IPS Transfers In Telangana: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఏదైనా సంకల్పిస్తే దానిని సాధించే వరకూ వదలడు. అవసరమైతే కాళ్లు పట్టుకుని.. అవసరం తీరాక జుట్ట పట్టుకునే రకం. ఉద్యమ సారథిగా తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రజల్లోకి వెళ్లాడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని, ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. అయితే దళిత ముఖ్యమంత్రి హామీని పక్కన పెట్టారు. తానే పీఠం ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో ముందుగా పోలీసులను మచ్చిక చేసుకునే పని ప్రారంభించారు. వేలాది వాహనాలు వారికి సమకూర్చారు. పదోన్నతులు ఇచ్చారు. తనకు నచ్చిన ఐపీఎస్‌లకు కీలక పోస్టులు ఇచ్చారు. రాజు అంగబలం సమకూర్చుకున్నట్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ రిక్రూట్‌మెంట్ చేపట్టినట్లుగా ఏ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇక పోలీస్ బదిలీల్లోనూ తనదైన మార్కు చూపుతున్నారు. అర్ధరాత్రి ఉత్తర్వులు ఇస్తూ మరుసటి రోజే జాయిన్ కావాలని ఆదేశిస్తారు. ప్రక్షాళనలో తన వంతు పాత్ర కచ్చింతాగా పోషిస్తారు. తాజాగా బుధవారం అర్ధరాత్రి జరిగిన బదిలీల్లోనూ తనదైన మార్కు ప్రదర్శించారు గులాబీ బాస్. ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే పోలీస్ శాఖ నుంచే ప్రక్షాళన షురూ చేశారు. అనూహ్య మార్పులు చేశారు. తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 91 మంది అధికారులను బదిలీ చేశారు. అందులో 51 మంది ఐపీఎస్‌లు ఉండగా.. 41 మంది నాన్ కేడర్ అధికారులు ఉన్నారు.

IPS Transfers In Telangana
సుదీర్ఘ కసరత్తు..
తెలంగాణలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సుదీర్ఘకాలం ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని భావించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారుల కోసం దాదాపుగా పోలీస్ శాఖ మొత్తాన్ని ప్రక్షాళన చేశారు. ఇందుకోసం సీఎస్ శాంతి కుమార్.. ఇన్‌చార్జి డీజీపీ అంజనీకుమార్‌తో కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారు. 91 మందిని బదిలీ చేస్తూ అర్ధరాత్రి ఆమోద ముద్ర వేశారు. వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ నెల 3వ తేదీన 29 మంది ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఒకే సారి 91 మంది పైన నిర్ణయం తీసుకుంది.
కీలక అధికారులకు స్థానచలం..
హైదరాబాద్.. రాచకొండ.. సైబరాబాద్‌సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కీలక అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుల వ్యవధిలోనే రెండు దఫాల్లో వంద మందికి పైగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కొందరికి తాను నచ్చకపోయినా.. మూడేళ్లు ఓకే చోట పని చేసిన అంశం ప్రామాణికంగా తీసుకొని బదిలీలు చేసినట్లు స్పష్టం అవుతోంది. అందులో ప్రధానంగా రాచకొండ జాయింట్ సీపీగా సత్యనారాయణ, రామగుండం సీపీగా రమా రాజేశ్వరి, రాచకొండ ట్రాఫిక్‌కు అభిషేక్ మహంతి, ఇంటెలిజెన్స్‌కు విజయ్‌కుమార్, ఏసీబీ జేడీగా చేతన మైలాబత్తుల, సైబర్ సెక్యూరిటీకి విశ్వజిత్ కాంపాటి, రఘువీర్, నార్కోటిక్స్‌కు సునీత, గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్ జోన్ డీసీపీగా, మహబూబ్‌నగర్, గద్వాల, జగిత్యాల ఎస్పీలుగా నాన్ కేడర్ అధికారులు నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న పలువురికీ పోస్టింగ్ ఇచ్చారు.

IPS Transfers In Telangana
వీరికే ఎన్నికల విధులు..
ఎన్నికల ఏడాదిలో కీలకంగా ఇప్పుడు చేసిన బదిలీలు..పోస్టింగ్‌ల ద్వారా రానున్న ఎన్నికల విధులు ఈ అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. కొంత కాలంగా పోలీసు శాఖలో బదిలీలు ఉంటాయని అందరూ భావించారు అయితే, అనూహ్యంగా ఇంత పెద్ద మొత్తంలో మార్పులు చేయటం.. అదే సమయంలో దాదాపు ప్రతీ జిల్లాలోనూ అధికారుల మార్పు జరిగింది. ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ.. ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుగా అధికార యంత్రాంగం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ పూర్తి చేసింది. ఐఏఎస్ అధికారుల బదిలీపై కూడా ప్రభుత్వం వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐఏఎస్ బదిలీలు కూడా త్వరలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఐఏఎస్‌ల బదిలీలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. వీలుకాని పక్షంలో సమావేశాలు ముగిశాక బదిలీ చేసే అవకాశం ఉంది.