Site icon OkTelugu

Sudden AC Exposure After Heat Risks: ఎండ నుంచి ఇంటికి రాగానే AC గదిలోకి వెళ్లేవారు జాగ్రత్త.. ఎందుకంటే..

Sudden AC Exposure After Heat Risks

Sudden AC Exposure After Heat Risks

Sudden AC Exposure After Heat Risks: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలు నమోదు కావడంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే గడపడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే అనుకోని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎండలో ఎక్కువసేపు తిరిగిన తర్వాత ఒక్కసారిగా AC గదిలోకి వెళ్లడం చాలా మందికి రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ వైద్య నిపుణుల ప్రకారం.. ఇది శరీరానికి అంత మంచిది కాదు. మన శరీరం సహజంగా ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కొన్ని ప్రత్యేకమైన మెకానిజమ్స్‌ను ఉపయోగిస్తుంది. అవి ఒక్కసారిగా మారితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

మానవ శరీరం తన ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోవడానికి చెమట పడటం, రక్తనాళాలు విస్తరించడం వంటి ప్రక్రియలను అనుసరిస్తుంది. ఎండలో ఉన్నప్పుడు శరీరం వేడిని బయటకు పంపేందుకు చెమట రూపంలో విడుదల చేస్తుంది. ఈ సమయంలో రక్తనాళాలు విస్తరించి చర్మానికి ఎక్కువ రక్తప్రవాహం చేరేలా చేస్తాయి. దీనివల్ల శరీరం క్రమంగా చల్లబడుతుంది.

అయితే ఎండ నుంచి నేరుగా చల్లని AC గదిలోకి వెళ్లినప్పుడు ఈ ప్రక్రియలకు ఒక్కసారిగా షాక్ లాంటిది కలుగుతుంది. బయట వేడి వాతావరణానికి అలవాటు పడిన శరీరం, ఒక్కసారిగా చల్లని గాలికి గురైతే రక్తనాళాలు వెంటనే కుదించుకోవడం మొదలవుతుంది. ఈ మార్పు వల్ల తలనొప్పి, తిమ్మిరి, అలసట వంటి సమస్యలు రావచ్చు. కొంతమందిలో ఇది మరింత ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సైనస్, అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారిలో చల్లని గాలి వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. అలాగే చెమటతో ఉన్నప్పుడు వెంటనే చల్లని గాలి తగలడం వల్ల జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.

వైద్యులు తెలుపుతున్న ప్రకారం.. ఎండ నుంచి వచ్చాక వెంటనే AC గదిలోకి వెళ్లకూడదు. ముందుగా కొద్దిసేపు నీడలో లేదా సాధారణ గదిలో ఉండి శరీరాన్ని క్రమంగా చల్లబరచాలి. చెమట ఆగిన తర్వాత మాత్రమే AC గదిలోకి వెళ్లడం మంచిది. అలాగే నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం. ఎండలో తిరిగిన తర్వాత శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. వెంటనే చల్లని గదిలోకి వెళ్లే ముందు గోరువెచ్చని లేదా సాధారణ నీళ్లు తాగితే శరీరం సమతుల్యం అవుతుంది.

Exit mobile version