How to increase CIBIL score fast: ప్రస్తుతం వ్యక్తిగత రుణం, హోం లోన్, వాహన రుణం పొందేటప్పుడు బ్యాంకులు ఎక్కువగా పరిశీలించే అంశం సిబిల్ స్కోరు. సాధారణంగా సిబిల్ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్థిక నిపుణులు సిబిల్ స్కోరును 750కు పైగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఒక్కోసారి సిబిల్ స్కోరు తగ్గితే వడ్డీ రేటు ఎక్కువగా విధిస్తారు. ఇలాంటప్పుడు సిబిల్ స్కోరును త్వరగా పెంచుకోవాలంటే ఏం చేయాలి?
సిబిల్ స్కోరు అనేది వ్యక్తి రుణాలను ఎంత బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నాడో తెలియజేసే క్రెడిట్ రేటింగ్. సాధారణంగా ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. స్కోరు ఎక్కువగా ఉంటే బ్యాంకులకు ఆ వ్యక్తిపై నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా రుణం త్వరగా మంజూరు కావడం, తక్కువ వడ్డీ రేటు లభించడం, ఎక్కువ క్రెడిట్ పరిమితి పొందడం వంటి ప్రయోజనాలు ఉంటాయి.
సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నవారు ముందుగా ఇప్పటికే ఉన్న రుణాల ఈఎంఐలను సమయానికి చెల్లించాలి. ఒక్క EMI కూడా మిస్ కాకుండా చెల్లించడం వల్ల క్రమంగా స్కోరు మెరుగుపడుతుంది. అయితే క్రెడిట్ హిస్టరీ బలహీనంగా ఉన్నవారికి లేదా మొదటిసారి క్రెడిట్ ప్రొఫైల్ నిర్మించుకోవాలనుకునేవారికి FD ఆధారిత క్రెడిట్ కార్డు మంచి ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.
FD ఆధారిత క్రెడిట్ కార్డు అంటే ఏమిటి?
ఇది సాధారణ క్రెడిట్ కార్డు లాంటిదే. అయితే బ్యాంకు ముందుగా మీ పేరుపై ఒక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) తీసుకుని, దానిని భద్రతగా ఉంచి క్రెడిట్ కార్డును జారీ చేస్తుంది. దీనిని సాధారణంగా “సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్” అని కూడా పిలుస్తారు. సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నా లేదా అసలు క్రెడిట్ హిస్టరీ లేకపోయినా ఈ కార్డు పొందడం సులభంగా ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
చాలా బ్యాంకులు మరియు ఫిన్టెక్ సంస్థలు ఆన్లైన్లోనే FD ఆధారిత క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. సంబంధిత బ్యాంకు మొబైల్ యాప్ లేదా వెబ్సైట్లోకి వెళ్లి Secured Credit Card లేదా Credit Card Against FD ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత అవసరమైన KYC పూర్తి చేసి, నిర్ణీత మొత్తాన్ని FDగా డిపాజిట్ చేయాలి. డిపాజిట్ పూర్తైన తర్వాత కార్డు జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
కొన్ని బ్యాంకులు, డిజిటల్ ఫైనాన్స్ సంస్థలు రూ.2,000 లేదా అంతకంటే తక్కువ మొత్తంతో కూడా FD ఆధారిత డిజిటల్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. సాధారణంగా రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ FD చేస్తే ఫిజికల్ క్రెడిట్ కార్డు కూడా జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే కనీస FD మొత్తం బ్యాంకు లేదా సంస్థను బట్టి మారవచ్చు.
సిబిల్ స్కోరు ఎలా పెరుగుతుంది?
FD ఆధారిత క్రెడిట్ కార్డు ద్వారా చిన్న చిన్న కొనుగోళ్లు చేసి, ప్రతి నెల బిల్లు గడువు తేదీకి ముందే పూర్తిగా చెల్లిస్తే ఆ వివరాలు క్రెడిట్ బ్యూరోలకు చేరతాయి. దీంతో మీరు బాధ్యతాయుతంగా క్రెడిట్ వినియోగిస్తున్నారని రికార్డు ఏర్పడుతుంది. ఇది క్రమంగా సిబిల్ స్కోరు పెరగడానికి సహాయపడుతుంది.క్రెడిట్ లిమిట్ మొత్తాన్ని పూర్తిగా వినియోగించకుండా ఉండటం మంచిది. సాధ్యమైనంత వరకు లిమిట్లో 30 శాతం వరకు మాత్రమే ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తారు. అలాగే కనీస బకాయి మాత్రమే కాకుండా మొత్తం బిల్లు చెల్లించడం వల్ల క్రెడిట్ ప్రొఫైల్ మరింత బలపడుతుంది. ఆలస్య చెల్లింపులు చేస్తే స్కోరు పెరగడం బదులుగా తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది.
సిబిల్ స్కోరు తక్కువగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమయానికి EMIలు చెల్లించడం, క్రెడిట్ కార్డును బాధ్యతాయుతంగా ఉపయోగించడం, ముఖ్యంగా FD ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును సక్రమంగా నిర్వహించడం ద్వారా కొద్ది నెలల్లోనే క్రెడిట్ ప్రొఫైల్ను మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందాలనుకునేవారికి ఇది ఉపయోగకరమైన మార్గంగా చెప్పవచ్చు.
