Homeక్రీడలుTeam India: గెలిచిన సంబురం లేదు.. టీమిండియా దుస్థితి మారేదెప్పుడు?  

Team India: గెలిచిన సంబురం లేదు.. టీమిండియా దుస్థితి మారేదెప్పుడు?  

Team India: భారత క్రికెటర్లను అభిమానులు దేవుడితో సమానంగా చూస్తారు. కోహ్లీ ఫోర్‌ చప్పట్ల కొడతారు.. సింగ్‌ కొడితే ఎగిరి గంతేస్తారు.. సెంచరీ చేస్తే సంబురాలు చేసుకుంటారు. ఔట్‌ అయితే తీవ్రంగా బాధపతారు. ఒక్క కోహ్లీనే కాదు.. టీం ఇండియాలో ఎవరు ఆడినా సగటు అభిమాని సంబురం ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. ప్రత్యర్థి వికెట్లు పడగొట్టే బౌలర్లను ఎంకరేజ్‌ చేస్తారు. అంతపిచ్చి మన క్రికెటర్లు అంటే. కానీ ఇటీవల టీం ఇండియా పేలవ ప్రదర్శనతో చతికిల పడుతోంది. ఈ ఏడాది ఆరంబంలో అదరగొట్టిన జట్టు ఇప్పుడు అపజయాలు, పకీర్తి మూటగట్టుకుంటోంది. సగటు అభిమానిని నిరాశపరుస్తోంది. గెలిచినా.. హమ్మయ్య గెలిచాం అనే పరిస్థితికి దిగజారిపోయింది. భారత క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులోనూ విజయం సాధించింది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. కానీ అభిమానులు సంబురాలు చేసుకోలేని పరిస్థితి. క్రికెటర్ల ఆటతీరు చూసి ఏమైపోతోంది మన క్రికెట్‌కు అన్న ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. ఒక విజయం అన్ని లోపాలనూ కప్పేస్తుందని, ఒక ఓటమి లేని బలహీనతల్ని ఎత్తి చూపిస్తుందని నానుడి. కానీ మన క్రికెటర్లు గెలిచినా వైఫల్యాలే అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Team India
Team India

గెలుపు మత్తులో ఉంటే కష్టమే..
బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న టీం ఇండియా వన్టే సిరీస్‌ కోల్పోయింది. టీ20లో పరవలేదనిపించింది. టెసు సిరీస్‌లో చావుతప్పి కన్ను సొట్టపోయిన చందంగా గెలిచి హమ్మయ్య గెలిచాం అనిపించింది. ఈ గెలుపు మత్తులో.. టాప్‌ఆర్డర్‌ వైఫల్యం, సెలక్షన్‌ తప్పిదాలు, స్టార్‌ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన వంటి విషయాలను పట్టించుకోకుండా వదిలేస్తే, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే భారత క్రికెట్‌కు జరిగే నష్టాన్ని నివారించడం కష్టం. కొందరు ఆటగాళ్ల పోరాటం వల్ల, కాస్త అదృష్టం కూడా కలిసొచ్చి రెండో టెస్టు భారత్‌ సొంతమైంది కానీ.. మీర్పూర్‌లో మన జట్టు ప్రదర్శన చూశాక నిజంగా విజయానికి అర్హమైందా అంటే ధీమాగా ఔనని చెప్పలేని పరిస్థితి.

అన్నీ తప్పిదాలే..
సెలక్షన్‌ దగ్గర్నుంచి ఆటతీరు వరకు మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా చేసిన తప్పుల చిట్టా పెద్దదే. బంగ్లాదేశ్‌ లాంటి బలహీన జట్టుపై చచ్చీ చెడీ గెలవడం అంటే ఓటమితో సమానం! పేరుకు మనది పెద్ద జట్టే కానీ.. బంగ్లాదేశ్‌ పర్యటనలో మనవాళ్లు ముందు వన్డే సిరీస్‌ కోల్పోయారు. టెస్టు సిరీస్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. రెండో టెస్టులో ఓటమి భయం కూడా వెంటాడింది. శ్రేయస్‌తో కలిసి లోయరార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అశ్విన్‌ వీరోచితంగా ఆడబట్టి రెండో టెస్టు గెలిచాం కానీ.. లేదంటే ఓటమి తప్పకపోయేది.

కొన్నేళ్లుగా నిలకడ లేమికి మారుపేరుగా మారుతున్న టాప్‌ఆర్డర్‌.. ఈ మ్యాచ్‌లో మరింత పేలవ ప్రదర్శన చేసింది.

కోహ్లీ పూర్తిగా విఫలం..
ఒకప్పుడు పెట్టని కోటలా ఉన్న కోహ్లి ఇప్పుడు వరుస వైఫల్యాలతో జట్టుకు భారమవుతున్నాడు. 1, 19, 24, 1.. ఇవీ బంగ్లాతో టెస్టు సిరీస్‌లో కోహ్లి స్కోర్లు. బ్యాటింగ్‌తో పాటు అతడి ఫీల్డింగ్‌ ప్రమాణాలు కూడా పడిపోతున్నాయి. రెండో టెస్టు మూడో రోజు అతను స్లిప్‌లో మూడు క్యాచ్‌లు వదిలేశాడు. కేఎల్‌.రాహుల్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. తాత్కాలికంగా జట్టు పగ్గాలందుకున్న అతను ముందుండి నడిపిస్తాడనుకుంటే.. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 22, 23, 10, 2 పరుగులే చేశాడు. రోహిత్‌ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు కానీ.. ఇటీవల అతడి ప్రదర్శనా అంతంతమాత్రమే. పుజారాలో నిలకడ లోపించింది. తొలి టెస్టులో సెంచరీ చేసిన అతను.. రెండో మ్యాచ్‌లో తేలిపోయాడు. పుజారాతోపాటు శుభ్‌మ¯Œ రెండో ఇన్నింగ్స్‌లో పేలవమైన ఫుట్‌వర్క్‌తో వికెట్లు సమర్పించుకున్నారు. టర్న్‌ అవుతున్న బంతుల్ని బ్యాక్‌ఫుట్‌పై ఆడాలన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచి ముందుకెళ్లి ఆడి స్టంపౌటవడమేంటో?

Team India
Team India

టాప్‌ ఆర్డర్‌ వైఫల్యంతో ఒత్తిడి..
టీం ఇండియా టాప్‌ఆర్డర్‌ వైఫల్యంతో తర్వాతి బ్యాటర్ల మీద ఒత్తిడి పెరుగుతోంది. లోయరార్డర్‌ ఆటగాళ్లు ఎన్ని మ్యాచ్‌ల్లో జట్టును రక్షిస్తారు? ఫ్లాట్‌ పిచ్‌లు ఎదురైనపుడు బాగా ఆడేసి సగటులు సరిచేసుకుంటున్నారే తప్ప.. ఎలాంటి పిచ్‌లు, పరిస్థితుల్లో అయినా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లు కరవైన తీరు బంగ్లాదేశ్‌ పర్యటనలో స్పష్టంగా కనిపించింంది. బాగా బౌన్స్‌ అయ్యే, ఎక్కువ స్పిన్‌ తిరిగే పిచ్‌ల మీద నిలబడి ఆడే బ్యాటర్లు కనిపించ లేదు.

పెరుగుతున్న ‘స్టార్‌’ సంస్కృతి…
ఈ మధ్య జట్టులో ‘స్టార్‌’ సంస్కృతి బాగా పెరిగిపోతోంది. గత ప్రదర్శనల ఆధారంగానే చాలామంది జట్టులో కొనసాగుతున్నారు. స్టార్‌ హోదా, బోర్డులో తమకున్న అండదండలతో తమ స్థానాలకు ముప్పేమీ లేదన్న ధీమా కొందరిలో కనిపిస్తోంది. ఏ ఆటగాడూ వైఫల్యాలను అధిగమించేందుకు శ్రమిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒకప్పుడు గావస్కర్‌ లాంటి దిగ్గజాలు అంతర్జాతీయ మ్యాచ్‌ల మధ్య కాస్త ఖాళీ దొరికితే రంజీ మ్యాచ్‌లు ఆడేవాళ్లు. సచిన్‌ ఎన్నడూ ప్రాక్టీస్‌కు దూరమయ్యేవాడు కాదు. ఏ సిరీస్‌ నుంచి విరామం తీసుకునేవాడు కాదు. కానీ ఇప్పటి ఆటగాళ్లు పనిభారం పేరుతో తరచుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. దేశవాళీల జోలికే వెళ్లట్లేదు. మ్యాచ్‌ల్లో వరుస వైఫల్యాలు, చేసిన తప్పులే చేయడం చూస్తే నెట్స్‌లో వీళ్లు ఏమాత్రం శ్రమిస్తున్నారన్న సందేహాలు కలుగుతున్నాయి. పేరు గొప్ప ఆటగాళ్ల విషయంలో వీలైనంత త్వరగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

బీసీసీఐ ఏం చేస్తోంది..?
అన్ని ఫార్మాట్లలోనూ జట్టు ప్రదర్శన పడిపోతోంది. స్టార్‌ ఆటగాళ్లు రోజురోజుకూ జట్టుకు భారంగా మారుతున్నారు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. సెలక్టర్లు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. మరి మన క్రికెట్‌ వ్యవస్థను నడిపిస్తున్న బీసీసీఐ ఏం చేస్తోందన్నది ప్రశ్న? టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత జట్టు అంత ఘోరమైన ప్రదర్శన చేశాక కనీసం ఒక సమీక్ష సమావేశం లేదు. ఎవరి మీదా చర్యలు లేవు. బంగ్లాదేశ్‌ చేతిలో వన్డే సిరీస్‌ ఓడినా అంతా గప్‌చుప్‌! బోర్డులో క్రికెట్‌ పాలనను పట్టించుకునే, జట్టును గాడిన పెట్టే వారు కరవయ్యారన్నది ఇటీవల వినిపిస్తున్న విమర్శ. దేశంలో క్రికెట్‌ ప్రతిభకు లోటు లేకపోయినా, అద్భుతమైన ఆటగాళ్లు రాష్ట్ర స్థాయుల్లో ఉన్నా వారికి సరైన ప్రోత్సాహం అందించి టీం ఇండియాలోకి తెచ్చే ప్రయత్నం ఇటీవల కాలంలో సరిగా జరగట్లేదనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డయిన బీసీసీఐ.. రాష్ట్ర సంఘాలకు డబ్బులిచ్చేసి చేతులు దులుపుకుంటోందే తప్ప, ఆయా రాష్ట్రాల్లో ప్రతిభాన్వేషణ మీద దృష్టి పెట్టట్లేదు.

Team India
Team India

క్రికెట్‌ సంఘాలదీ అదే పరిస్థితి..
దేశంలో రెండు మూడు రాష్ట్రాలు మినహాయిస్తే చాలా వరకు క్రికెట్‌ సంఘాలు సరైన దారిలో నడవట్లేదు. హైదరబాద్‌ క్రికెట్‌ సంఘం విషయానికే వస్తే ప్రతిభావంతుల్ని వెలుగులోకి తెచ్చి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యతను అదెప్పుడో పక్కన పెట్టేసింది. రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు, అశ్రిత పక్షపాతం, అవినీతితో రోజురోజుకూ భ్రష్టుపట్టిపోతోంది. ఇక్కడ భవిష్యత్‌ లేదని యువ ఆటగాళ్లు వేరే రాష్ట్రాలకు తరలివెళ్లడం, లేదంటే క్రికెట్‌ మానేసి వేరే కెరీర్‌ చూసుకుంటుండడం వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందనడానికి నిదర్శనం. ఆంధ్రా క్రికెట్‌ సంఘం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఓవైపు రాష్ట్ర సంఘాలను పర్యవేక్షిస్తూ ప్రతిభావంతులను వెలుగులోకి తేవడం, అలాగే జాతీయ జట్టును గాడిన పెట్టడం బీసీసీఐ ముందున్న తక్షణ కర్తవ్యాలు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయించిన విండీస్‌ ఎలా పతనమైందో, మేటి జట్లలో ఒకటిగా ఉన్న దక్షిణాఫ్రికా ఎలా గాడి తప్పుతోందో చూసైనా బీసీసీఐ మేల్కోవాలి. లేకుంటే భారత క్రికెట్‌ అట్టడుగు స్థాయికి చేరడానికి ఎంతో కాలం పట్టదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular