MS Dhoni IPL 2023: అనామకులను అరవీర భయంకరులుగా ధోని మార్చేశాడు..!
చెన్నై జట్టు ఓపెనర్లుగా దిగిన కాన్వే – గైక్వాడ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఒక సీజన్లో చెన్నై తరపున అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించారు.

MS Dhoni IPL 2023: చెన్నై జట్టును అద్భుత విజయాలతో దూసుకుపోయేలా చేస్తున్నది ఆటగాళ్ల సమిష్టి తత్వం.. గెలవాలన్న కసి, పట్టుదలతోపాటు మాస్టర్ మైండ్ మహేంద్రసింగ్ ధోని వ్యూహాలు. జట్టుకు ఏ ఆటగాడు ఉపయోగపడతాడో ముందుగానే లెక్కలు వేసి వారికే అవకాశాలు కల్పిస్తుంటాడు ధోని. ఆటగాళ్ళలోని ప్రతిభను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడంలో ధోని ముందు వరుసలో ఉంటాడు. అటువంటి ఎంతో మంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తమలోని ప్రతిభను బయట పెట్టారు. అదే కోవకు వస్తారు చెన్నై జట్టు ఓపెనింగ్ జోడి కాన్వే-గైక్వాడ్. చెన్నై జట్టులోకి రావడానికి ముందు వరకు అనామకులుగా ఉన్న వీరిని అరవీర భయంకరులుగా ధోని మార్చేశాడు.
ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై జట్టు విజయాలు సాధించడంలో కీలకంగా వ్యవహరించారు ఆ జట్టు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ – కాన్వే. చెన్నై జట్టులోకి రావడానికి ముందు వరకు ఈ ఆటగాళ్లు సాధారణమైన ఆట తీరును కనబరిచేవారు. కానీ, చెన్నై జట్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగిన తర్వాత వీరి ఆట పూర్తిగా మారిపోయింది. ఈ సీజన్లో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడిగా సరికొత్త రికార్డులు నెలకొల్పి తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు ఈ ఇద్దరు ఆటగాళ్లు.
14 ఇన్నింగ్స్ ల్లో 775 పరుగుల నమోదు..
చెన్నై జట్టు ఓపెనర్లుగా దిగిన కాన్వే – గైక్వాడ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఒక సీజన్లో చెన్నై తరపున అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించారు. గతంలో ఈ రికార్డు వీరి పేరు మీదే ఉండగా తాజాగా దానిని అధిగమించారు. ఈ సీజన్లో 14 ఇన్నింగ్స్ లో ఈ జోడి 775 పరుగులు నమోదు చేసింది. అంతకు ముందు 16 ఇన్నింగ్స్ లో 688 పరుగులు చేసింది ఈ జోడీ. ఆ రికార్డును ఈ ఏడాది అధిగమించారు. వీరి తరువాత హస్సి – విజయ్ జోడి 533 పరుగులు, మెక్కల్లమ్ – స్మిత్ జోడి 513 పరుగులతో తరువాత స్థానంలో ఉన్నారు. చెన్నై జట్టు ఈ ఏడాది గొప్ప విజయాలను సాధించడంలో కాన్వే – గైక్వాడ్ పాత్ర కీలకమైనదని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
చెన్నై జట్టును ఇద్దరూ.. ఒక్కోసారి ఎవరో ఒకరు..
ఈ ఏడాది చెన్నై జట్టు గొప్ప విజయాలు సాధించడంలో ఓపెనర్లు కీలకంగా వ్యవహరించారు. వీరిద్దరూ భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించడంతో అనేక మ్యాచ్ ల్లో చెన్నై జట్టు సులభంగా విజయం సాధించింది. ఒక్కోసారి ఒకరు ఫెయిల్ అయిన మరొకరు నిలబడి జట్టు గొప్ప విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. కీలకమైన భాగస్వామ్యాలను నమోదు చేయడంలో వీరిద్దరూ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. లక్నో తో జరిగిన ఒక మ్యాచ్ లో 110 పరుగుల భాగస్వామ్యం నెల కొల్పి భారీ స్కోర్ సాధించేలా చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మరో మ్యాచ్ లో 73 పరుగులు, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 42 పరుగులు, పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 86 పరుగులు, ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 32 పరుగులు, కేకేఆర్ తో జరిగిన మరో మ్యాచ్ లో 31 పరుగులు, ఢిల్లీతో జరిగిన మరో మ్యాచ్ లో 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని ఈ ఇద్దరు ఓపెనింగ్ జోడి నెలకొల్పింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో 87 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టు విజయంలో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించారు.
వ్యక్తిగతంగాను భారీగా పరుగులు..
చెన్నై జట్టు గొప్ప విజయాల సాధించడంలో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరు ఓపెనర్లు వ్యక్తిగతంగానూ భారీగా పరుగులు చేశారు. కాన్వే 15 మ్యాచ్ ల్లో 137.6 స్ట్రైక్ రేటుతో 625 పరుగులు చేయగా, రుతురాజ్ గైక్వాడ్ 15 మ్యాచుల్లో 146.88 స్ట్రైక్ రేటుతో 564 పరుగులు చేశాడు. ఇందులో ఋతురాజ్ గైక్వాడ్ నాలుగు అర్థ సెంచరీలు చేయగా, అత్యధిక స్కోరు 92 పరుగులు. కాన్వే ఐదు అర్థ సెంచరీలు పూర్తి చేయగా, అత్యధిక స్కోరు 92 పరుగులు కావడం గమనార్హం. సాధారణ ప్లేయర్లకు వరుసగా అవకాశాలు కల్పించి అరవీర భయంకరులుగా తీర్చిదిద్దిన ఘనత ధోనీకి దక్కుతుంది. చెన్నై జట్టు గొప్ప విజయాలు సాధించడంలో ఈ ఇద్దరు ఓపెనర్లు కీలకంగా వ్యవహరించారు.