Man Marries Twin Sisters : చదువు, ఉద్యోగం, కెరియర్.. వీటితో టెంపుల్ రన్ గేమ్ ఆడిన తర్వాత… పెళ్లి చేసుకుందామనే సమయానికి అమ్మాయి దొరకడం లేదు. ఇలా ఎంతోమంది పెళ్లి కాని ప్రసాద్ లు పెరిగిపోతున్నారు . మన కళ్ళ ముందే “ఏంటి బ్రదర్ ఈ సోలో లైఫ్” అంటూ పాటలు పాడేస్తూ జీవితాన్ని నిస్సారంగా గడిపేస్తున్నారు. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి సంప్రదాయాలే కొనసాగుతున్నాయి. ఇదంతా ఒక చర్చ.. దీని గురించి లోతుల్లోకి వెళ్లడం ఎందుకు గాని.. అసలు ఈడుకు వచ్చాక ఒక జోడు దొరకక ఇబ్బంది పడుతున్న యువకులు ఎంతోమంది. 35 ఏళ్ళు దాటినా నెత్తి మీద తలంబ్రాలు పడని వారు ఎంతోమంది. కానీ ఇలాంటి పరిస్థితిలో ఒక యువకుడు జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా ఇద్దరమ్మాయిలు తన వెంట పడేలా చేసాడు.. ఒక పెళ్లి కావడానికే నానా తంటాలు పడుతున్న ఈ రోజుల్లో.. కులం, గోత్రం, కట్నం వంటివి లేకున్నా పెళ్లి చేసుకుంటాం అనే యువకులు ఉన్న ఈ రోజుల్లో.. ఒక యువకుడు ఏకంగా ఇద్దరు అమ్మాయిలను మనువు ఆడాడు. పెళ్ళికాని ప్రసాద్ లకు అసూయ కలిగించాడు. వారి కళ్ళల్లో నీరు తెప్పించాడు.
మహారాష్ట్రలో ఘటన
ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి.. ఈ సినిమా చూశారా.. ఒక హీరోయిన్ కోసం ఇద్దరు హీరోలు పోటీ పడుతుంటారు. సాధారణంగా మనం చూసే సమాజంలో అందమైన అమ్మాయి కోసం అబ్బాయిలు తాపత్రయ పడటం గమనిస్తూనే ఉంటాం. కానీ మహారాష్ట్రలో ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి కూడా ఎంతో వైభవంగా జరిగింది. ఆ మధ్య ఇలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది . మహారాష్ట్రలో జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఇద్దరు కవలలు. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. ముంబైలోని ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నారు.. వారి పేర్లు పింకీ, రింకీ. వారిద్దరు కూడా ఒకే అబ్బాయిని ఇష్టపడ్డారు. పింకీ, రింకీ కుటుంబం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మాల్షిరాస్ తాలూకా అక్లూజ్ లో నివసిస్తోంది. కొన్ని వారాల క్రితం ఆ అమ్మాయిల తండ్రి చనిపోయాడు. తర్వాత వారి తల్లి అనారోగ్యానికి గురైంది.
ఇక్కడే సీన్ మారింది
అన్ని సినిమాల్లోనూ బలమైన నేపథ్యం ప్రేమ కథగా మారినట్టు.. ఈ అమ్మాయిల జీవితాల్లోకి అతుల్ అనూహ్యంగా ప్రవేశించాడు. పింకీ, రింకీ తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు వారికి ఇంటికి దగ్గరలో ఉండే అతుల్ పరిచయం అయ్యాడు. ఆ సమయంలో వాళ్లకి సహాయం చేశాడు. వారి మధ్య పరిచయం అలా ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఆ యువకుడిని ప్రేమించారు.. అయితే ఈ విషయంలో ముగ్గురు కలిసి ఒకే నిర్ణయానికి రావడం గమనార్హం.. వినేందుకు ఇది ఆ మధ్య వచ్చిన విజయ్ సేతుపతి, నయనతార, సమంత సినిమా మాదిరి కనిపించినా వీరి రియల్ లైఫ్ మ్యారేజ్ విషయంలో మాత్రం ఎటువంటి ట్విస్టులూ లేవు.
Two sisters, both IT professionals, from Mumbai marry same man from Akluj village in Solapur, Maharashtra. pic.twitter.com/xsTAaGhNAt
— Love (@LocalBabaji) December 4, 2022
వైభవంగా పెళ్లి
ప్రేమ తర్వాత దానికి ఫైనల్ డెస్టినేషన్ పెళ్లే కాబట్టి… ఈ ముగ్గురి పెళ్లికూడా ఘనంగా జరిగింది. పెళ్లి మండపంలో పింకీ, రింకీ కి ఏకకాలం లో అతుల్ తాళి కట్టాడు. వారిద్దరూ అతుల్ మెడలో పూలదండ వేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకరు పింకీ ని పైకి ఎత్తుకొని పట్టుకోవడంతో పూలదండ వేయగలిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ వివాహ తంతును చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటే.. పెళ్ళికాని ప్రసాద్ లు మాత్రం.. మాకు సింగిల్ టీ కే దిక్కు లేదు. నీకు మాత్రం “డబుల్” కా మీఠా నా అంటూ కన్నీరు కారుస్తున్నారు. ఒక్క పెళ్లి కావడానికే నానా సంకలు నాకుతున్న ఈ టైంలో ఇద్దరినీ చేసుకున్న వీడి అదృష్టం చూసి నెటిజన్లు కుళ్లుకు చస్తున్నారు. మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు.