World Longest Train Routes: ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గాలు.. టాప్ 5 దేశాలివీ.. ఇండియా ప్లేస్ ఎంతో తెలుసా ?
అమెరికాలో మొత్తం 2,57,560 కిలోమీటర్ల పొడవుతో రైలు మార్గం ఉంది. యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొత్తం 538 రైల్వే లైన్లు ఉన్నాయి. వీటిలో ఫస్ట్ క్లాస్ రైల్వేలైన్స్ 7, రీజినల్ రైల్వేలైన్స్ 21, మిగతావి లోకల్ లైన్స్ ఉన్నాయి.

World Longest Train Routes: సుదూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించాలంటే రైలు మార్గమమే ఉత్తమం. అయితే అన్ని చోట్లా రైలు సౌకర్యం ఉండదు. కానీ కొన్ని దేశాలు ఎక్కువ శాతం పట్టాలపైనే ప్రయాణం చేస్తుంటాయి. ఆయా దేశాల్లో రైలు మార్గాలకు అనువైన ప్రదేశం ఉండడంతో పాటు అవసరాలు కూడా తీర్చడంతో రైలు మార్గాన్ని పెంచుకుంటూ పోయారు. ప్రపంచంలో పొడవైన రైలు మార్గం అమెరికాలో ఉంది. న్యూయార్క్ లోని నిర్మించిన రైల్వేస్టేషన్ కూడా ప్రపంచంలోని అతిపెద్ద రైల్వేస్టేషన్ గా రికార్డుల్లోకెక్కింది. వీటితో పాటు మరికొన్ని దేశాల్లో కూడా పొడవైన రైలు మార్గాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
అమెరికా:
అమెరికాలో మొత్తం 2,57,560 కిలోమీటర్ల పొడవుతో రైలు మార్గం ఉంది. యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొత్తం 538 రైల్వే లైన్లు ఉన్నాయి. వీటిలో ఫస్ట్ క్లాస్ రైల్వేలైన్స్ 7, రీజినల్ రైల్వేలైన్స్ 21, మిగతావి లోకల్ లైన్స్ ఉన్నాయి. యూనియన్ ఫసిపిక్ రైల్వేలైన్, బీఎన్ఎస్ఎఫ్ లైన్ ప్రపంచంలోని అతిపెద్ద సరుకు రవాణా రైలు మార్గంగా పేరెక్కాయి. ఆమ్ ట్రాక్ అనే రైలు నెట్ వర్క్ అమెరికాలోని 46 రాష్ట్రాల్లోని 500ల గమ్యస్థానాలను కలుపుతూ 30 రైలు మార్గాలకు లింక్ చేస్తుంది. 2030 నాటికి నాలుగు దశల్లో 27 వేల కిలోమీటర్లు హైస్పీడ్ రైల్వే వ్యవస్థను నిర్మించాలని ప్రణాలిక వేశారు.
చైనా:
చైనా దేశంలో రైల్వే మార్గం 1,50,000 కిలోమీటర్ల పొడవు ఉంది. చైనా రైల్వే కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ రైల్వే నెట్ వర్క్ 2013 లో 2.08 బిలియన్ ప్రయాణికులను గమ్యానికి చేరవేసింది. చైనాలో రవాణా చేసేవారు ప్రధానంగా రైలు మార్గంపైనే ఆధారపడుతారు. ప్రస్తుతం 90,000 కిలోమీటర్లు సాంప్రదాయ రైలు మార్గాలు, 10,000 హై స్పీడ్ మార్గాలను నిర్మించారు. 2050 నాటికి దేశం మొత్తం 2,70,000 కిలోమీటర్లు విస్తరించాలని ప్రణాళిక పెట్టుకున్నారు.
రష్యా:
మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న రష్యాలో 85,600 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. 2013లో వీటిపై 1.08 బిలియన్ ప్రయాణికులను, 1.2 బిలియన్ టన్నుల సరుకును తీసుకెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2009లో సెయింట్ పీటర్స్ బర్గ్, మాస్కో మధ్య సప్సాన్ హై స్పీడ్ రైలు సేవలను ప్రవేశపెట్టింది. అయితే తక్కువ స్పీడ్ రైలు కార్యకలాపాలతో ఇప్పటికే లైన్లను భాగస్వామ్యం చేయడం వల్ల సక్సెస్ కాలేదు.
ఇండియా:
భారతదేశవ్యాప్తంగా 70,225 కిలోమీటర్ల పొడవున రైలు మార్గం విస్తరించి ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలో రన్ అవుతోంది. 2013లో సుమారు 8 బిలియన్ ప్రయాణికులను, 1.01 మిలియన్ టన్నుల సరుకును తీసుకెళ్లింది. భారత్ లో రైల్వే నెట్ వర్క్ 17 జోన్ లుగా విభజించబడింది. ఇక్కడ 12,000 ప్యాసింజర్ రైళ్లు, 7,000 సరుకు రవాణా రైళ్లు నడుస్తున్నాయి.
కెనడా:
కెనడాలో 49,422 కిలోమీటర్ల రైలు మార్గాన్ని విస్తరించారు. ప్రపంచంలోని ఐదో పెద్ద నెట్ వర్క్ కెనడాలో ఉంది. అల్గోమా సెంట్రల్ రైల్వే, అంటారియో నార్త్ ల్యాండ్ రైల్వే దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణికుల సేవలను అందిస్తాయి. కెనడాలోని మాంట్రియల్, టొరంటో, వాంకోవర్ నగరాలను కలుపుతూ రైల్వే వ్యవస్థ కలిగి ఉంది. వీటిలో ప్రయాణిస్తూ అందమైన ప్రదేశాలను చూడొచ్చు.