మహారాష్ట్ర కూటమిలో సిఏఏ మంటలు!

  • Written By:
  • Updated On - February 19, 2020 / 03:36 PM IST


మహారాష్ట్రలో ఏర్పాటైన అఘాడీ కూటమి ప్రభుత్వంలో మూడు నెలలకే లుకలుకలు మొదలయ్యాయి. సీఏఏ, ఎన్పీఆర్ విషయంలో శివసేన, ఎన్సీపీ మధ్య విభేదాలు బయటికొచ్చాయి. సీఏఏకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే జై అంటే.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నై అంటున్నారు. మద్దతిస్తామని ఉద్ధవ్ అంటే.. వ్యతిరేకిస్తామని పవర్ స్పష్టం చేస్తున్నారు.

దీంతో కొన్నినెలలుగా సైలెంట్ మోడ్లో ఉన్న మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడి పుట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో కొన్ని నెలల కిందట కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి ‘మహావికాస్ అఘాడీ’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)పై శివసేన తమ వైఖరి తెలిపింది. ఆ రెండింటికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.

సింధుదుర్గ్లో మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్ థాక్రే.. సీఏఏతో ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు. తమ రాష్ట్రంలో ఎన్పీఆర్ అమలును అడ్డుకోబోమని తెలిపారు. శివసేన, కాంగ్రెస్‌‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్ మాత్రం భిన్నంగా స్పందించారు.

సీఏఏను వ్యతిరేకిస్తామని గతంలో చెప్పామని స్పష్టం చేశారు. అయితే దీనిపై శివసేనతో చర్చిస్తామని, ఆ పార్టీని ఒప్పిస్తామని చెప్పారు.

అయితే, భీమా–కోరెగావ్ కేసు దర్యాప్తును కేంద్రానికి అప్పగించబోమని ప్రకటించడం ద్వారా ఈ విషయంలో పవర్ ను ప్రసన్నపరచే ప్రయత్నం ఉద్ధవ్ చేశారు. ఎల్గర్ పరిషద్ కేసు దర్యాప్తును ఈ మధ్య ఎన్ఐఏకి మహా ప్రభుత్వం అప్పగించింది. దీనిపై శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో స్పందించిన ఉద్ధవ్.. ‘‘ఎల్గర్, భీమా–కోరెగావ్ కేసులు రెండూ వేర్వేరు. భీమా–కోరెగావ్ దర్యాప్తును కేంద్రానికి అప్పగించబోం. దళిత సోదరులకు అన్యాయం జరగనివ్వం”అని చెప్పారు.