India vs Sri Lanka First T20: స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ వల్ల కాలేదు. హిట్ మాన్ రోహిత్ శర్మ ఆ పని పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు కొత్తగా హార్దిక్ పాండ్యా వచ్చాడు. అప్పుడెప్పుడో ధోని సారథ్యంలో దక్కిన పొట్టి ప్రపంచ కప్… ఇంతవరకు మళ్ళీ భారత గుమ్మాన్ని తాకలేదు. మరి సీనియర్ల వల్ల కానిది హార్దిక్ పాండ్యా నెరవేరుస్తాడా? వచ్చే ఏడాదిలో జరిగే పొట్టి ప్రపంచ కప్ ను తెస్తాడా? ఇవన్నీ జరగాలనే భారత క్రికెట్ సమాఖ్య యోచిస్తోంది.. దీనికోసం బలమైన రోడ్డు మ్యాప్ సిద్ధం చేసింది. అంతేకాదు జట్టులో పూర్తిగా యువ రక్తాన్ని నింపింది. ఆ యువ రక్తం మంగళవారం శ్రీలంక తొలి టి20 మ్యాచ్ ఆడబోతోంది.

తొలి అడుగులకు సిద్ధం
కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ ఆటగాళ్లతో నిండిన భారత టి20 జట్టు 2024 పొట్టి ప్రపంచ కప్ లక్ష్యంగా తొలి అడుగులకు సిద్ధమైంది.. శ్రీలంకతో మూడు టి20 సిరీస్ లో తొలి మ్యాచ్ కు మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కానుంది. పూర్తిస్థాయి కెప్టెన్ గా హార్దిక్ కు ఇదే తొలి సిరీస్. రోహిత్, కోహ్లీ, రాహుల్ లాంటి సీనియర్లు ఈ సిరీస్ లో ఆడటం లేదు.. ఈ ముగ్గురు మళ్ళీ టి20లో ఆడడం కూడా సందేహంగానే ఉంది. టి20 లో సీనియర్లను పక్కనపెట్టి కుర్రాళ్ళకే పెద్ద పీట వేయాలని భారత క్రికెట్ క్రీడా సమాఖ్య లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, ఆర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి యువ ఆటగాళ్లకు జట్టులో చోటిచ్చారు.
ఓపెనర్లుగా వారిద్దరు..
శ్రీలంకతో తొలి టి20 ఆడబోతున్న టీమిండియా… సరికొత్త ప్రయోగాలు చేయబోతోంది.. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి పూర్తి యువరక్తంతో బరిలోకి దిగబోతోంది.. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఓపెనర్లుగా ఈశాన్ కిషన్, రుత్ రాజ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.. బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్… ఈ సిరీస్ లో ఎలా ఆడతాడు అనేది ఆసక్తిగా ఉంది.. రుత్ రాజ్ కూడా తనదైన ముద్ర వేసేందుకు ఈ సిరీస్ మంచి అవకాశం. ఇన్నాళ్లు నాలుగో స్థానంలో ఆడిన సూర్యకుమార్… కోహ్లీ వల్ల ఖాళీ అయిన మూడో స్థానంలో రానున్నాడు.. అతడు ఇప్పుడు జట్టుకు వైస్ కెప్టెన్ కూడా కావడం విశేషం..ఇటీవల ప్రపంచ నెంబర్ వన్ బ్యాటరీ గా నిలిచిన సూర్య… లంక బౌలింగ్ పై ఎదురుదాడి చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.. ఇక వికెట్ కీపర్ గా సంజు బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. సరైన అవకాశాలు రావడంలేదని బాధపడుతున్న సంజు ఈ సిరీస్ లో ఎలా రాణిస్తాడో చూడాలి.. హార్దిక్ పాండ్యా ఆటు బంతి, ఇటు బ్యాట్ తో రాణించాల్సిన అవసరం ఉంది.. అతడి నుంచి జట్టు మంచి ఫినిషర్ పాత్ర ఆశిస్తోంది.. ఇక ఉమ్రాన్ మాలిక్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.. మరో యువ పేసర్ ఆర్శ్ దీప్ తో అతడు బంతిని పంచుకుంటాడు.. హర్షల్ పటేల్ మూడో పేసర్ గా బౌలింగ్ వేస్తాడు.. చాహల్, సుందర్ స్పిన్ విభాగాన్ని పంచుకుంటారు. అయితే శుభ్ మన్,రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ మావి కి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.

లంక బలంగా..
కొన్ని నెలల ముందు వరకు శ్రీలంక జట్టు బలహీనంగా కనిపించేది. చిన్న జట్ల స్థాయికి పడిపోయింది.. శనక సారథ్యంలో ఆ జట్టు మెరుగుపడింది. హసరంగ, శనక, ధనుంజయ డిసిల్వా, కరుణ రత్న ఆల్ రౌండ్ ప్రదర్శనకు నిశాంక, మెండీస్ అసలంకల బ్యాటింగ్ మెరుపులు… తీక్షణ, లాహిరు కుమార లాంటి బౌలర్ల నిలకడ తోడై లంక ఆట మెరుగుపడింది.. ఆసియా కప్ గెలుచుకున్న ఆ జట్టు.. టి20 ప్రపంచ కప్ లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది..
పరుగుల పండగ
ఈరోజు ముంబైలో జరిగే మ్యాచ్లో పరుగుల పండుగ ఖాయమని క్యూరేటర్ చెప్తున్నాడు. ఇదే వేదికపై 2011లో శ్రీలంక పై భారత్ ప్రపంచ కప్ ఫైనల్ గెలిచింది.. ఇక ఈ మైదానంపై భారత జట్టుకు మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. పిచ్ పై తేమ ఉండే నేపథ్యంలో చేజింగ్ కు దిగే జట్టుకు గెలిచే అవకాశాలు ఉన్నాయి.
జట్ల అంచనా
భారత్: ఇషాన్ కిషన్, రుత్ రాజ్, సూర్య కుమార్ యాదవ్, సంజు, హార్ధిక్ ( కెప్టెన్), దీపక్/ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, ఆర్ష్ దీప్, ఉమ్రాన్ మాలిక్, యజ్వేంద్ర చాహల్.
శ్రీలంక: నిస్సాంక, కుషాల్ మెండీస్, ధనంజయ డిసిల్వ, అసలంక, రాజ పక్స, షనక( కెప్టెన్), హసరంగ, కరుణ రత్న, తీక్షణ, మదు శంక, లాహిరు.