Nara Lokesh : మంగళగిరి నుంచి సైడ్ అవుతున్న లోకేష్

అమరావతిలో జగన్ పట్టాల పంపిణీ తరువాత లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ సోషల్ మీడియా ఈ ప్రచారానికి తెరలేపింది. లోకేష్ స్పందించే వరకూ దీనిపై ఒక స్పష్టత రాదు. 

  • Written By: Dharma Raj
  • Published On:
Nara Lokesh : మంగళగిరి నుంచి సైడ్ అవుతున్న లోకేష్

Nara Lokesh : టీడీపీ యువనేత లోకేష్ సేఫ్ జోన్ చూసుకోనున్నారా? మంగళగిరికి గుడ్ బై చెప్పనున్నారా? తాజా పరిణామాలతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. మంత్రి పదవి చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. గత ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్షంగా పోటీచేశారు. మంగళగిరి నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. అయితే 2024 ఎన్నికల్లో మరోసారి అక్కడ నుంచే పోటీచేసి గెలుపొందాలని భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయన నిర్ణయం మార్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతి పూర్తిగా నిర్వీర్యమైంది. దీంతో జగన్ సర్కారుపై అమరావతి ప్రాంతంలో తీవ్ర నిరసన పెల్లుబికింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ ప్రభావం అధికంగా ఉంది. వైసీపీ సర్కారు పెద్దఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలు పెద్దగా సానుకూలతలు చూపలేదు. అయితే ఇప్పుడు అమరావతిలో 51 వేల మందికి సెంటు భూమి చొప్పున ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందించింది. దీంతో మొత్తం ఇప్పటివరకూ ఉన్న వ్యతిరేకత అంతా పోయిందని వైసీపీ భావిస్తోంది. రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వైసీపీదే విజయమని బలంగా నమ్ముతోంది.

లోకేష్ ఇప్పటికే ఒకసారి ఓడారు. ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన తొలిసారే ఓటమి ఎదురైంది. అయినా సరే మొక్కవోని దీక్షతో లోకేష్ పోరాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్నారు. అటు యువగళం పాదయాత్ర చేస్తూనే మంగళగిరిపై ప్రత్యేకంగా పోకస్ పెట్టారు. ఈ తరుణంలో లోకేష్ కు చెక్ చెప్పేందుకు జగన్ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని ప్రచారం సాగుతోంది. అయితే పంతాలకు, పట్టింపులకు పోయి మరోసారి పోటీచేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని లోకేష్, చంద్రబాబులు భావిస్తున్నట్టు వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇందులో వాస్తవం ఎంత అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఆరు నూరైనా తాను మంగళగిరి నుంచి తప్పుకోనని ఇదివరకే లోకేష్ ప్రకటించారు.

లోకేష్ మంగళగిరి నుంచి డ్రాపౌట్ కావడమే కాదు.. కృష్ణా, గుంటూరులో సేఫ్ నియోజకవర్గాలను ఎంచుకునే పనిలో పడ్డారని టాక్ నడుస్తోంది.ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని పెడ‌న లేదా గుంటూరు జిల్లాలోని పెద‌కూర‌పాడు నియోజ‌క వ‌ర్గాల్లో నిలిస్తే ఎలా వుంటుంద‌ని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని  ప్రచారం ఉంది.. ఆ రెండు చోట్ల ప్ర‌స్తుతం వైసీపీ నేత‌లే ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. పెడ‌న నుంచి గెలుపొందిన జోగి ర‌మేశ్ ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి కూడా. పెద‌కూర‌పాడు నుంచి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నంబూరి శంక‌ర్‌రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలి. అమరావతిలో జగన్ పట్టాల పంపిణీ తరువాత లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ సోషల్ మీడియా ఈ ప్రచారానికి తెరలేపింది. లోకేష్ స్పందించే వరకూ దీనిపై ఒక స్పష్టత రాదు.

సంబంధిత వార్తలు