అదీ వారి సామాజికవర్గానికి చెందిన వెంకయ్య ఉంటే మరింతగా సౌలభ్యం ఉంటుందని ఆ వర్గం.. ఆ మీడియా కొద్దిరోజులుగా ఊదరగొడుతోంది. ఏ టీవీ డిబేట్ చూసినా వెంకయ్యను రాష్ట్రపతిని చేయాలని కోడై కూసింది.
ఇలాంటి ఊకదంపుడు ప్రచారాలు పట్టించుకోకుండా ముందుకెళ్లే బీజేపీ రాష్ట్రపతిగా గిరిజన మహిళకే పట్టం కట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.దీంతో రగిలిపోతున్న ఆ వర్గం మీడియా ఇప్పుడు రెచ్చిపోతోంది. వ్యూహాత్మకంగానే బీజేపీపై, మోడీపై ఎదురుదాడి చేస్తోంది.
బీజేపీలో సీనియర్లకు అన్యాయం అంటూ.. వెంకయ్యను ఘోరంగా ట్రీట్ చేస్తున్నారని.. సౌత్ ఇండియాను అసలు పదవుల్లో పరిగణలోకి తీసుకోవడం లేదంటూ సదురు మీడియా చానెల్స్ లో దుమ్మెత్తిపోస్తున్నారు. వెంకయ్యనాయుడును రాష్ట్రపతిని చేయని బీజేపీపై వ్యతిరేకతను ఎగదోస్తున్నారు.
ఈ విషయంలో టీడీపీ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన ఒక ఎంపీ దగ్గరుండి మరీ సొంత పార్టీనే వ్యతిరేకత వ్యాపింపచేయిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. తమ వర్గం మీడియాతో ఇదంతా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
అయితే ఎంత గగ్గోలు పెట్టినా కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం ఇవన్నీ గమనించి తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇలాంటి వారికి ఎలా చెక్ పెట్టాలో తమకు తెలుసు అని.. సమయం, సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడుతామని వారు అంటున్నారు.