Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ దశదిన కర్మ నేడు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి ఎన్ కన్వెన్షన్, జెఆర్సీ కన్వెన్షన్ హాల్స్ వేదిక అయ్యాయి. ప్రముఖులకు, అభిమానులకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. కృష్ణ సంస్మరణ సభా ప్రాంగణాన్ని అద్భుతంగా డెకరేట్ చేశారు. కృష్ణ చేసిన ఐకానిక్ చిత్రాలకు సంబంధించిన ఫోటోలు ఏర్పాటు చేశారు. కృష్ణ నట ప్రస్థానం గుర్తుకు వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. దశదిన కర్మకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో ఉదయం కుటుంబ సభ్యులు పాల్గొంటారు. మధ్యాహ్నం నుండి కృష్ణ సంస్మరణ సభకు చిత్ర ప్రముఖులు హాజరుకానున్నారు.

Super Star Krishna
ఇక వేల సంఖ్యలో అభిమానులు సంస్మరణ సభకు హాజరు కానున్నారని సమాచారం. దీని కోసం పాసులు జారీ చేస్తున్నారు. పాస్ ఉన్న వారికే ప్రవేశం ఉంటుందని వినికిడి. జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో అభిమానులను మహేష్ కలవనున్నారు. తండ్రి కృష్ణను గుర్తు చేసుకోనున్న మహేష్ అనంతరం అభిమానులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇక పలు వంటకాలతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణ పార్థివదేహం సందర్శన విషయంలో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అభిమానులపై లాఠీ ఛార్జ్ జరిగింది. కృష్ణ చివరి చూపు కోసం వచ్చిన చాలా మంది నిరాశగా వెనుదిరిగారు.
దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈసారి అలాంటి అవకతవకలకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారట. కృష్ణ మరణం కూడా ఒక సెలబ్రేషన్ గా మహేష్ అభివర్ణించాడు. అలాంటి డైనమిక్, డేరింగ్ లైఫ్ ఆయన అనుభవించారు. లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఎప్పుడూ నా హీరోగా ఉండిపోతారని మహేష్ కొద్దిరోజుల క్రితం ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు. ఇక సంస్మరణ వేదికపై కృష్ణ ఫొటోతో పాటు ఇందిరాదేవి, రమేష్ బాబు ఫోటోలు ఏర్పాటు చేయడం విశేషం.

Super Star Krishna
ఈ ఏడాది కృష్ణ కుటుంబ సభ్యులు ముగ్గురు కన్నుమూశారు. జనవరిలో అన్నయ్య రమేష్ బాబు అనారోగ్యంతో అకాల మరణం పొందారు. ఐదు పదుల వయసులోనే ఆయన లోకాన్ని వీడారు. అనంతరం సెప్టెంబర్ 28న మహేష్ తల్లిగారైన ఇందిరా దేవి కన్నుమూశారు. తల్లి మరణించి రెండు నెలలు గడవక ముందే తండ్రి కృష్ణ తుదిశ్వాస విడిచారు. నెలల వ్యవధిలో మహేష్ మూడు దుర్ఘటనలు చూశారు. నిజంగా ఇది కలలో కూడా ఎవరూ ఊహించని విషాదం. కాగా డిసెంబర్ మొదటి వారం నుండి త్రివిక్రమ్ మూవీ షూట్ లో మహేష్ పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి.