మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి పెట్టిన విలేకరుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంచు విష్ణు సుదీర్ఘంగా మాట్లాడుతూ తమ ప్యానెల్ సభ్యుల గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఈ క్రమంలో ఎదుటివారి ప్యానెల్ సభ్యుల పై ఇన్ డైరెక్ట్ గా కొన్ని విమర్శలు కూడా చేశాడు. మొత్తానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ( MAA elections) మొదలవ్వక ముందే రసవత్తరమైన పోటీ మొదలైంది.
ఇంతకీ మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యుల ఎదుట విలేకరుల సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడుతూ.. ‘‘‘మా’ పుట్టి 25 సంవత్సరాలు.. తెలుగు నటులకు ఒక సంఘం ఉండాలని ‘మా’ను ఏర్పాటు చేశారు. సినిమా నటులు ఖరీదైన జీవితాలను గడుపుతారని చాలా మంది ప్రజలు అనుకుంటారు. కానీ, మేకప్ తీసేశాక మేమూ మీలాగే బతుకుతాం. బయట వాళ్లకు పెద్దగా తెలియదు. ఒక నటుడికి ఒక్కోసారి పని ఉండదు. ఏడాది కూడా పని దొరకని పరిస్థితి ఏర్పడొచ్చు. నటుడి కష్టాలు, ఆవేదన నటులుకే తెలుస్తుంది. అలాంటి నటుల కోసమే ‘మా’ ఉంది.
నిజానికి ఈ మా ప్రెసిడెంట్ అనేది ఒక బిరుదు కాదు.. అది ఒక బాధ్యత. ఆ బాధ్యతను నేను సమర్థంగా తీసుకోగలననే నమ్మకంతోనే వస్తున్నాను. అయితే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం మా నాన్నగారికి ఇష్టం లేదు. ఆ తర్వాత ఒప్పుకున్నారు. ఇక ‘మా’లో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనే సత్తా మా ప్యానెల్ కు మాత్రమే ఉంది అని మా అభిప్రాయం.
నిజమే, ప్రత్యర్థి ప్యానెల్ లో మంచి నటులు, పెద్ద నటులు ఉన్నారు. వారిలో కొందరు నా బ్యానర్ లోనూ పనిచేశారు. ఒక నిర్మాతగా వాళ్లను నా సినిమాలోకి తీసుకుంటా. కానీ మా అసోసియేషన్‌లో పనిచేసేంత సామర్థ్యం వాళ్లకు లేదు. ఈ విషయంలో నాకన్నా ఎవరూ బాగా పనిచేయలేరు. దీన్ని ఎక్కడైనా చెబుతా. వాళ్ల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.
వాళ్ల ప్రసంగాలు విన్నాను. వాళ్లు చెప్పింది 99 శాతం నేను ఆమోదించను. తినడానికే సగం మందికి తిండి లేదు. రెస్టారెంట్ కు వెళ్లి ఇక డిస్కౌంట్ లో ఎలా తినగలుగుతారు. ‘మా’ ఒక ఛారిటీ ఆర్గనైజేషన్ కాదని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ అంది. పెద్దలకు పింఛన్ ఇవ్వడాన్ని ఛారిటీ అని ఎలా అంటారము ? అది మన బాధ్యత అని ఎందుకు అనుకోకూడదు’ అంటూ మంచు విష్ణు ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు.