Karnataka High Court: గతంలో పెద్దలు వివాహ సంబంధాలు చూసేవారు. అప్పట్లో అటు ఏడుతరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసేవారు. కుటుంబాల గురించి ఆరాతీసేవారు. వధువు, వరుడు గుణగణాలు, పుట్టు పుర్వోత్తరాలు తెలుసుకొని జాతకాలు కలిస్తేనే వివాహానికి నిశ్చయించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా ఆన్ లైన్ సైట్లలో సోషల్ మీడియాలో సంబంధాలు నిశ్చయం చేస్తున్నారు. అంతే వేగంగా వివాహాలు జరిపిస్తున్నారు. ఇద్దరికీ ఐదెంకల జీతం ఉంటే చాలూ జత కలిపేస్తున్నారు. కుల, మతాల పట్టింపులు తగ్గిపోయాయి. ఇది హర్షించదగ్గ విషయమే అయినా.. వివాహం జరిగిన కొద్దిరోజులకే విడాకులను ఆశ్రయించడం ఆందోళన కలిగిస్తోంది. విడాకులు కోరుకుంటున్న జాబితాలో జంటల సంఖ్య పెరుగుతుండడం దురదృష్టకరం.ఇలా విడిపోతున్న వారు సహేతుకమైన కారణాలు చూపలేకపోతున్నారు. కర్నాటకకు చెందిన ఓ యువకుడు వివాహం నాటికి తన భార్య మేజర్ కాదన్న కారణం చూపి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. కానీ కోర్టు అతడికి దిమ్మతిరిగే షాకిచ్చింది.

Karnataka High Court
కర్నాటకలోని మండ్య జిల్లా కు చెందిన సుశీల, మంజునాథ్ లు 2012లో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వారి కాపురం సవ్యంగా నడిచింది. అయితే అక్కడికి నాలుగేళ్ల తరువాత పెళ్లినాటికి సుశీల వయసు 18 సంవత్సరం నిండలేదని భర్త మంజునాథ్ గుర్తించాడు. అప్పటి నుంచి తనను మోసం చేసి కట్టబెట్టారంటూ భార్య, వారి పుట్టింటి వారితో మంజునాథ్ గొడవ పడుతుండేవాడు. తనకు న్యాయం చేసి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అక్కడ రెండేళ్ల పాటు విచారణ కొనసాగింది. చివరకు వివాహాన్ని రద్దుచేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో విడాకులు తీసుకోవడం అనివార్యంగా మారింది.

Karnataka High Court
అయితే భర్త నుంచి విడాకులు పొందడం ఇష్టంలేని సుశీల హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన కోర్టు ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దుచేసింది. వివాహం రద్దును కోట్టివేసింది. ఇన్నేళ్లు కాపురం చేశాక.. మైనర్ అన్న కారణం చూపి వివాహం రద్దు చేయలేమని తేల్చిచెప్పింది. జస్టిస్ అలోక్ అరాధె, జస్టిస్ విశ్వజిత్ లతో కూడిన ధర్మాసనం స్పష్టమైన తీర్పును వెలువరించింది. వైవాహిక జీవితం కొనసాగించాల్సిందేనని న్యాయమూర్తులు ఆదేశించారు.